ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. శనివారం స్థానిక కుమురంభీం కాంప్లెక్స్‌లోని ఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల ఆదివాసీ సర్‌మేడిలు, వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రధానమంత్రి జుగా పథకంలో భాగంగా ఉట్నూర్‌కు కేంద్ర గ్రంథాలయం మంజూరైందన్నారు. విద్యార్థులు, యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన పుస్తకాలు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలు తెలపవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రుత్విస్ సాయి కొట్టే, ఐటీడీఏ అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, సర్‌మేడిలు, తదితరులు పాల్గొన్నారు.


