నేను 2006లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన జిల్లా ఆస్పత్రిలో పనిచేశాను. 2021లో రెగ్యులర్ ఉద్యోగం వచ్చింది. వైద్య వృత్తిపై మక్కువతో పాటు లైఫ్ సెట్ అవుతుందని ఈ వృత్తిని ఎంచుకున్నాను. నా చెల్లె జ్యోత్స్న సైతం స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. నేను 2007 నుంచి 2021 వరకు రిమ్స్‌లోని ఏఆర్టీ విభాగంలో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించాను. పలువురు ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించగా, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఆ వార్డులో పని చేసినప్పుడు నన్ను భయపెట్టారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందించాను.
– కె.స్వప్న మేరి, స్టాఫ్ నర్సు
భద్రత లేకపోయినా..
నేను 2014 నుంచి 2020 వరకు నిర్మల్ జిల్లాలోని దస్తూ రాబాద్ పీహెచ్‌సీ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేశాను. అది రౌండ్‌దిక్లాక్ పీహెచ్‌సీ. రాత్రి సమయంలో ఎలాంటి భద్రత లేకపోయినప్పటికీ విధులు నిర్వర్తించాను. ఆ ప్రాంతంలో పాము, కుక్క కాటు కేసులు అధికంగా వచ్చేవి. రక్తపింజర కాటుకు గురైన పలువురు ప్రాణాపాయ స్థితిలో వచ్చారు. వారికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడడం మరిచిపోలేను. మా అమ్మ, అక్కయ్యకు ఆరోగ్యం బాగలేనప్పుడు నేను కూడా డాక్టర్ కావాలనే ఆలోచన వచ్చింది. ఆర్థిక పరిస్థితులతో కాలేకపోయాను. ఏఎన్‌ఎం శిక్షణ పొంది స్టాఫ్ నర్సుగా సేవలు అందిస్తున్నాను.
– ఇందిరా, స్టాఫ్‌నర్సు


