‘సాక్షి’ చొరవ.. | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ చొరవ..

Mar 17 2026 7:52 AM | Updated on Mar 17 2026 7:52 AM

ఆదిలాబాద్‌ విమానాశ్రయ పనులు వేగవంతం

గవర్నర్‌ ప్రసంగంలో వెల్లడి

జూన్‌లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన..?

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఆదిలాబాద్‌ అభివృద్ధిపై గవర్నర్‌ ప్రస్తావించారని, ఇది శుభసూచకమని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అభిప్రాయపడ్డారు.

జూన్‌ 2న శంకుస్థాపనకు అవకాశం

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్‌ 2న ప్రధాని చేతుల మీ దుగా ప్రత్యక్షంగా శంకుస్థాపన నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు సంబంధించి ఇప్పటికీ 369 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. తొలుత విమానాశ్రయం ఏర్పాటుతో పాటు రానున్న రోజుల్లో వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ విషయంలో నిధుల మంజూరు జరగాల్సి ఉంది. దీనికి బడ్జెట్‌ కేటాయిస్తే ముందడుగు పడుతుంది.

ఆదిలాబాద్‌ విమానాశ్రయ మైదానం

‘తెలంగాణ ప్రాంతంలో విమాన అనుసంధానతను మెరుగుపర్చడానికి కేంద్రం చొరవ చూపుతుంది.. ఇందులో భాగంగా వరంగల్‌, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించింది.. పనుల వేగవంతానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది..’ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా సోమవారం ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్న మాటలివి.

– సాక్షి,ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటు విషయంలో గతంలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో పట్టణంలోని మేధావులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి చర్చా వేదిక నిర్వహించిన విషయం విదితమే. ఈ క్రమంలో స్థానిక ఎంపీ గోడం నగేశ్‌ పలుమార్లు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడం, అలాగే స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు తీసుకురావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు తన బాధ్యతగా పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం సైతం తదనుగుణంగా చర్యలు చేపట్టడంతో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement