పక్కాగా పంటల నమోదు
నేరడిగొండ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు వివిధ పంటల సాగు చేపడుతున్నారు. ఆ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే తక్కువ సమయంలో ప్రతీ రైతు వద్దకు వెళ్లి పంట నమోదు కష్టతరంగా మారింది. మహిళా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటికితోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పథకాలు, ధాన్యం కొనుగోళ్లు, రైతులకు సకాలంలో యూరియా అందించడం వంటి పనుల్లో అధికారులు తలమునకలవుతున్నారు. విషయాన్ని వారు ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నారు. పంటల నమోదు బాధ్యతల నుంచి తొలగించాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో పంటల డిజిటల్ సర్వేకు వలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యవసాయ అధికారులకు ఊరట కలిగింది.
స్థానిక యువతకు ఉపాధి..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 304 క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 1,758 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గ్రామానికో వలంటీర్‌ను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. స్థానికంగా వ్యవసాయ డిగ్రీ, డిప్లొమా, సైన్స్ గ్రాడ్యుయేట్, ఇతర డిగ్రీలు ఉత్తీర్ణులైన వారిని విధుల్లోకి తీసుకునేందు కు కసరత్తు చేస్తోంది. వీరు అందుబాటులో లేకుంటే ఇంటర్, పది పూర్తి చేసిన వారిని సైతం తీసుకునేలా ఏవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక యువతకు ఉపాధితో పాటు కొంత వరకు నిరుద్యోగ సమస్య తీరేందుకు ఆస్కారం ఉంది.
తొలుత శిక్షణ..
వలంటీర్ల నియామకంపై త్వరలో స్పష్టత రానుంది. ఎంపికై న వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. క్షేత్రస్థాయిలో మొబైల్ ఫోన్‌లో ఏ పంట ఎలా నమోదు చేయాలి.. ఎప్పటి వరకు పూర్తి చేయాలి.. తదితర విషయాలన్నింటిపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం పంటల నమోదు ప్రక్రియను పక్కాగా పూర్తి చేస్తారు.
స్థానికులకే ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లాలో1758 రెవెన్యూ గ్రామాల్లో సర్వేయ ర్లు (వలంటీర్ల)ను నియమించనున్నారు. స్థాని కులు, సెల్‌ఫోన్‌పై పరిజ్ఞానం కలిగి ఉండి, సైన్స్ డిగ్రీ పొందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. వారు అందుబాటులో లేకుంటే పది, ఇంటర్ పూర్తి చేసుకున్న వారిని నియమించుకోవాలని పేర్కొన్నారు. అప్‌లోడ్ చేసే ప్రతీ చిత్రానికి రూ.7 ఇస్తారు. గ్రామాల వారీగా అభ్యర్థులను గుర్తించి జాబితా పంపించాలని ఏఈవోలకు తెలిపారు. 45 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాల్సి ఉంది.
జిల్లా రైతులు సాగు (లక్షల క్లస్టర్లు
(లక్షల్లో) ఎకరాల్లో)
ఆదిలాబాద్ 1.47 5.79 102
నిర్మల్ 1.91 4.15 79
మంచిర్యాల 1.65 3.40 55
కుమురంభీం 1.19 4.33 68


