గేట్‌ కష్టాలకు చెక్‌ పడినట్లేనా.. | - | Sakshi
Sakshi News home page

గేట్‌ కష్టాలకు చెక్‌ పడినట్లేనా..

Jan 12 2026 7:20 AM | Updated on Jan 12 2026 7:20 AM

గేట్‌

గేట్‌ కష్టాలకు చెక్‌ పడినట్లేనా..

తాంసి బస్టాండ్‌ వద్ద ఆర్‌యూబీ నిర్మాణం నేటి నుంచి ప్రారంభం కానున్న పనులు ఆరు నెలల పాటు ట్రాఫిక్‌ మళ్లింపు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తే మేలనే అభిప్రాయం

కై లాస్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు సుమారు 50కి పైగా గ్రామీణ ప్రాంతాల ప్ర జలకు ఇబ్బందికరంగా మారిన రైల్వేగేట్‌ కష్టాలు తొలగేలా సర్కారు చర్యలు చేపడుతోంది. తాంసి బస్టాండ్‌ వద్ద గల రైల్వేట్రాక్‌ (ఎల్‌సీ నంబర్‌ 30)పై రైల్వేఅండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)నిర్మాణ పనులు ఎట్టకేలకు సోమవారం షురూ కానున్నాయి.ఈ మా ర్గం గుండా రాకపోకలను ఆరునెలల పాటు దారి మళ్లిస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అయి తే గతేడాది మాదిరిగా పనులు ప్రారంభానికే పరి మితమవుతాయా లేక పూర్తయ్యేవరకు కొనసాగుతాయా అనేదానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఆర్‌యూబీకి బదులుగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ దిశగా చొరవ చూపితే మేలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

గేట్‌ కష్టాలు తొలగినట్‌లైనా..

తాంసి బస్టాండ్‌ వద్ద గల రైల్వేట్రాక్‌ అవతల పట్ట ణంలోని పలు కాలనీలున్నాయి. అలాగే తాంసి, తలమడుగు, భీంపూర్‌తో పాటు మహారాష్ట్రలోని సుమారు 50కిపైగా గ్రామాల ప్రజలు ఈ మార్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో రైళ్లు వచ్చినప్పుడల్లా గేట్లు వేస్తుండటంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఫైరింజన్లు సైతం వెళ్లలేని దుస్థితి. ఇటీవల రైళ్ల సంఖ్య పెరగడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది. దీంతో ఇక్కడ ఆర్‌వోబీ నిర్మించాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా వినిపిస్తోంది. ప్రతీ పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఇది అస్త్రంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆర్‌యూబీ నిర్మించాలని నిర్ణయించింది. తాజాగా ఈ పనులు ప్రారంభం కానుండటంతో గేట్‌ కష్టాలు దూరమైనట్లేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏడాది జాప్యం తర్వాత..

కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం రైల్వే అండర్‌ బ్రిడ్జి ని మంజూరు చేసింది. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించింది. గతేడాది మేలో కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించేందుకు నిర్ణయించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయలేదు. దీంతో భూ సేకరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో అక్కడి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు పనులను అడ్డుకున్నారు. చేసేది లేక కాంట్రాక్టర్‌ వెనుదిరిగాడు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరి గింది. అయితే కేంద్ర ప్రభుత్వమే వందశాతం నిధులు వెచ్చిస్తూ నిర్మాణాన్ని చేపట్టాలని ఇటీవల నిర్ణయించింది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఇటీవల మ రోసారి పనులకు భూమిపూజ చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. తొలుత రైల్వేశాఖకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. కేంద్రం నిధులు విడుదల చేశాక , భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆర్‌అండ్‌బీ శాఖ పనులు చేపట్టనుంది. ఈ నిర్మాణానికి ఆరు నెలల పాటు గడువు విధించారు. రైల్వేకు సంబంధించిన పనులను హైదరాబాద్‌కు చెందిన మెహర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకోగా, ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన పనులను శ్రీసాయి తనిష్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకుంది.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో తాంసి బస్టాండ్‌ మార్గంలో వాహనాల రాకపోకలను ఆదివారం రాత్రి నుంచే నిలిపివేశారు. రెండు వైపులా సూచికలతో కూడిన ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా మహాలక్ష్మివాడ, ఆర్‌టీవో కార్యాలయం వద్ద గల ఎల్‌సీ నంబర్‌ 31,29 లను వినియోగించుకోవాలని ట్రాఫిక్‌, మున్సిపల్‌ అధికారులు సూచిస్తున్నారు. ఆరు నెలల పాటు ఈ మార్గంలో రాకపోకలు ఉండవని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఆర్‌యూబీ నిర్మిస్తే వర్షాకాలంలో నీరు నిలిచి తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశమున్నందున రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ మార్కెట్‌ ఉండటంతో పత్తి కొనుగోళ్ల సమయంలో అదనంగా ఇబ్బందులు కలుగుతాయని అభిప్రాయపడుతున్నారు.

వందశాతం కేంద్ర నిధులతోనే

ఆర్‌యూబీ, ఆర్‌వోబీలను వందశాతం కేంద్ర నిధులతోనే నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.95 కోట్ల నిధులు సై తం కేటాయించింది. వారం రోజుల్లో విడుదల య్యే అవకాశముంది. నిధులు అందిన వెంటనే రెండింటి భూ సేకరణ ప్రక్రియను రెవెన్యూశాఖ సాయంతో పూర్తి చేస్తాం. అప్పటి వరకు రైల్వే పోర్షన్‌ పనులు జరుగనున్నాయి. నాణ్యతతో పనులు సాగేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.

– ప్రవీణ్‌ కుమార్‌, ఆర్‌అండ్‌బీ డీఈ

ఆర్‌యూబీ నిర్మాణ వివరాలు

నిర్మాణ వ్యయం : రూ.20.08 కోట్లు

భూసేకరణకు.. : రూ.20.81 కోట్లు

మార్కెట్‌ యార్డువైపు : 184.792 మీటర్లు

పంజాబ్‌ చౌక్‌వైపు : 107.442 మీటర్లు

డ్రైన్‌ల నిర్మాణం : 1.40 మీటర్లు

నిర్మాణ గడువు : ఆరు నెలలు

గేట్‌ కష్టాలకు చెక్‌ పడినట్లేనా..1
1/1

గేట్‌ కష్టాలకు చెక్‌ పడినట్లేనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement