ఎంప్యానోల్‌మెంట్!
● ఆ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలంటేనే మమకారం ● దూరం చేసుకునేందుకు ఇష్టపడని ఆఫీసర్లు ● గతనెలతో ముగిసిన ఎంప్యానల్‌మెంట్ గడువు ● కొత్తది ఏర్పాటులో తాత్సారం
సాక్షి,ఆదిలాబాద్: సాధారణంగా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి ఎంప్యానల్‌మెంట్ గడువు ఏడాది ఉంటుంది. లేనిపక్షంలో రెండేళ్ల పాటు కొనసాగిస్తారు. అయితే జిల్లాలో మాత్రం చిత్రమైన పరిస్థితి ఉంది. ఐదేళ్లుగా ఒకే ఎంప్యానల్‌మెంట్ కొనసాగుతుంది. అందులోని ఏజెన్సీలను వివిధ శాఖల అధికారులు ‘నిను వీడను’ అన్నట్లుగా వాటిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. తాజాగా గత నెలతో గడువు ముగిసినా కొత్త ఎంప్యానల్‌మెంట్ విధివిధానాలు రూపొందించే విషయంలో జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఫైలు రాసేందుకు చెయ్యే ముందుకు కదలడం లేదు. దీన్ని బట్టే ఆఫీసర్లకు ఈ ఏజెన్సీలంటే ఎంత మక్కువో తెలిసిపోతుంది.
ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ సర్వీసులను ఏజెన్సీలు చేపడతాయి. ఆ ఏజెన్సీలకు వీటి నియామక ప్రక్రియ అప్పగించేందుకు ముందుగా అవి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాలి. దాన్నే ఎంప్యానల్‌మెంట్ అంటారు. ఈ ఎంప్యానల్‌మెంట్ గడువు ఏడాది, లేనిపక్షంలో రెండేళ్లలో పూర్తవుతుంది. మళ్లీ కొత్తది రూపొందించి వివిధ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ లకు అవకాశం కల్పించాలి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీలను వివిధ శాఖల అధికారులు ఏళ్లకేళ్లుగా విడిచిపెట్టేందుకు ఇష్టపడటం లేదు. దీని కి కారణం లేకపోలేదు. సాధారణంగా ఔట్‌సోర్సింగ్ అంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే వర్క్ ఆర్డర్లను ఏ జెన్సీలకు పంచడం, కొత్త పోస్టులు మంజూరైతే వా టి నియామకాలు చేపట్టడం వంటి వ్యవహారాల్లో ఇటు నిర్వాహకులు, అటు ఆఫీసర్లు మిలాఖతై వ్యవహారాన్ని నడుపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారాన్ని నిరోధించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
సమయం దొరకడం లేదా..!
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహా రాలన్నీ జిల్లా ఉపాధికల్పన శాఖ కార్యాలయం నుంచి సాగుతాయి. వర్క్ ఆర్డర్ కూడా ఇక్కడినుంచే కేటాయిస్తారు. ఆ తర్వాత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో ఆయా శాఖల అధికారులు, జిల్లా ఉపాధికల్పన అధికారి, ఏజెన్సీల పర్యవేక్షణ లో సాగుతాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 2019–20 లో ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటుకు సంబంధించి టెండర్లు నిర్వహించారు. ఆ తర్వాత ఒకటిరెండేళ్లకు మళ్లీ నిర్వహించాల్సి ఉండగా, ఆఫీసర్లు ఆ ప్రక్రియ నే పూర్తిగా మర్చిపోయారు. ఐదేళ్లు దాటినా పాత ఏజెన్సీలతో కూడిన ఎంప్యానల్‌మెంటే కొనసాగుతుంది. అప్పట్లో 17 ఏజెన్సీలను గుర్తించగా, ప్రస్తు తం 9 ఏజెన్సీలు యాక్టీవ్‌గా ఉన్నాయి. వాటినే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గతనెల ‘సాక్షి’ వివరణ కోరినప్పుడు జిల్లా ఉపాధికల్ప న అధికారి మిల్కా సమాధానం ఇచ్చారు. ఆ గడు వు ముగిసినా విధివిధానాల రూపకల్పన చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


