రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. నిర్మల్ మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన బోయ పొశెట్టి కొన్నేళ్లుగా తర్లపాడ్‌లోని సోదరి పోశాని ఇంటివద్ద ఉంటున్నాడు. బుధవారం రాత్రి గ్రామంలోని రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన అఫ్రోజ్ పోశెట్టిని ఢీకొట్టాడు. పోశెట్టికి తీవ్రంగా అఫ్రోజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోశెట్టిని మెరుగైన వైద్యంకోసం నిర్మల్‌కు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో బాలునికి తీవ్రగాయాలు
సాత్నాల: గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్ తీగలకు తాకడంతో షాక్‌కు గురై బాలునికి తీవ్రగాయాలైన సంఘటన భోరజ్ మండలం బాలాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్ గ్రామానికి చెందిన మార్‌పెల్లి శ్రీనివాస్, విజయ దంపతుల కుమారుడు బాలయోగి ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం పక్కింటి డాబా మీద గాలిపటం ఎగరేస్తూ ఉల్లాసంగా ఉన్నాడు. గాలిపటం విద్యుత్ వైర్ల మధ్య ఇరుక్కోవడంతో మాంజాతో లాగడానికి ప్రయత్నిస్తుండగా తీగలకు తాకి షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు ముందుగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
శివాలయంలో మూడోసారి చోరీ
లోకేశ్వరం: మండల కేంద్రంలోని శివాలయంలో హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగుల గొట్టి నగదు ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి హుండీని మిషన్‌తో కత్తిరించి అందులోని నగదు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్చ్యూయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గతంలో కూడా రెండు సార్లు ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. చోరీల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మహిళ మృతదేహంపై ఆరా?
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో కొన్నిరోజుల క్రితం మహిళ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. అయితే ఇటీవల మహారాష్ట్ర ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో అదృశ్యమైన మహిళ, మహారాష్ట్ర ప్రాంతంలో లభించిన మృతదేహానికి ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు


