ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల పూజలు
ఇంద్రవెల్లి: నాగోబా మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి హస్తినమడుగు నుంచి సేకరించిన పవిత్ర గంగాజలంతో బయలుదేరిన మెస్రం వంశీయులు బుధవారం ఉదయం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఎదుట ఉన్న మర్రిచెట్టుపై గంగాజలాన్ని భద్రపరిచారు. అనంతరం నైవేద్యం తయారుచేసి ఇంద్రాదేవికి సమర్పించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎడ్లబండ్లపై వచ్చిన 22 కితల మెస్రం వంశీయులు ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో గల మర్రిచెట్టు వద్ద బస చేశారు. మర్రిచెట్టు వద్ద మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలతో పాటు మెస్రం వంశంలో మరణించిన పెద్దల పేర్లతో తూమ్ (కర్మఖాండ)పూజలు చేయనున్నారు. ఈ నెల 18న రాత్రి 10:30 గంటలకు నాగోబా ఆలయంలో మహాపూజ చేసి జాతర ప్రారంభిస్తామని, 22న దర్బార్ సమావేశం ఉంటుందని మెస్రం వంశీయులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో మెస్రం వంశ పెద్దలు మెస్రం హనుమంత్ కటోడ, మెస్రం కోసేరావ్, దాదారావ్, తిరుపతి, గణపతి, తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల పూజలు


