పెళ్లిబాజా మోగాల్సిన ఇళ్లలో చావుకేకలు
కౌటాల(బెజ్జూర్): సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకుందామని చికెన్ కోసం బైక్‌పై వెళ్లిన మామ, అల్లుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కౌటాల మండలంలోని ముత్తంపేటకు చెందిన డోంగ్రే రాజశేఖర్ (21)కు బెజ్జూర్ మండలం కుంటాలమానెపల్లికి చెందిన యువతితో ఇటీవల వివాహం నిశ్చయించారు. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా ఈనెల 13న సంక్రాంతికి రాజశేఖర్ అత్తారింటికి వెళ్లాడు. బుధవారం అతని మామ బోర్కుట్ శంకర్ (48)తో కలిసి బైక్‌పై చికెన్ తెచ్చేందుకు సలగుపల్లి వెళ్లారు. తిరుగుప్రయాణంలో మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి వంతెనను ఢీకొనడంతో ఇద్దరూ పైనుంచి కిందపడిపోయారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పండుగపూట మామాఅల్లుళ్ల మృతితో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతదేహాలకు సిర్పూర్(టి) ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు శంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెజ్జూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


