సంస్కృతికి జైకొట్టి.. భక్తి మార్గాన్ని నిలబెట్టి
అన్నవరం: మన సంస్కృతికి అద్దం పడుతూ.. భక్తి మార్గానికి జై కొడుతూ ‘భోగి’భాగ్యాలు ప్రసాదించాలంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరిగాయి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కొత్త ఏర్పడిన పోలవరం జిల్లాలోని పలు దేవస్థానాల్లో భోగి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి పండగ ప్రతీక అని, ఇవి మనుషుల అనుబంధాలను పెంచుతాయని తుని తపోవనం ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు. భోగి పండగ సందర్భంగా బుధవారం అన్నవరం రత్నగిరిపై రామాలయం ఆవరణలో సంక్రాంతి వేడుకలను స్వామీజీ ప్రారంభించారు. పాడి పంటలు, పశువులతో పెనవేసుకున్న మన సంస్కృతిని గుర్తుచేసే అపురూపమైన పండగ భోగి అని స్వామీజీ తెలిపారు. రామాలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటను పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రజ్వలన చేశారు. అనంతరం రామాలయం ఆవరణలో తెలుగు సంస్కృతిని ప్రతిబంబిస్తూ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుతో కలసి తిలకించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామీజీ ప్రసంగిస్తూ అచ్చ తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఏటా దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
పల్లె వాతావరణం ప్రతిబింబించేలా..
సత్యదేవుడు కొలువైన రత్నగిరిపై రామాలయం వద్ద భోగి వేడుకలను పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు. ఇక్కడ గ్రామీణ వాతావరణ అలంకరణ ఆకట్టుకుంది. ఒకవైపు పొంగలి వంట, ఇంకో వైపు భోగి మంట, పాడి ఆవులు, తెలుగు పౌరుషానికి ప్రతిరూపంగా నిలిచే కోడి పుంజులు, ఎడ్ల బండి, భోగిపళ్లు, బొమ్మల కొలువు, తాడిచెట్టు, కొబ్బరి చెట్టు, ఈతచెట్టు, కుమ్మరి సారి తదితరాలు అందరినీ అలరించాయి. అలాగే జానపద కళారూపాల ప్రదర్శన కనువిందు చేసింది. సంప్రదాయ జానపద కళారూపాలైన గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసు, హరిదాసులు, కళాకారుల కోలాట నృత్యాలు రంజింపజేశాయి. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఆసుపత్రి ఫార్మసీ సూపర్‌వైజర్ వల్లూరి మాధవి తదితరులు మట్టి కుండలపై పొంగలి, పాయసం వండి భక్తులకు పంచిపెట్టారు. వీటికి తోడు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించే అవకాశం కల్పించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉత్సవమూర్తుల విగ్రహాలు, ధాన్యపురాశి మీద గణపతి విగ్రహం అందరినీ అకట్టుకున్నాయి. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, ఉప ప్రధానార్చకులు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, పవన్, సుధీర్, శర్మ తదితరులు పూజలు చేశారు.
‘భోగి’భాగ్యాలు నింపేలా వేడుకలు
రత్నగిరిపై వేడుకలు ప్రారంభించిన
సచ్చిదానంద సరస్వతి స్వామీజీ
ఉమ్మడి జిల్లాలోని
పలు దేవస్థానాల్లో సంబరాలు


