జిల్లా సమగ్రాభివృద్ధికి సలహాలు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్రాభివృద్ధికి సలహాలు ఇవ్వండి

Oct 8 2024 12:50 AM | Updated on Oct 8 2024 12:50 AM

జిల్లా సమగ్రాభివృద్ధికి సలహాలు ఇవ్వండి

జిల్లా సమగ్రాభివృద్ధికి సలహాలు ఇవ్వండి

రాయచోటి : అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో స్వర్ణాంధ్ర–2047 జిల్లా విజన్‌ ప్లాన్‌ రూపకల్పనలో భాగంగా రాబోయే ఐదు సంవత్సరాల వరకు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి గల అంశాలు, అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో మన జిల్లా నుంచి ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన దాదాపు 1.11 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. అదే విధంగా జిల్లాస్థాయిలో కూడా రూపొందిస్తామన్నారు. జిల్లాలో మైనింగ్‌, చక్కని మానవ వనరులు, ఉద్యాన పంటలు, అటవీ భూభాగం ఉన్నాయన్నారు. అన్నమయ్య జిల్లాను సమగ్ర అభివృద్ధి చేయడంలో మీవైపు నుంచి మీ ఆలోచనలు, విలువైన సూచనలు, ప్రతిపాదనలు అందిస్తే వాటిని నివేదికలో పొందుపరిచి రాష్ట్రస్థాయికి పంపుతామని అన్నిశాఖల అధికారులకు సూచించారు. మీ ఆలోచనలు, సలహాలు పంచుకునేందుకు రాబోయే రెండు రోజులే చివరి అవకాశమన్నారు. అనంతరం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకట పెద్దయ్య పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా స్వర్ణాంధ్ర – 2047 విజన్‌ ప్రణాళిక ప్రధాన ఉద్దేశంపై అవగాహన కల్పించారు.

డీఎఫ్‌ఓ వివేక్‌ సేవలు మరువలేనివి

బదిలీపై వెళ్తున్న డీఎఫ్‌ఓ వివేక్‌ను కలెక్టర్‌ శ్రీధర్‌తోపాటు పలువురు అధికారులు సన్మానించారు. కలెక్టర్‌, జేసీ, డీఆర్‌ఓ, సబ్‌ కలెక్టర్లు, డీఆర్‌ఓ, అధికారులు డీఎఫ్‌ఓ సేవలను కొనియాడారు.

జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌

జిల్లాలో మరో మూడు ఇసుక రీచ్‌లు

– వెబ్‌ పోర్టల్‌ లేదా సచివాలయాలలో

ఉచిత ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

అన్నమయ్య జిల్లాలో ఉచిత ఇసుక కోసం ఏపీ సాండ్‌ మేనేజ్‌మెంట్‌ వెబ్‌ పోర్టల్‌ లేదా సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌ ఛాంబర్‌లో అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న ఇసుక పాలసీ, ఇసుక రవాణా, ఇసుక కోసం దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు మూడు ఇసుక రీచ్‌లు ఉన్నాయని, మరో మూడు రీచ్‌లను అక్టోబర్‌ 16వ తేదీ కల్లా అందుబాటులోకి తేనున్నామన్నారు. ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీ మైన్స్‌ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement