yallaiah
-
న్యాయవాది దారుణ హత్య
కేవీ పల్లె: న్యాయవాది దారుణహత్యకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం పాతవడ్డిపల్లెలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట శివకుమార్ కథనం ప్రకారం.. పాతవడ్డిపల్లెకు చెందిన పూజారి యల్లయ్య (36) పీలేరు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌గా చేస్తున్నారు. సోమవారం పాతవడ్డిపల్లెలో యల్లయ్య ఇంటికి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరోచోటకు మార్చే విషయమై అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు వర్గం ఆయనతో ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో యల్లయ్యపై శ్రీనివాసులు వర్గం విచక్షణా రహితంగా దాడి చేసింది. కర్రలు, రాళ్లతో కొట్టి న్యాయవాది యల్లయ్యను హత్య చేశారు. అడ్డువెళ్లిన యల్లయ్య తల్లిదండ్రులు రెడ్డెమ్మ, వెంకటరమణపైనా దాడికి పాల్పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. యల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు వర్గంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. కాగా.. యల్లయ్య భార్య 6 నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో వారిపిల్లలు రితిక (7), గోకుల్‌కృష్ణ (5) అవ్వాతాత దగ్గర ఉంటున్నారు. తండ్రి హత్యకు గురికావడం, అవ్వాతాతలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరడంతో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటున్నారు. -
కళ్లెదుటే.. కన్నుమూశాడు!
- ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి - మరొకరికి తీవ్ర గాయాలు పెద్దపప్పూరు : వేగంగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి గోతిలోకి ఎగిసిపడ్డారు. మొనలు తేలిన భారీ బండరాళ్లపై పడటంతో వారిద్దరికీ బలమైన గాయాలు తగిలాయి. ఈ ప్రమాదంలో అచేతనంగా కూర్చుండిపోయిన ఓ వ్యక్తిని చూసిన స్థానికులు నీళ్లు తాపారు. కాసేపు బండరాయికి ఆనుకుని సేద తీరుతున్నట్లు కనిపించిన ఆ వ్యక్తి అందరూ చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో ప్రాణం వదిలాడు. కళ్లముందే ప్రాణాలు పోతున్నా..‘అయ్యో’ అనడం తప్ప..అక్కడున్నవారు ఏమీ చేయలేకపోయారు. మండల పరిధిలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని కనుమ వద్ద ద్విక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీహర్ష తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం ఓబన్నపేట ఎల్లయ్య (50), కొర్రపాడుకు చెందిన రామాంజి వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో కనుమ వద్దకు రాగానే బైకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, రామాంజి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన రామాంజిని 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఎల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ శ్రీహర్ష ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.


