ట్రాన్స్‌ఫార్మర్ తరలింపు విషయమై ఘర్షణ
న్యాయవాది తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
కేవీ పల్లె: న్యాయవాది దారుణహత్యకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం పాతవడ్డిపల్లెలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట శివకుమార్ కథనం ప్రకారం.. పాతవడ్డిపల్లెకు చెందిన పూజారి యల్లయ్య (36) పీలేరు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌గా చేస్తున్నారు. సోమవారం పాతవడ్డిపల్లెలో యల్లయ్య ఇంటికి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మరోచోటకు మార్చే విషయమై అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు వర్గం ఆయనతో ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో యల్లయ్యపై శ్రీనివాసులు వర్గం విచక్షణా రహితంగా దాడి చేసింది.
కర్రలు, రాళ్లతో కొట్టి న్యాయవాది యల్లయ్యను హత్య చేశారు. అడ్డువెళ్లిన యల్లయ్య తల్లిదండ్రులు రెడ్డెమ్మ, వెంకటరమణపైనా దాడికి పాల్పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. యల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు వర్గంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. కాగా.. యల్లయ్య భార్య 6 నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో వారిపిల్లలు రితిక (7), గోకుల్‌కృష్ణ (5) అవ్వాతాత దగ్గర ఉంటున్నారు. తండ్రి హత్యకు గురికావడం, అవ్వాతాతలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరడంతో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటున్నారు.


