breaking news
Womens Concerns
-
వణుకుతున్న అఫ్గాన్ మహిళా లోకం
రెండు దశాబ్దాల తర్వాత మరోమారు పాలనా పగ్గాలు చేపట్టిన తాలిబన్లకు భయపడుతున్న ప్రజలు మాత్రం కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ భవితవ్యం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మహిళల పరిస్థితేంటి? అనే ప్రశ్నలకు తాలిబన్ల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. అసలు వారికైనా ఈ విషయాలపై స్పష్టత ఉందో, లేదో తెలియదు. గత పాలన సందర్భంగా తాలిబన్లు స్త్రీలను ఎలా చూశారో అందరికీ తెలుసు. స్త్రీలకు విద్య నిషేధించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను కాలరాయడం, లైంగికబానిసలుగా మార్చడం వంటివి తలుచుకొనే ప్రస్తుతం అఫ్గాన్ మహిళా సమాజం ఉలిక్కిపడుతోంది. ముఖ్యంగా 2001 తర్వాత జన్మించిన యువతకు వీరి ఆగడాలపై అవగాహన లేదు. ప్రస్తుతం తాము మారిపోయామని, మహిళా విద్యను కొనసాగిస్తామని తాలిబన్లు ప్రకటించుకుంటున్నా మహిళల భయం తీరడం లేదు. ఇప్పటిౖMðతే మహిళల పట్ల తాలిబన్లు ఎలాంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేదు. కానీ జూలైలో బందక్షాన్, తఖార్ ప్రావిన్సులను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలు గుర్తుకొచ్చి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న 15ఏళ్లు దాటిన బాలికలు, 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను తమకివ్వాలని జూలైలో తాలిబన్లు స్థానిక నాయకులను ఆదేశించారు. తాలిబన్ ఫైటర్లను పెళ్లి చేసుకోవడానికి వీరు అవసరమని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆదేశాలు అమలయ్యాయా? అయితే అక్కడి ఆడవారి పరిస్థితి ఏంటి? అనే విషయాలపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. పేరుకు పెళ్లిళ్లు కానీ, ఇవన్నీ యువకులను తమలోకి ఆకర్షించేందుకు తాలిబన్లు చేసే యత్నాలన్నది అందరికీ తెలిసిన సంగతే! ఇలా పెళ్లైనవారు భార్య హోదా పొందకపోగా లైంగిక బానిసలుగా మారడం కద్దు. ఈ ఆదేశాలకు భయపడి చాలా ప్రాంతాల్లో ప్రజలు పారిపోయారు. కేవలం మూడు నెలల్లో దాదాపు 9 లక్షలమంది స్వస్థలాలను విడిచిపోయారంటే తాలిబన్ టెర్రర్ అర్థమవుతుంది. ఇదే తరహాను కొనసాగిస్తే ఇరవైఏళ్లపాటు అఫ్గాన్ మహిళాలోకం సాధించిన విజయాలన్నీ మట్టికొట్టుకుపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించేలా తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావాలని, మహిళా హక్కుల పరిరక్షణకు ఐరాస, ప్రపంచ దేశాలు నడుం బిగించాలని, ఆంక్షలు తొలగించాలంటే స్త్రీస్వేచ్ఛకు లింకు పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) –నేషనల్ డెస్క్, సాక్షి -
ఆపలేక...అమ్మకు చెప్పలేక...
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘సారీ అమ్మా. నీకు ఎప్పట్నుంచో చెప్పాలనుకుంటున్నాను. కానీ చెప్పలేకపోయాను. సారీ’... నేను మాట్లాడుతున్నా, అమ్మ నా వైపు చూడటం లేదు. తన దృష్టి ఎటో ఉంది. చూపులతో శూన్యాన్ని కొలుస్తోంది. ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది. తన కళ్ల నుంచి కన్నీళ్లు నిశ్శబ్దంగా జాలువారుతున్నాయి. నా మనసు అదోలా అయిపోయింది. తనని అలా చూడలేకపోయాను. అడుగులో అడుగు వేసు కుంటూ అమ్మ దగ్గరకు వెళ్లాను. ‘అమ్మా మాట్లాడమ్మా... ప్లీజ్.. నాతో మాట్లాడు’ అంటూ తన చేయి పట్టుకున్నాను. అంతే. అమ్మ కుప్పకూలిపోయింది. ప్రాణం లేని బొమ్మ నేలమీద పడినట్టు పడిపోయింది. ‘అమ్మా... లేమ్మా... ఏమైందమ్మా’... నేను అరుస్తున్నాను. కానీ నా అరుపులు అమ్మ చెవుల్లో పడటం లేదు. నేను పట్టి కుదుపుతున్నా నా స్పర్శ తనకు తెలియడం లేదు. ఎందుకంటే అమ్మలో ప్రాణం లేదు. ఎప్పుడో ఆమెను విడిచి వెళ్లిపోయింది. నేను చెప్పింది వినీ వినగానే తన శ్వాస ఆగిపోయింది. నేనే అమ్మను చంపేశాను. నిజం చెప్పి చంపేశాను. నేను తనకి చెప్పకుండా ఉండాల్సింది. ‘అమ్మా’... గట్టిగా అరుస్తూ, వెక్కి వెక్కి ఏడుస్తోన్న నన్ను ఎవరో పట్టి కుదుపుతున్నారు. ‘మీనా.. మీనా.. ఏమైంది’ అంటూ అడుగుతున్నారు. ఎవరది? ఎవరు నన్ను పిలుస్తున్నది? మూసుకున్న కళ్లు తెరిచి చూశాను. అమ్మ! మా అమ్మ! తను బతికే ఉందా? తనకేమీ కాలేదా? కళ్లు నులుముకుని చూశాను. అమ్మే. ఒక్కసారిగా తనను వాటేసుకున్నాను. ‘అమ్మా... నీకేమీ కాలేదా’ అంటూ బావురుమన్నాను. అమ్మ నన్ను గట్టిగా హత్తుకుంది. ‘ఏమైందమ్మా... ఎందుకలా భయపడుతున్నావ్. పీడకలేమైనా వచ్చిందా’ అంటూ తల నిమురుతోంది. కలా? అవును కలే. నేను కన్నది కలే. చాలా చెడ్డ కల. నాకెంతో ఇష్టమైన అమ్మను నాకు దూరం చేసిన కల. ఆ కల నిజం కాకూడదు. ఎప్పటికీ నిజం కాకూడదు. అంటే అమ్మకి నేను ఎప్పటికీ నిజం చెప్పకూడదు. అవును చెప్పకూడదు... చెప్పను! ‘మీనా... మీనా... ఎక్కడున్నావ్?’... అమ్మ పిలుపుతో ఉలిక్కిపడ్డాను. గబగబా కళ్లు తుడుచు కున్నాను. అయినా దుఃఖం ముంచుకొస్తోంది. అణచుకోవడం కష్టంగా ఉంది. అంతలో అమ్మ గదిలోకి వచ్చేసింది. వస్తూనే నా ముఖంలోకి చూసింది. ఆ చూపు ఎప్పటిలా లేదు. గుచ్చుతు న్నట్టుగా ఉంది. గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. తన కళ్లలోకి చూడలేక తల వంచుకు న్నాను. అమ్మ నా దగ్గరగా వచ్చింది. నా చుబుకం పుచ్చుకుని తలను పైకి లేపింది. ‘ఏడుస్తున్నావా మీనా?’ అంది అనునయంగా. ‘లేదమ్మా... ఎందుకేడుస్తాను’ అన్నాను నవ్వేస్తూ. కాదు... నవ్వును నటిస్తూ. కానీ అమ్మ కదా! నా నటనను కనిపెట్టేసింది. ‘నిజం చెప్పు మీనా... ఎందుకేడుస్తున్నావ్’ అంటూ రెట్టించింది. నేను మాట్లాడలేదు. చాలా రకాలుగా అడిగినా నేను చెప్పలేదు. చేతనైనంతగా నటించాను. చూసి చూసి చివరగా అమ్మ నన్నో ప్రశ్న అడిగింది. ‘మీ నాన్న నీతో ఎలా ఉంటున్నారు మీనా?’ ఉలిక్కిపడ్డాను. తత్తరపడ్డాను. తడబడ్డాను. కానీ తొందర మాత్రం పడలేదు. నోరు మెదపలేదు. అమ్మ ఇలా ఎందుకడుగుతోంది? తనకేం తెలిసింది? అసలీ ప్రశ్న ఎందుకు వేయాలనిపించింది? ‘నిన్నే మీనా... మాట్లాడవేం. మీ నాన్న నీతో ఎలా ఉంటున్నారు?’... మళ్లీ అదే ప్రశ్న. నన్ను వణికిస్తోన్న ప్రశ్న. మాట బయటకు రాకుండా పెదవులకు తాళం వేస్తోన్న ప్రశ్న. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? చెబితే తను తట్టుకోలేదు. గుండె పగిలి చచ్చిపోతుంది. మమ్మల్ని అనాథలను చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుంది. లేదు. నేను చెప్పలేను. నాకొచ్చిన కలను నిజం చేయలేను. అమ్మను కోల్పోలేను. ‘ఏం లేదు మీనా. మీ నాన్న... చెల్లిని... చెల్లిని’... అమ్మ తడబడుతోంది. చెప్పలేక నీళ్లు నములుతోంది. ఎందుకో నా మనసు కీడు శంకించింది. ‘ఏం జరిగిందమ్మా... చెల్లికేమయ్యింది’ అన్నాను ఆతృతగా. అమ్మ అతి కష్టమ్మీద నోరు తెరిచింది. ‘మీ నాన్న మంచివాడు కాదమ్మా. నీ చెల్లి జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే నిన్ను అడుగుతున్నాను. తను నీతో ఎలా ఉంటున్నాడు?’ ఒళ్లు జలదరించింది. ఏమంటోంది అమ్మ! నాన్న... చెల్లెల్ని... ఛీ. కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది. గుండె గోడల్ని బద్దలుకొట్టుకుని బాధ బయటకు పొంగుతోంది. పాము తన గుడ్లను తానే పొడుచుకు తింటుందట. నాన్న కూడా అంతేగా! ఆయనకు అమ్మ కాకుండా వేరే భార్య ఉంది. పిల్లలూ ఉన్నారు. కానీ మళ్లీ అమ్మను పెళ్లి చేసుకున్నాడు. అది తనపై ప్రేమనుకుంది అమ్మ. ఆ ప్రేమకు ఫలితంగా పుట్టిన మమ్మల్ని చూసి మురిసిపోయేది. పాపం తను ఊహించి ఉండదు... ఆ ప్రేమ ఫలాలను అందించినవాడే వాటిని ఎంగిలి చేస్తాడని! కన్న కూతుర్నని కూడా చూడలేదు. అమ్మ లేని సమయం చూసి నాపై అఘాయిత్యం చేశాడు. అమ్మకు చెప్పొద్దన్నాడు. చెబితే గుండె ఆగి చచ్చిపోతుంది, మీకు అమ్మ లేకుండా పోతుంది అన్నాడు. నిజమేననిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయాను. సంవత్సరం పాటు నాన్న నాగుపాములా నన్ను కాటేస్తుంటే కన్నీళ్లను దిగమింగుకున్నాను. నాన్నను ఆపలేక, అమ్మకు చెప్పలేక నరకం చూశాను. అమ్మను బతికించుకోవడం కోసం నా బతుకు బండలైపోతున్నా భరించాను. కానీ నాన్న చివరికి నా చెల్లెలికి కూడా అదే గతి పట్టిస్తున్నాడనుకోలేదు. పాపం అది... తట్టుకోలేక అమ్మకు చెప్పేసింది. కానీ అదృష్టం! అమ్మకేమీ కాలేదు. లోపల కుమిలిపోతోందేమో తెలియదు కానీ పైకి మాత్రం కుంగిపోలేదు. ఒక్కటే అంది... ‘నాకు ఈ లోకంలో మీకంటే ఎవరూ ఎక్కువ కాదురా, మీకింత ద్రోహం చేసినవాణ్ని నా భర్తయినా సరే, వదలను’ అని. అమ్మ ఆ మాట అంటుంటే తట్టుకోలేకపోయాను. తన గుండెలపై వాలిపోయి అన్నాళ్ల బాధనూ కన్నీళ్లుగా కరిగించేశాను. ఆ క్షణం నుంచీ నాన్నపై మా పోరాటం మొదలైంది. అరెస్ట్ చేయిస్తే బెయిలుపై వచ్చేశాడు. ఏమీ ఎరగనివాడిలా తిరుగుతున్నాడు. అతనికి శిక్ష వేయించేవరకూ వదలనని అమ్మ ప్రతిజ్ఞ చేసింది. తను మా కోసం పోరాడుతోంది. మేం తన వెనుక నిలబడ్డాం. ఆ దుర్మార్గుణ్ని కటకటాల వెనక్కి పంపించి తీరుతాం. అలాంటివాడు బయట ఉంటే నాన్న అన్న పదమే అవమానంతో తలదించుకుంటుంది! - మీనా (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి .......................... ఇలాంటి సంఘటనల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. సొంతవాళ్లే ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేరు కాబట్టి వాటిని నివారించడం కష్టమే. అందుకే ఎవరైనా భయపెట్టి తమ పట్ల తప్పుగా ప్రవర్తిస్తుంటే ‘వెంటనే నాతో చెప్పు’ అని తల్లి పిల్లలకు చెప్పాలి. అలా చెప్పాలంటే పిల్లలతో స్నేహంగా మెలగాలి. ఒకవేళ వాళ్లు చెప్పకపోయినా, వాళ్ల ప్రవర్తనను బట్టి కూడా పరిస్థితిని అంచనా వేయవచ్చు. పై కేసులో మీనాలా హింసకు, మనోవేదనకు గురవుతున్న పిల్లల్లో కొన్ని మార్పులు వస్తుంటాయి. తమలో తామే కుంగిపోతూ మౌనంగా అయిపోతుంటారు. చిన్న విషయాలకే కోప్పడటం, విసుక్కోవడం, ఏడవడం, ఎక్కువ తినేయడం, అసలు తినకపోవడం వంటివి చేస్తుంటారు. హింసకు గురి చేస్తున్న వ్యక్తిని చూసి భయపడుతుంటారు. దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడరు. ఇలాంటి ప్రవర్తన మీ పిల్లలో కనిపిస్తే మాత్రం ఒక్కసారి ఈ కోణంలోంచి కూడా ఆలోచించండి. మీ అనుమానం నిజమైతే, పిల్లల్ని ఆ పరిస్థితి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. డా॥పద్మ పాల్వాయి చైల్డ్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్ట్ రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్