breaking news
woman assaults
-
TSRTC: ఆధార్ విషయమై కండక్టర్‌పై దాడి
కుషాయిగూడ: ఆధార్ విషయంలో ఓ ప్రయాణికురాలు, కండక్టర్ ఘర్షణ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆధార్‌ను కండక్టర్ నిరాకరించడంతో ఆగ్రహించిన ప్రయాణికురాలు కండక్టర్ పట్ల దురుసుగా వ్యవహరించి చేయి చేసుకుంది. దీంతో కండక్టర్ పోలీసులను ఆశ్రయించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. పైగా పోలీస్‌స్టేషన్ గేటు వద్ద బైఠాయించి ధర్నాకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈనెల 4న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న (ఏపీ29, జెడ్ 3181) ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కింది. కండక్టర్ గద్ద శ్రీదేవి టికెట్ తీసుకుంటుండగా.. సదరు ప్రయాణికురాలు సరిత ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌తో ఉన్న ఆధార్‌ను చూపింది. ప్రభుత్వ నింబంధనల మేరకు తెలంగాణ ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని, ఇది చెల్లదని టికెట్ కొనుగోలు చేయాలని కండక్టర్ సూచించింది. దీంతో ఆగ్రహించిన ఆమె కండక్టర్‌తో గొడవకు దిగి, కండక్టర్‌పై చేయి చేసుకుంది. దీంతో కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ప్రయాణికురాలిపై గతంలోనూ పలు కేసులు పలువురు ప్రభుత్వ అధికారులను గతంలో బ్లాక్ మెయిల్ చేసిన ఘటనల్లో సరితపై అంబర్పేట్, భూపాలపల్లి జిల్లా వెంకటపురం, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భార్యను కాళ్లతో తన్ని .. ఆపై గొంతు నులిమి..
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి(నల్లగొండ): కలకాలం తోడూ నీడగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతానని ప్రమాణం చేసిన భర్తే ఆ ఇల్లాలి పాలిట కాలయముయ్యాడు. మూడు ముళ్ల బంధానికి తూట్లు పొడిచి మృగాడిగా మారాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో చివరకు నమ్మి వచ్చిన అభాగ్యురాలిని దారుణంగా కాళ్లతో తన్ని.. ఆపై గొంతునులిమి కడతేర్చాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, గుడిపల్లి ఎస్ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అంగడిపేట తండాకు చెందిన రమావత్ రెడ్యా–బుజ్జి దంపతుల కుమార్తె సుజాత(33)కు పెద్దఅడిశర్లపల్లి మండలం మునావత్ తండాకు చెందిన మునావత్ శ్రీనుతో 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. పెళ్లైన కొంతకాలానికే.. వివాహమైన కొంత కాలానికే శ్రీను భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఏ పని చేయకుండా నిత్యం తాగుతూ ఘర్షణ పడేవాడు. కూతురు పడుతున్న బాధలు చూడలేక సుజాత తల్లిదండ్రులు అంగడిపేట తండాలో ఇల్లు ఇవ్వడంతో అక్కడే ఉంటున్నారు. అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద రొట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటినుంచి బయటికి పరుగు తీసినా.. ఎప్పటిలాగే శ్రీను బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంకా మద్యం తాగాలనే కాంక్షతో భార్యను డబ్బులు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో గొడవకు దిగాడు. ఆపై ఆమెను ఇష్టారీతిలో కొడుతూ కాళ్లతో తన్నడంతో భయాందోళనతో ఇంటినుంచి బయటికి పరుగు తీసింది. అయినప్పటికీ శ్రీను ఆమె వెంట పడి చివరకు గొంతు నులుమడంతో స్పృహతప్పింది. వెంటనే శ్రీను అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన ఇరుగు పొరుగువారు సుజాతను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరి శీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు జాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. -
బెంగాల్లో మరో దారుణం!
సంపాదకీయం: నిర్భయ చట్టంలాంటి కఠినమైన చట్టం తెచ్చాం గనుక ఇక మన బాధ్యత తీరిందని పాలకులు భావిస్తున్న దాఖలాలు కనిపిస్తుండగా మహిళలపై అత్యాచారాలు మాత్రం యథాతథంగా సాగిపోతున్నాయి. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తిన దేశ రాజధానిలోనే అవి ఆగలేదు. ఇక ఇతరచోట్ల అంతకన్నా మెరుగైన పరిస్థితి ఉంటుందని భావించడం అత్యాశే అవుతుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లా సుబల్పూర్లో ఆదివాసీ యువతిపై అక్కడి తెగ పంచాయతీ ఆదేశం మేరకు జరిగిందని చెబుతున్న సామూహిక అత్యాచారం ఈ పరంపరలో అత్యంత భయానకమైనది. ఒంటరిగా ఉన్న యువతిపైనో, నిస్సహాయ స్థితిలో ఉన్న మరొకరిపైనో జరిగే నేరాలను అదుపు చేయడం ఒక ఎత్తయితే... ఇలా కుల పంచాయతీలు, తెగ పంచాయతీలు కొనసాగి స్తున్న దుశ్శాసనపర్వాలు మరో ఎత్తు. హర్యానాలోనూ, యూపీలోనూ ఖాప్ పంచాయతీల వంటివి మహిళలపైనా, బాలికలపైనా తరచు చేసే తీర్మానాలు, తీసుకునే చర్యలు మధ్యయుగాల జాడలను తలపిస్తుంటే... ఇప్పుడు పశ్చిమబెంగాల్ ఘటన వాటికేమాత్రం తీసిపోకుండా ఉన్నది. బెంగాల్ ఘటన అనేకవిధాల ఆందోళనకరమైనది. ఎందుకంటే, ఎంతో నాగరికమని మనమంతా అనుకునే వెలుపలి సమాజంతో పోలిస్తే ఆదివాసీల్లో ప్రజాస్వామిక వాతావరణం హెచ్చు. స్త్రీ, పురుష వివక్ష కూడా తక్కువ. పైగా, ఈ ఘటన చోటుచేసుకున్న బీర్భూమ్ ఆదినుంచీ వామపక్ష ఉద్యమాల ప్రభావానికి లోనైన ప్రాంతం. ఇలాంటిచోట ఇంతటి దుర్మార్గం చోటుచేసుకోవడమంటే బయటి సమాజంలోని తెగుళ్లు దానికి కూడా సోకుతున్నాయని అర్ధం. బాధితురాలిపైనే నిందలు వేసే సంస్కృతి కూడా పెరిగింది. స్థానిక మహిళలు కొందరిని ప్రశ్నించిన ప్పుడు ఆ యువతి ప్రవర్తన సరైనది కాదని వారు చెప్పారట! అంటే ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ‘నాగరికత’ బాగానే వేళ్లూనుకుంటున్నదన్న మాట! ఇంతకూ ఆ యువతి చేసిన నేరమేమిటి? 20 ఏళ్ల వయసులోనే ఆమె ఢిల్లీ వెళ్లి కూలి పనిచేసి డబ్బులు సంపాదించింది. స్థానికంగా రోజుకు రూ. 180 వస్తుండగా ఆమె రోజుకు రూ. 450 సంపాదించింది. ఇంటికి డబ్బులు పంపి ఉన్నంతలో పక్కా ఇల్లు కట్టుకుంది. చిన్న టీవీ, మ్యూజిక్ సిస్టం కొనుక్కుంది. వీటన్నిటివల్లా వచ్చిన స్వతంత్ర వ్యక్తిత్వం కూడా ఆమెకు ఉన్నది. ఈ కారణాలన్నీ తెగలోని కొందరిలో అసూయకు, ఆగ్రహానికి దారితీశాయని అంటు న్నారు. ఫలితంగా ఆమెకు మరొకరితో సంబంధం అంటగట్టి, అందుకు శిక్షగా జరిమానా విధించి, చివరకు ఈ దారుణానికి ప్రేరేపించారని స్థానికులు చెబుతున్నారు. 13మంది యువకులు సాగించిన ఈ దౌష్ట్యంలో ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఆదివాసీ సమాజంలో ఈ తెగల పంచాయతీలు ఇప్పటివి కాదు. బ్రిటిష్ పాలనకు ముందునుంచీ అవి సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఈ పంచాయతీల ప్రాబల్యం ఆదివాసీల్లో బలంగానే ఉన్నా అవి జరిమానాలు విధించడం, సాంఘిక బిహ ష్కరణవంటి తీర్పులివ్వడం తప్ప ఇలాంటి దారుణానికి ఎప్పుడూ పాల్పడలేదని అంటారు. పరస్పరం దాడులు చేసుకునే, బురదజల్లుకునే రాజకీయాలు ఆదివాసీ సమాజంలోకి ప్రవేశించాక ఆ రాజకీయాలను ఆశ్రయించుకుని ఉండే నేరాలు కూడా అక్కడికి వ్యాప్తి చెందుతున్నాయి. సుబల్పూర్ ఉదంతంలో తెగ పంచాయతీ సభ్యుల్లో కొందరు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారని కాంగ్రెస్, సీసీఎం ఆరోపిస్తున్నాయి. ఆమధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ఏకగ్రీవంగా తృణమూల్‌కే దక్కిందన్నది వాస్తవం. స్థానికంగా తెగ పంచాయతీ ఇలా చేస్తుంటే గ్రామ పంచాయతీ అధ్యక్షుడైనా, ఇతర సభ్యులైనా ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. పల్లెసీమల్లో స్వపరిపాలన వేళ్లూనుకుని అక్కడ ప్రజాస్వామిక భావనలు పెరిగితే అది దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని అనుకుంటారు. కానీ, గ్రామాల్లో అందుకు విరుద్ధమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ సంస్థలు సమస్యలను పరిష్కరించడం అటుంచి, ఆ వైపరీత్యాలను మౌనంగా చూస్తూ ఊరుకోవడమో, అందులో భాగంకావడమో జరుగుతున్నది. కాంగ్రెస్, సీపీఎంలు ఆరోపిస్తున్నట్టు ఘటన వెనక తృణమూల్ సభ్యులు ఉన్నారో, లేదో ఇంకా తేలవలసి ఉన్నా ఆ రాష్ట్రంలో ఇటీవలికాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగాయన్నది మాత్రం వాస్తవం. గత రెండేళ్లలో రాష్ట్రం మహిళలపై నేరాల విషయంలో అగ్రస్థానంలో ఉన్నదని జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడిస్తున్నది. అత్యాచారం ఘటన చోటుచేసుకున్నప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా సరిగాలేదు. బాధితురాలినే దోషిగా చూపే ప్రయత్నాలు ఒకటికి రెండు సందర్బాల్లో చోటుచేసుకున్నాయి. రెండేళ్లక్రితం కోల్‌కతా నగరంలో సామూహిక అత్యాచారం జరిగినప్పుడు ఇదంతా అబద్ధమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొట్టిపారేశాక మిగిలినవాటికి కూడా అదే గతి పట్టించడానికి అక్కడి పోలీసులు వెనకాడలేదు. ప్రస్తుత ఘటనలో నిందితులందరినీ అరెస్టుచేసినా, అత్యాచారం కేసుల్లో అనుసరించాల్సిన విధానాలకు తిలోదకాలిచ్చారు. కఠిన చట్టాలు అందుబాటులోకొచ్చినా వాటిని సక్రమంగా వినియోగించడంలో విఫలమైతే నిందితుల్లో భరోసా పెరుగుతుంది. దానివల్ల మరిన్ని నేరాలు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తరహా అనాగరిక ప్రవృత్తిని అరికట్టడానికి అవసరమైన చైతన్యాన్ని తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయడంలేదు సరికదా...తమ నిర్లిప్త ధోరణితోనో, తప్పుడు వైఖరితోనో అలాంటి నేరాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. దీన్ని సరిచేసుకోవలసిన అవసరం ఉన్నదని బీర్భూమ్ ఘటన తెలియజెబుతోంది. -
కౌగలించుకోలేదని బోయ్‌ఫ్రెండును పొడిచేసింది!
కౌగలించుకోడానికి నిరాకరించాడన్న కోపంతో.. అమెరికాలో ఓ మహిళ తన బోయ్‌ఫ్రెండును కత్తితో పొడిచేసింది!! దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఫ్లోరిడాలోని మనాటీలోని తమ నివాసంలో షవోనా రంఫ్, ఆమె బోయ్‌ఫ్రెండు కలిసి మద్యం తాగుతున్నారు. కాసేపటి తర్వాత ఇద్దరూ పడుకున్నారు. కానీ ఆమెను కౌగలించుకోడానికి అతడు నిరాకరించాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. బోయ్‌ఫ్రెండు షర్టును రంఫ్ లాగేసింది. దాంతో అది కాస్తా చిరిగిపోయింది. చివరకు ఆమె వంటింట్లో ఉపయోగించే కత్తి తీసుకుని అతగాడిని పొడిచేసింది. అతడు పారిపోవడానికి కూడా ఓ దశలో ప్రయత్నించాడు. ఈ సంఘటనతో రంఫ్ను అరెస్టు చేసినట్లు మాంటీ ప్రాంత పోలీసు కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత 250 డాలర్ల బాండు సమర్పించడంతో విడుదల చేశారు.