wife second marriage
-
బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!
బంజారాహిల్స్(హైదరాబాద్): భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా..భర్తకు దూరంగా ఉంటున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించగా..అతనిపై రోకలితో దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేపాల్ దేశం బరాండ్కు చెందిన కృష్ణదమత్ బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. 2013లో సునీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో హౌస్‌కీపింగ్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. 2024 అక్టోబర్‌లో కుటుంబాన్ని తన గ్రామానికి పంపించేందుకు స్నేహితుడి నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇదే విషయమై సునీతకు, కృష్ణకు గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో జనవరి 3న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కృష్ణకు భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో సునీతను ఇంటి నుంచి పంపించివేశాడు. అప్పటి నుంచి భార్యతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఇదిలా ఉండగా మంగళవారం సునీత సోదరుడు దీపక్..కృష్ణదమత్కు ఫోన్‌చేసి తన సోదరి అమర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. దీంతో కృష్ణదమత్ వెంటనే నందినగర్‌లోని సునీత ఉండే నివాసానికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా సునీత అల్యుమినియం రోకలితో భర్తపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కుడికంటి వద్ద తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. ఆమెతో పాటు అమర్ కూడా కృష్ణదమత్పై దాడి చేయగా బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య మీద కోపంతో.. కూతురి దారుణహత్య
బిహార్‌లోని కతిహార్ జిల్లాలో ఓ వ్యక్తి తన సొంతకూతురినే దారుణంగా కొట్టి, పీకపిసికి చంపేశాడు. తన భార్య తనను వదిలిపెట్టి వేరే వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతోనే అతడు ఇదంతా చేశాడు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని పట్నాకు 304 కిలోమీటర్ల దూరంలో గల కతిహార్ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మహ్మద్ ముస్తాక్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఇటీవల వదిలేసింది. ఎనిమిదేళ్ల కూతురు సుహానీ మాత్రం అతడితోనే ఉంటోంది. అంతలో తన భార్య ఢిల్లీలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని అతడికి తెలిసింది. దాంతో విపరీతంగా కోపం వచ్చిన ముస్తాక్.. తన కూతుర్ని బాగా కొట్టాడు. ఇంకా కోపం తగ్గక.. ఆమె పీక పిసికి చంపేశాడని టౌన్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ అనుపమ్ కుమార్ చెప్పారు. రోజుకూలీ అయిన ముస్తాక్‌పై అతడి అత్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టుచేసి, జైల్లో పెట్టారు. ముస్తాక్ భార్య దుఖ్నీ ఖాతూన్ (35) భర్తను వదిలిపెట్టి ఐదు నెలల క్రితం ఒక కొడుకు, కూతురితో కలిసి ఢిల్లీ వెళ్లిపోయింది. అప్పటినుంచి తన సోదరి వద్ద ఉంటోంది. వాళ్లకు మరో ముగ్గురు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లంతా ముస్తాక్తోనే ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం పెళ్లయినప్పటి నుంచి ముస్తాక్ తన అత్తవారింట్లోనే ఉంటున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో తరచు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుండేవి. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఖాతూన్.. ఐదు నెలల క్రితం భర్తను వదిలిపెట్టి ఢిల్లీ వెళ్లిపోయింది.