breaking news
white Cobra
-
అరుదైన ఆరు అడుగుల శ్వేత నాగు
సాక్షి, బెంగళూరు : సిలికాన్ సిటీ బెంగళూరులో అపురూపమైన శ్వేతనాగు కనిపించింది. ఇక్కడి న్యాయంగ లేఔట్ వద్ద తెల్లటి నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే పాముల నిపుణుడు మోహన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నాడు. దాదాపు ఆరు అడుగులు ఉన్న తెల్లటి నాగుపాము ఎంతో అరుదుగా ఉంటాయని, ఈ పామును సురక్షితంగా అడవుల్లోకి వదిలి పెడతామన్నారు. -
ఈమెకు నాగదేవతతో సంబంధముందట
- 34సార్లు పాము కరిచినా ఆరోగ్యంగానే ఉన్న మనీషా - 26సార్లు శ్వేతనాగే కాటేసిందన్న కుటుంబ సభ్యులు శ్రీమౌర్: ఒక్కసారి పాము కరిస్తేనే బతకడం కష్టం. అలాంటిది 34 సార్లు కరిస్తే.. బతికే అవకాశముంటుందా? కానీ ఓ అమ్మాయి బతికేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని శ్రీమౌర్లో 18 ఏళ్ల మనీషా అనే అమ్మాయి 34 సార్లు పాములు కరిచినా ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. అయితే ఇందులో 26 సార్లు ఆమెను శ్వేతనాగే (తెల్లని త్రాచుపాము) కరవడం విశేషం. ఆమె ఎక్కడున్నా ఆ శ్వేతనాగు వచ్చి కాటేసి వెళ్లిపోతోందట. మొదటిసారి స్థానిక నది సమీపంలో పాము కరిచిందని, ఆ తర్వాత ఒక్కోరోజు రెండుమూడుసార్లు కూడా శ్వేతనాగు కరిచేదని చెబుతోంది. ఆ తర్వాత మరికొన్ని పాములు కూడా తనను కాటేశాయని, గడిచిన మూడేళ్లలో మొత్తం 34 సార్లు తాను పాము కాటుకు గురయ్యానని చెప్పింది. అయినా తనకేమీ కాకపోవడం వెనుక నాగదేవతే ఉందని నమ్ముతోంది. తనకు నాగ దేవతకు ఏదో సంబంధం ఉండటం వల్లే పాము కాటు తనను ఏం చేయలేకపోతుందని జ్యోతిష్యులు, పూజారులు చెప్పినట్టు ఆ అమ్మాయి చెబుతోంది. కానీ విషం లేని, తక్కువ విషం కలిగిన పాములు కుట్టడం వల్లనే మనీషా ప్రాణానికి ప్రమాదం తప్పుతోందని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మనీషాకు 34 సార్లు పాములు కరిచినట్టు గుర్తించినట్టు తెలిసింది. తాజాగా ఫిబ్రవరి 18న మరోసారి పాము కరవడంతో మనీషా ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ వైఎస్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మెడికల్ సూపరిటెండెంట్ డాక్టర్ కేకే ప్రసాద్ చెప్పారు. ‘పాము కాటుకు గురైన లక్షణాలతో మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఇది విషం లేని పాముగా గుర్తించాం. ఇక్కడ ఉండే 80 శాతానికి పైగా పాముల్లో విషం ఉండదు’అని డాక్టర్ తెలిపారు. -
తీరంలో తెల్లతాచు
నరసాపురం అర్బన్/మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో శనివారం తెల్లతాచు ప్రత్యక్షమైంది. 5 అడుగుల పొడవున్న ఈ పాము మొగల్తూరు మండలం ఇంజేటివారి పాలెం పుంత రోడ్డులో కనిపించింది. జనం అలికిడితో కొద్దిసేపు పడగవిప్పి, బుసలు కొట్టి హడావుడి చేసింది. తరువాత చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. అరుదైన తెల్ల తాచు నాగుల చవితికి ముందురోజు కనిపించడంతో స్థానికులు దానిని చూడటానికి ఆసక్తి కనబర్చారు. ఇండియన్ కోబ్రాగా పిలిచే తెల్లతాచు శాస్త్రీయ నామం నాజా నాజా అని నరసాపురం వైఎన్ కళాశాల ప్రిన్సిపాల్, జువాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ కేవీసీఎస్ అప్పారావు చెప్పారు. దీని వయసు 5 నుంచి 8 సంవత్సరాల వరకూ ఉంటుందన్నారు. ఆసియా ఖండంలోని భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో ఈ జాతి పాములు ఉంటాయన్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి పాములు ఇటీవల కాలంలో కనిపించడం లేదని చెప్పారు.