పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో శనివారం తెల్లతాచు ప్రత్యక్షమైంది.
నరసాపురం అర్బన్/మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో శనివారం తెల్లతాచు ప్రత్యక్షమైంది. 5 అడుగుల పొడవున్న ఈ పాము మొగల్తూరు మండలం ఇంజేటివారి పాలెం పుంత రోడ్డులో కనిపించింది. జనం అలికిడితో కొద్దిసేపు పడగవిప్పి, బుసలు కొట్టి హడావుడి చేసింది. తరువాత చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. అరుదైన తెల్ల తాచు నాగుల చవితికి ముందురోజు కనిపించడంతో స్థానికులు దానిని చూడటానికి ఆసక్తి కనబర్చారు.
ఇండియన్ కోబ్రాగా పిలిచే తెల్లతాచు శాస్త్రీయ నామం నాజా నాజా అని నరసాపురం వైఎన్ కళాశాల ప్రిన్సిపాల్, జువాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ కేవీసీఎస్ అప్పారావు చెప్పారు. దీని వయసు 5 నుంచి 8 సంవత్సరాల వరకూ ఉంటుందన్నారు. ఆసియా ఖండంలోని భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో ఈ జాతి పాములు ఉంటాయన్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి పాములు ఇటీవల కాలంలో కనిపించడం లేదని చెప్పారు.