ఐదేళ్లు..ఐదొందలకోట్లు.! | Sakshi
Sakshi News home page

ఐదేళ్లు..ఐదొందలకోట్లు.!

Published Thu, Mar 14 2019 8:11 AM

Sea Shore Area Mined And Earned Crores Of Rupees By Somireddy Chndra Mohan reddy In PSR Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: గూడూరు డివిజన్‌లోని సముద్రతీర ప్రాంతంలో చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల వరకు సిలికా భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా భూముల్లో ఉన్న సిలికాపై జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్‌కుమార్‌ కన్నేసి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మైనింగ్‌కు అనుమతులు ఉన్న యజమానుల వద్ద లీజుల పేరుతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

చిల్లకూరు మండలంలో సుమారు 60 మైన్లు, కోట మండలంలో సుమారు 11 మైన్లను లీజుకు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే కొన్నింటికి కాలపరిమితి మించిపోయి ఉండగా కొన్నింటికి ఇంకా పదేళ్ల వరకు తవ్వకాలు చేసుకునే వీలుంది. దీనిని ఆసరా చేసుకున్న అధికారపార్టీ నాయకులు లీజుదారులను ప్రలోభపెట్టి వారి మీదనే మైన్లు ఉండగా అగ్రిమెంట్లు మీద మైన్లు సొంత చేసుకున్నారు. 

రూ.500 కోట్ల దోపిడీ
సిలికా మైన్స్‌ లీజు పేరుతో కొన్ని, కాలపరిమితి అయినపోయిన మరికొన్ని మైన్స్‌ యజమానులను అదిరించి, బెదిరించి సొంతం చేసుకున్న అధికారపార్టీ నేతలు ఐదేళ్లపాటు యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. మైన్‌లో పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో లోతైన గుంతలతోపాటు చెరువులను తలపించేలా భారీ యంత్రాలతో తవ్వేశారు. మొత్తం మీద 71 మైన్స్‌ ద్వారా సిలికాను తవ్వేసి నిత్యం 500 వాహనాలతో తరలించేవారు. చెన్నై, బెంగుళూరు, ముంబాయి, హైదరాబాద్, పూనే ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు తరలించేవారు.

దీంతోపాటుç పక్క రాష్ట్రాల్లో పెద్ద భవంతుల నిర్మాణాలకు ఇసుక బదులుగా సిలికాను తరలించి సొమ్ము చేసుకున్నారు. సిలికా ఇసుకను పోలి ఉండడంతో దీనిని ఇసుకగా చూపి  విక్రయించారు. దీంతో ఇక్కడ టన్ను రూ.600 వంతున దొరికే సిలికాను పక్క రాష్ట్రాల్లో టన్ను రూ.3 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రోజుకు సుమారు 500 లారీల వరకు సిలికాను తరలించేవారు. ఇలా ఐదేళ్లపాటు సిలికా తరలింపు ద్వారా దాదాపు రూ.500 కోట్ల వరకు నేతల జేబుల్లోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కావడంతో గనులశాఖ అధికారులు సైతం సిలికా అక్రమ రవాణాకు రాచబాట వేసి వారిచ్చే నెలవారీ మామూళ్లతో సరిపెట్టుకున్నారు.
 
ట్రిబ్యునల్‌ ఆదేశాలు తూట్లు
గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలకు తూట్లు పొడిచేలా సిలికా మైన్స్‌లో దోపిడీ సాగింది. అనుమతులు ఉన్న మైన్స్‌కు హద్దులు ఏర్పాటు చేసి 10 అడుగులకు మించి తవ్వకాలు చేపట్ట వద్దని గతంలో ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చింది. అధికారపార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కావడంతో వారు నిబంధనలు పాటించకున్నా అధికారులు పట్టించుకోలేదు. 10 అడుగులకు మించి గోతులు తీయకూడదనే నిబంధన ఉన్నా 40 అడుగుల తోతైన గుంతలు తవ్వేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. అంతేకాదు కాలుష్యం వెదజల్లి భూగర్భజలాలు కలుషితమయ్యాయి.

సాగు, తాగునీటికి కటకట 
సిలికా గనుల నుంచి వచ్చే ఊట నీటితో సొనకాలువలు ఎప్పుడూ నీటితో నిండి ఉండేవి. టీడీపీ పెద్దలు గనులను లీజులు తీసుకున్న తరువాత మండలంలో పలు గ్రామాలకు తాగు, సాగు అందించే 13 సొన కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో దాదాపు ఆయా కాలువల ద్వారా సాగయ్యే 2 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన దుస్థితి నెలకొంది. ఐదేళ్లపాటు కాలువలు ఎండి ఆ ప్రాంత రైతుల భూముల్లో పంటలు సాగు చేసుకోలేకపోయారు. సాగునీరుతోపాటు తాగునీటికి అష్టకష్టాలు పడ్డారు. వేసవి వస్తుందంటే తాగునీటికి ఆయా గ్రామస్తుల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement