breaking news
wages difficulties
-
యూపీలో మగ్గాలు నేస్తున్న టీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లహర్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ అక్రమ్ తెల్లవారు జామున మూడు గంటలకే నిద్ర లేస్తారు. ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఇంటికి సమీపంలోనే ఉన్న రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తారు. అక్కడి నుంచి ఇంటికెళ్లి ఇంత టిఫిన్ తిని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిశ్వాన్ మదర్సాకు సైకిల్‌పై వెళతారు. ఉదయం 9 గంటల నుంచి 2.30 గంటల వరకు అక్కడ పనిచేస్తారు. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాక సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మరో రెండు గంటలు రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తారు. కాన్పూర్ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్న అక్రమ్ బిశ్వాన్ మదర్సాలో లెక్కలు, ఇంగ్లీషు చెప్పేందుకు 2009లో నియమితులయ్యారు. 2016 వరకు ఆయన జీవితం కాస్త సాఫీగానే సాగింది. అప్పటి నుంచి జీతం రాకుండా నిలిచి పోవడంతో రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. అందులో రోజుకు 150 రూపాయలు వస్తాయట. ఎప్పటికైనా జీతానికి సంబంధించిన ఎరియర్స్ వస్తాయన్న ఆశతో ఆయన క్రమం తప్పకుండా మదర్సాకు వెళ్లి పిల్లలకు చదువు చెబుతూనే ఉన్నారు. అక్రమ్ ఒక్కడిదే కాదు ఈ బాధ. యూపీలోని మదర్సాల్లో ఆధునిక విద్యను బోధించేందుకు నియమితులైన 20 వేల మంది టీచర్ల పరిస్థితి ఇదే. వారిలో కొందరు పార్ట్‌టైమ్‌గా ఇళ్ల వద్ద విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. కొందరు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు నడుపుతున్నారు. మరి కొందరు ఇంటింటికి సరకులు మోస్తూ బతుకుతున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నడుస్తున్న ‘స్కీమ్ ఫర్ ప్రొఫైడింగ్ ఎడ్యుకేషన్ టు మదర్సాస్ అండ్ మైనారిటీస్’ కింద మదర్సాలలో మ్యాథమేటిక్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఇంగ్లీష్ బోధించేందుకు నియమితులైనవారు. మదర్సా నిర్వహణకు, గ్రంధాలయం లాంటి మౌలిక సదుపాయాలకు కేంద్రం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ప్రతి మదర్సాకు ముగ్గురు టీచర్ల చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లిస్తుంది. గ్రాడ్యువేట్ టీచర్లకు ఆరు వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు 12వేల రూపాయలను చెల్లిస్తుంది. దానికి తోడుగా గ్రాడ్యుయేట్లకు యూపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు మూడు వేల రూపాయలను చెల్లిస్తూ వచ్చింది. 2016, మార్చి నెల నుంచి వీరి జీతాలన్ని నిలిచిపోయాయి. ఈ మదర్సాలలో ముస్లిం పిల్లలే కాకుండా 30 శాతం మంది హిందూ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఇందుకు తమ తప్పేమి లేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల కాకపోవడమే కారణమని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వాదిస్తోంది. గ్రాంటును మంజూరు చేసినప్పటికీ 284.87 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయలేదు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ఈ కేంద్రం స్కీమ్‌ను అమలు చేస్తున్నప్పటికీ ఒక్క యూపీకే ఈ సమస్య రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని 8,584 మదర్సాలు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో 18,27,566 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వెయ్యికిపైగా మదర్సాలు ఉన్నాయి తప్పా, మిగితా రాష్ట్రాల్లో తక్కువగానే ఉన్నాయి. మదర్సాలంటే ఏమిటీ? మదర్సా అనే పదం అరబిక్ నుంచి వచ్చింది. అరబిక్‌లో దరా అంటే నేర్చుకోవడం అనే అర్థం. మదర్సా అంటే నేర్కుకునే బడి అని అర్థం. దేశ స్వాతంత్య్రానికి ముందు భారత్‌లో బ్రిటీష్ ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాలు, ముస్లిం సామాజిక వర్గం నడిపే మదర్సాలు రెండు రకాలు ఉండేవి. ప్రైవేటు మదర్సాల్లో ఇస్లాం మతంతోపాటు అరబిక్, ఉర్దూ, పర్షియన్ భాషలను నేర్పేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాల్లో కేవలం అరబిక్, ఉర్దూ, పర్షియన్ భాషలను మాత్రమే నేర్పేవారు. దేశానికి స్వాతంత్వ్రం వచ్చిన తర్వాత వీటిని మైనారిటీ వర్గానికి చెందిన ప్రాథమిక విద్యాకేంద్రాలుగానే పరిగణించారు. ప్రైవేట్ మదర్సాలలో ఇస్లాంను బోధిస్తారుకనుక అందులో చదువుకున్న వారు ఎక్కువగా ఇమామ్‌లు, ముస్లిం మత గురువులు అయ్యేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాలలో చదువుకునే వారు ఆ తర్వాత చదువుకు స్వస్తి చెప్పడమో, ప్రభుత్వ పాఠశాలల్లో చేరడమో చేసేవారు. సంస్కరణలు, ఆధునీకరణ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న మదర్సాల సంస్కరణలకు భారత ప్రభుత్వం 1993 నుంచి కృషి చేస్తోంది. ‘ఏరియా ఇంటెన్సివ్ ప్రోగామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ అండ్ ఫైనాన్సియల్ అసెస్టెంట్స్ ఫర్ మోడరనైజేషన్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్’ అనే రెండు స్కీమ్‌లు తెచ్చింది. వీటికి హిందువుల పిల్లలకు కూడా అనుమతి ఉండడంతో వారికి అరబిక్, పర్షియన్ భాషలకు బదులుగా సంస్కృతం బోధిస్తూ వస్తున్నారు. కేవలం భాషలకు, భాషా సంస్కృతి, సంప్రదాయాలకు పరిమితం అవుతున్న వీటిని ఆధునిక విద్యా కేంద్రాలుగా మార్చాలన్న ఉద్దేశంతోని కేంద్ర ప్రభుత్వం 2009లో ‘స్కీమ్ ఫర్ ప్రొఫైడింగ్ ఎడ్యుకేషన్ టు మదర్సాస్ అండ్ మైనారిటీస్’ ప్రైవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద మదర్సాల్లో చదువుకున్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా తొమ్మిదవ తరగతిలో చేరుతున్నారు. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు యూపీ స్కూళ్లలో చేరుతున్న వారిలో 25 శాతం మంది మదర్సా విద్యార్థులే ఉంటున్నారు. నిధుల విడుదలకు కఠిన నిబంధనలు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016లో మదర్సాలకు నిధులు విడుదల చేయడానికి నిబంధనలను కఠినతరం చేసింది. మదర్సాల ఆర్థిక సహాయం స్కీమ్‌ను కొనసాగించాలా, వద్దా? అన్న అంశంపై 2018లో మదర్సాల పనితీరును సమీక్షించింది. మరో రెండేళ్లపాటు 2020 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రతి ఏటా రాష్ట్రాల విద్యాబోర్డు అనుమతిని తప్పనిసరి చేసింది. అయితే నిధుల విడుదలలో తాత్సారం చేస్తోంది. యూపీ మదర్సా టీచర్లు ఢిల్లీ జంతర్‌మంతర్‌కు వెళ్లి ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. -
వైవీయూలో వేతనాల వెతలు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో జూన్ చివర్లో అర్హత కలిగిన 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారు. వీరితోపాటు మరో 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రెగ్యులర్ కెరీర్ అడ్వాన్స్ స్కీం కింద గ్రేడింగ్ ఇచ్చారు. దీంతో వీరికి హోదాతోపాటు వేతనాలు పెరిగాయి. ఆగస్టు నుంచి పెరిగిన వేతనాలు అందుకుంటామనుకున్న అధ్యాపక బృందానికి నిరాశ ఎదురైంది. విశ్వవిద్యాలయంలోని ఓ పాలకమండలి సభ్యుడు అడ్డు పడడంతో వేతనాల ఫైల్ వెనక్కు తిరిగి వచ్చినట్లు సమాచారం. గత వైస్ చాన్స్‌లర్ ఇచ్చిన పదోన్నతులకు ఈసీ ఆమోదం పొందిన తర్వాతే వీరికి పెరిగిన వేతనాలు ఇద్దామని ప్రస్తుత ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌తో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో పాలకమండలి సమావేశం తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుందామని ఫైల్‌ను వెనక్కి పంపివేయడంతో అధ్యాపక వర్గంలో ఆందోళన మొదలైంది. నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే... యోగివేమన విశ్వవిద్యాలయంలో 2013 తర్వాత 2016 జూన్‌లో పదోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. ఇది కూడా కోర్టు ఆదేశాల మేరకు అర్హులైన అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద పదోన్నతుల ప్రక్రియ చేపట్టారు. నిబంధనల మేరకు ఎవరు వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నప్పటికీ ఈ ప్రక్రియను నిర్వహించాలి. అప్పటి వైస్ చాన్స్‌లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. అయితే ప్రస్తుత పాలకమండలి సభ్యులు తమ ఆమోదం లేకుండానే ఈ ప్రక్రియ చేపట్టారంటూ అడ్డుతగులుతున్నట్లు సమాచారం. వైస్ చాన్స్లర్లు ఎవరూ శాశ్వతం కాదని.. నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి పదోన్నతులు ఇచ్చినప్పుడు వారికి రావాల్సిన వేతనాలు, బకాయిలు అందివ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. కాగా ప్రస్తుతం నెల రోజులు పూర్తయినప్పటికీ జూలై నెల ఇంక్రిమెంట్లు, పెరిగిన వేతనాలు ఇవ్వకపోవడం పట్ల వైవీయూ అధ్యాపక బృందంలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు డీఏలు బకాయిలు ఉన్న విషయం విదితమే. దీంతో పదోన్నతులు తీసుకున్నా అందుకు తగిన ప్రతిఫలం లేకపోవడంతో వైవీయూ అధ్యాపక బృందం నిర్వేదానికి గురవుతోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి వేతనాల వెతలు తీర్చాలని అధ్యాపకులు కోరుతున్నారు. వేతనాలు పెంపు వర్తింపజేస్తాం.. రెగ్యులర్ కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద పదోన్నతులు చేపట్టినప్పుడు నేను వీసీగా లేను. అప్పుడు ఈసీ అనుమతి తీసుకుని చేపట్టారో.. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేపట్టారో నాకు తెలియదు. ప్రొసీజర్ ప్రకారం ఈసీ అనుమతి తీసుకున్న తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ అయినా వేతనాల పెంపు వర్తిస్తుంది. నిబంధనల మేరకు అర్హులైన అధ్యాపకులకు ఎవరికీ నష్టం కలగదు. ఈసీలో ర్యాటిఫికేషన్ కాదు... అనుమతి పొందిన తర్వాత వేతనాలను వర్తింపజేస్తాం. లేనిపక్షంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. – ఆచార్య కె. రాజగోపాల్, ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్, వైవీయూ