breaking news
Venugopal nannuri
-
వాళ్ళ తలల్ని ‘తలారీ’కి అప్పజెప్పవద్దు!
తమిళనాడు ‘తండ్రీ కొడుకుల లాకప్ డెత్’ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ‘మరణ శిక్ష’ పడింది. దీనికి బదులు యావజ్జీవ శిక్ష వేయడం సబబు అనే చర్చ మొదలవ్వడం గమనార్హం. ఈ కేసు నేపథ్యంలోకి వెళితే... జయరాజ్, బెన్నిక్స్ తండ్రీ కొడుకులు. తమిళనాడు తూత్తుకుడిలోని ‘సాత్తాన్ కుళం’లో మొబైల్ షాప్ నడిపేవారు. 2020 జూన్ ‘లాక్డౌన్’లో వాళ్ళు మొబైల్ షాప్ తెరిచి ఉంచారు. ఈ నేరానికి ఇద్దర్నీ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఇంకోసారి తీయకుండా సాయంత్రం దాకా స్టేషన్లో కూర్చోబెట్టొచ్చు, ఎంతోకొంత జరిమానా వేయొచ్చు. ఇవేవీ పోలీ సులు చేయలేదు. వాళ్ళను కొట్టారు. ‘ట్రామాటిక్ షాక్’ అంటే ‘అపస్మారక స్థితి’లోకి ఆ తండ్రీ కొడుకులు వెళ్లిపోయారు. హాస్పిటల్లో చనిపోయారు.సాత్తాన్‌కుళం (Sathankulam) పోలీసులు... ‘వారు అరెస్ట్‌కు ప్రతిఘటించారు (రెసిస్టెడ్ అరెస్ట్)’. ‘స్వల్పంగా బలవంతం (మైల్డ్ ఫోర్స్) చేయవలసి వచ్చింది’. ‘చిన్నపాటి గాయాలు మాత్రమే జరిగాయి’ అంటూ ‘ప్రాథమిక సమాచార నివేదిక’ను అబద్ధాలతో నింపారు. ప్రజల్లో ఆగ్రహమూ, ఆందోళనా పెరిగాయి. మద్రాస్ హైకోర్టు దీన్ని ‘సుమోటో’గా తీసుకుంది. కోవిల్పట్టి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జి. భారతీదాసన్‌ను విచారణ జరిపి నేరుగా ధర్మాసనానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తరు వాత ఎఫ్ఐఆర్ మారింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 302 (హత్య), 342 (అక్రమ నిర్బంధం), 201 (సాక్ష్యాల నాశనం) కింద కొత్త సెక్షన్లతో కేస్‌ని మళ్లీ కట్టారు. మద్రాస్ హైకోర్టు ‘ఈ కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చెయ్యమంటూ’ సీబీఐకి అప్పజెప్పింది. సీబీఐ ఆ పనిని సవ్యంగానే చేసింది.సస్పెన్షన్, ఎక్స్‌గ్రేషియాలతో ప్రజల నిరసనల్ని ఆపలేమని అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామికి అర్థమయ్యింది. అందుకే ఈ కేసును సీరియస్‌గా తీసుకోవలసి వచ్చింది. ఆ రోజు స్టేషన్లో ఉన్న మిగిలిన సిబ్బంది చేత సాక్ష్యం చెప్పించింది. దాని ఫలితంగా తొమ్మిది మంది పోలీసులకు ‘మరణ శిక్ష’ పడింది. కారణాలు ఏవైనా ఈ శిక్ష ‘పోలీస్ హింస’కు ఒక జవాబును ఇచ్చినట్లే. చదవండి: ఇంటి వద్దే ఎఫ్ఐఆర్.. ఇదొక మంచి అడుగు!ఆ తండ్రీ కొడుకుల్ని ఆ తొమ్మిది మంది పోలీసులు చంపేశారు. ఇప్పుడు కోర్టులు ఆ తొమ్మిది మందినీ చంపబోతున్నాయి. ‘ఆదిమ ప్రతీకార నీతికి ఆఖరి అవశేషం మరణ శిక్ష’ అని మానవ హక్కుల నేత బాలగోపాల్ (Balagopal) అన్నారు. ‘చట్టానికి చంపే హక్కు ఉండకూడదు. చనిపోయిన వారిలో నిర్దోషులు ఉంటే వాళ్ళు ఇంక తిరిగి రార’నీ అన్నారు. ఇలాంటి వాదాలతో మానవ హక్కుల సంఘాలు మరణ శిక్షల్ని వ్యతిరేకిస్తున్నాయి. తొమ్మిది మందికీ (ఇంకా అలాంటి క్రూర పోలీసులకీ) తాము ఎంతటి దయాహీనులమో తెలియాలి అంటే వాళ్ళ తలల్ని ‘తలారీ’కి అప్పజెప్పడం కాదు; వాళ్లను జీవించనిద్దాము! జీవించినంత కాలమూ శిక్షిద్దాము!– నన్నూరి వేణుగోపాల్ మానవ హక్కుల కార్యకర్త -
నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!
విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెస్తామంటూ మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం దాదాపుగా చంద్రబాబు రుణమాఫీ నినాదమంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని ఇరకాటంలో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని సోనియా ‘నల్లధనం మాటేమిటి?’ అని నిలదీస్తున్నారు. ‘నల్లధనం మాటేమి టి?’ మహారాష్ట్ర ఎన్నికల సమరంలో సోనియా గాంధీ సంధించిన తాజా అస్త్రం ఇది. ‘విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించడమే నా ప్రధాన లక్ష్యం’ అంటూ నేటి ప్రధా ని నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానమే ఆయన గెలుపునకు కారణం కావచ్చు. కానీ అది చం ద్రబాబు రుణమాఫీ నినాదం అంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని, మోదీని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందవచ్చని సోనియా తాపత్రయం. యూపీఏ ప్రభుత్వంపైకి ఎల్కే ఆద్వానీ, మోదీలు సంధించిన అస్త్రాన్నే ఆమె కూడా అందుకున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అన్ని పార్టీలు చేయక తప్పని జపం ఇది. చిత్తశుద్ధికి వస్తే అన్నీ ఒక తానులోని ముక్కలే. మోదీ ప్రభుత్వం నల్లధనం గుట్టు రాబట్టడానికి ‘సిట్’ను ఏర్పాటు చేసిందని ఘనంగా చెప్పుకోన వసరం లేదు. దానికి సుప్రీం కోర్టు విధించిన గడువే కారణం. ‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెన క్కు తెప్పించాల’ని కోరుతూ 2009లో రామ్జెఠ్మ లానీ తదితరులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశా రు. ‘ప్రభుత్వం కళ్లుగప్పి విదేశీ బ్యాంకుల్లో డబ్బును అక్రమంగా దాచుకున్న వారి పేర్లను వెల్లడించండి’ అంటూ 2011 జనవరిలో సుప్రీం మధ్యంతర ఉత్త ర్యులను జారీ చేసింది. ప్రభుత్వం తాత్సారం చేస్తుం డటంతో 2011 జూలై 4న కోర్టే ‘సిట్’ను (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దానికి మాజీ న్యాయమూర్తి జీవన్‌రెడ్డి నేతృ త్వం వహించాలని నిర్దేశించింది. ‘సిట్’కేవలం జీవ న్‌రెడ్డికి మాత్రమే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించాలని జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఎస్ఎస్ నిజ్జార్లు సూచించారు. (సుప్రీం సూచించే ఇలాంటి నైతిక సూత్రాలను హోంశాఖ కింద పనిచేసే ఏ దర్యాప్తు సంస్థ లేదా బృందం పాటించడం అరుదు). ‘ఇలాంటి నేరాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతగా భావిస్తున్నాం’ అని కోర్టు నిష్కర్షగా పేర్కొంది. ప్రభుత్వం దాన్ని అవమానంగా భావిం చి ‘ఇది ప్రభుత్వ అసమర్థత కిందికి రాదు’ అంటూ అప్పీలుకు వెళ్లింది. ఈలోగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పదవీ విర మణ చేయగా ఆయన స్థానంలో జస్టిస్ అల్తమస్ కబీర్ నియమితులయ్యారు. నిజ్జార్‌కు భిన్నంగా ఆయన ప్రభుత్వ వాదనతో ఏకీభవించ డంతో ‘మూడవ అభిప్రాయం’ కోసం అది పైకి వెళ్లి అక్కడే ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కిం చుకునే ఆశల్లేని సోనియా యూపీఏ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్‌లోని ‘లిచ్ టెనిష్టియన్ బ్యాంక్’ ఇచ్చిన 26 మంది పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసింది. ఇది రాబోయే ప్రభుత్వాన్ని ఇరకా టంలో పెట్టడానికి వేసిన ఎత్తుగడే. ప్రపంచ అక్రమార్జనాపరుల స్వర్గసీమ స్విట్టర్లాండ్‌లో 312 బ్యాంకులున్నాయి, వాటికి 3,120 శాఖలున్నాయి. వివిధ దేశాల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కోరితే సంబంధిత ఖాతాదారుల వివరాలను వెల్లడించాలనే నిబంధన ఇటీవలి కాలంలో అక్కడ అమల్లోకి వచ్చింది. విదే శాల్లో నల్లధనాన్ని దాచేవారు సాధారణంగా బినా మీల పేర్లతోనే ఖాతాలు తెరుస్తారు. నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నాలు వేగంగా జరగాల్సి ఉంటుం ది. పూనెకు చెందిన హసన్ ఆలీ ఖాన్ అనే పందెపు గుర్రాల వ్యాపారి పేరు రచ్చకెక్కేటప్పటికే అతగాడు దాచిన డబ్బు అక్కడి నుండి రెక్కలు కట్టుకుని ఎగిరి పోయింది. ఇటీవలి కాలంలో స్విట్జర్లాండ్‌ను తల దన్నేలా సింగపూర్‌లాంటి నల్లధనం కోటలు చాలా నే పుట్టుకొచ్చాయి. నల్లధనం వెలికితీతపై ‘సిట్’ ఏర్పాటుకు సుప్రీం తుది గడువు 2014 మే 29. దీంతో మోదీ మే 28 మంత్రివర్గ సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఎమ్బీ షా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ జస్టిస్ జీవన్‌రెడ్డి. బీజేపీకి చెందిన రామ్‌జెఠ్మలానీ పిటీషన్ వేసి ఐదేళ్లు నిండాయి. ‘సిట్’ని నియమించాలని సుప్రీం ఆదేశించి మూడేళ్ల యింది. హడావుడిగా ‘సిట్’ను నియమించి ఐదు నెల్లు గడుస్తున్నా దాని అతీ గతీ మోదీకి పట్టలేదు. ఇప్పుడు సోనియాలాగే ఆయనకు కూడా మహా రాష్ట్ర ఎన్నికల జ్వరం పట్టుకున్నట్టుంది. ఏదో చేస్తు న్నామనిపించుకోవడానికి రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతి నిధి బృందాన్ని స్విట్జర్లాండ్‌కు పంపుతున్నట్టు తాజా గా ప్రభుత్వం ప్రకటించింది. చట్ట విరుద్ద మార్గాల ద్వారా సేకరించిన అక్రమార్జనాపరుల జాబితాలను పరిగణనలోకి తీసుకునేదే లేదని, ఖాతాదారుల వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదని ఫిబ్రవరిలో వచ్చిన సమాధానమే వస్తుంది గామోసు. సుప్రీం కోర్టు నల్లధనంపై కొరడా విసరడానికి ముందు స్విట్టర్లాండ్‌లోని మన నల్లధనం 5 లక్షల కోట్ల డాల ర్లు కాగా, ప్రస్తుతం అది 5 వేల కోట్ల డాలర్లకు చిక్కి పోయిందని అంచనా! మిగిలిన ఆ నాలుగు రాళ్లూ ‘సిట్’ దర్యాప్తు చేసి స్వయంగా ఖాతాదార్ల పేర్లు కనిపెట్టేసరికి మిగలవు. నల్లధనం మన ఎన్నికల వ్యవస్థకు ఊపిరిగా ఉన్నంత కాలం దానిపై పోరు ఎన్నికల నినాదంగానే మిగలక తప్పదు. - నన్నూరి వేణుగోపాల్


