ఇన్ బాక్స్
తమిళనాడు ‘తండ్రీ కొడుకుల లాకప్ డెత్’ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ‘మరణ శిక్ష’ పడింది. దీనికి బదులు యావజ్జీవ శిక్ష వేయడం సబబు అనే చర్చ మొదలవ్వడం గమనార్హం. ఈ కేసు నేపథ్యంలోకి వెళితే... జయరాజ్, బెన్నిక్స్ తండ్రీ కొడుకులు. తమిళనాడు తూత్తుకుడిలోని ‘సాత్తాన్ కుళం’లో మొబైల్ షాప్ నడిపేవారు. 2020 జూన్ ‘లాక్‌డౌన్’లో వాళ్ళు మొబైల్ షాప్ తెరిచి ఉంచారు. ఈ నేరానికి ఇద్దర్నీ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఇంకోసారి తీయకుండా సాయంత్రం దాకా స్టేషన్‌లో కూర్చోబెట్టొచ్చు, ఎంతోకొంత జరిమానా వేయొచ్చు. ఇవేవీ పోలీ సులు చేయలేదు. వాళ్ళను కొట్టారు. ‘ట్రామాటిక్ షాక్’ అంటే ‘అపస్మారక స్థితి’లోకి ఆ తండ్రీ కొడుకులు వెళ్లిపోయారు. హాస్పిటల్‌లో చనిపోయారు.
సాత్తాన్‌కుళం (Sathankulam) పోలీసులు... ‘వారు అరెస్ట్‌కు ప్రతిఘటించారు (రెసిస్టెడ్ అరెస్ట్)’. ‘స్వల్పంగా బలవంతం (మైల్డ్ ఫోర్స్) చేయవలసి వచ్చింది’. ‘చిన్నపాటి గాయాలు మాత్రమే జరిగాయి’ అంటూ ‘ప్రాథమిక సమాచార నివేదిక’ను అబద్ధాలతో నింపారు. ప్రజల్లో ఆగ్రహమూ, ఆందోళనా పెరిగాయి. మద్రాస్ హైకోర్టు దీన్ని ‘సుమోటో’గా తీసుకుంది. కోవిల్‌పట్టి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జి. భారతీదాసన్‌ను విచారణ జరిపి నేరుగా ధర్మాసనానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తరు వాత ఎఫ్‌ఐఆర్ మారింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 302 (హత్య), 342 (అక్రమ నిర్బంధం), 201 (సాక్ష్యాల నాశనం) కింద కొత్త సెక్షన్లతో కేస్‌ని మళ్లీ కట్టారు. మద్రాస్ హైకోర్టు ‘ఈ కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చెయ్యమంటూ’ సీబీఐకి అప్పజెప్పింది. సీబీఐ ఆ పనిని సవ్యంగానే చేసింది.
సస్పెన్షన్, ఎక్స్‌గ్రేషియాలతో ప్రజల నిరసనల్ని ఆపలేమని అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామికి అర్థమయ్యింది. అందుకే ఈ కేసును సీరియస్‌గా తీసుకోవలసి వచ్చింది. ఆ రోజు స్టేషన్‌లో ఉన్న మిగిలిన సిబ్బంది చేత సాక్ష్యం చెప్పించింది. దాని ఫలితంగా తొమ్మిది మంది పోలీసులకు ‘మరణ శిక్ష’ పడింది. కారణాలు ఏవైనా ఈ శిక్ష ‘పోలీస్ హింస’కు ఒక జవాబును ఇచ్చినట్లే.
చదవండి: ఇంటి వద్దే ఎఫ్ఐఆర్.. ఇదొక మంచి అడుగు!
ఆ తండ్రీ కొడుకుల్ని ఆ తొమ్మిది మంది పోలీసులు చంపేశారు. ఇప్పుడు కోర్టులు ఆ తొమ్మిది మందినీ చంపబోతున్నాయి. ‘ఆదిమ ప్రతీకార నీతికి ఆఖరి అవశేషం మరణ శిక్ష’ అని మానవ హక్కుల నేత బాలగోపాల్ (Balagopal) అన్నారు. ‘చట్టానికి చంపే హక్కు ఉండకూడదు. చనిపోయిన వారిలో నిర్దోషులు ఉంటే వాళ్ళు ఇంక తిరిగి రార’నీ అన్నారు. ఇలాంటి వాదాలతో మానవ హక్కుల సంఘాలు మరణ శిక్షల్ని వ్యతిరేకిస్తున్నాయి. తొమ్మిది మందికీ (ఇంకా అలాంటి క్రూర పోలీసులకీ) తాము ఎంతటి దయాహీనులమో తెలియాలి అంటే వాళ్ళ తలల్ని ‘తలారీ’కి అప్పజెప్పడం కాదు; వాళ్లను జీవించనిద్దాము! జీవించినంత కాలమూ శిక్షిద్దాము!
– నన్నూరి వేణుగోపాల్
మానవ హక్కుల కార్యకర్త


