ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌.. ఇదొక మంచి అడుగు! | Telangana Police Introduces Home Based FIR System Explained | Sakshi
Sakshi News home page

ఇదొక మంచి అడుగు!

Apr 4 2026 10:54 AM | Updated on Apr 4 2026 11:02 AM

Telangana Police Introduces Home Based FIR System Explained

ఇన్‌ బాక్స్‌

నేరాలకు గురైన బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని తెలంగాణ  పోలీసులు ఇటీవల ప్రకటించారు. ఎఫ్‌ఐఆర్‌ అంటే ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ లేదా ప్రాథమిక (నేర) సమాచార నివేదిక. నేరం జరిగినప్పుడు ప్రాథమికంగా బాధితులు తెలిపిన సమాచారం: నేర వివరాలు, నేరస్థుడి పేరు, నేరం జరిగిన సమయం, తేదీ దీనిలో ఉంటాయి. కాబట్టి దీనిని ఎఫ్‌ఐఆర్‌ అంటారు. కానీ ఈ మాటను ఎక్కడా చట్టంలో నిర్వచించలేదు.

ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు కూడా భౌగోళిక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో జరిగిన నేరాలపై మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకొని నేర పరి శోధన చేసే అధికారం ఉంటుంది. అయితే, 2012లో ఢిల్లీలో ‘నిర్భయ’ ఉదంతం తర వాత కేంద్ర ప్రభుత్వం నేర చట్టాలను బలోపేతం చేయడానికి నియమించిన ‘వర్మ కమిషన్‌’ ముఖ్య సూచనలు చేసింది. తీవ్ర మైన లేదా హేయమైన నేరాలు జరిగిన ప్రదేశం తమ పరిధిలో లేకున్నా బాధితులు ఇచ్చిన నేర సమాచారాన్ని ఏ పోలీస్‌ స్టేషన్‌ అయినా ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయాలనీ, అందుకు అప్పుడు అమలులో ఉన్న క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌–1973లో తగిన సవరణలను చేయాలనీ సిఫారసు చేసింది.

తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు, బాధితులు, ప్రత్యేకించి స్త్రీలు ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌ వెతుకుతూ వెళ్లాల్సిన ఆగత్యం పట్టవద్దనేది ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ ముఖ్యోద్దేశం. ప్రతి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ప్పుడు దాని వివరాలను జనరల్‌ డైరీలో రాస్తూ, దానికి ఒక నంబర్‌ వేస్తారు. కానీ ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’కు నంబర్‌ కేటాయించాల్సిన అవసరం లేదు. అందుకే దానిని ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ అంటారు. దీన్ని నమోదు చేసిన తరువాత, నేరం జరిగిన ప్రదేశానికి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు ఆ నేర సమాచారాన్ని వెంటనే పంపించాలి. సంబంధిత పోలీస్‌ స్టేషన్, ఆ ఎఫ్‌ఐఆర్‌కు ఒక నంబర్‌ వేసి నియమాల ప్రకారం దర్యాఫ్తు చేయాలి.

చ‌ద‌వండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్‌లైన్‌లో పెట్ట‌లేరా?

క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్టంలో ఇది భాగం కానందున, ఇది సరిగ్గా అమలు కాలేదు. అయితే ‘భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత –2023’ లోని సెక్షన్‌ 173, తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు సమాచారాన్ని తీసుకోవడానికి అన్ని పోలీస్‌ స్టేషన్లకు చట్టబద్ధమైన అధికారాన్ని కల్పించింది. తెలంగాణ పోలీస్‌ శాఖ ఇంకొక అడుగు ముందుకు వేస్తూ, పోలీసులే బాధితుల ఇళ్లకు వెళ్ళి ఫిర్యాదు / నేరాన్ని నమోదు (Home Based FIR) చేయాలని నిర్ణయించింది. ఇది మంచి పరిణామం. ఈ ప్రక్రియ కూడా జీరో ఎఫ్‌ఐఆర్‌ కోవలోకే వస్తుంది.

– కె. ఎస్‌. హరీష్‌ కుమార్‌
విశ్రాంత అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (లా), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 

Advertisement
 
Advertisement
Advertisement