breaking news
Veluguralla Thanda
-
యువతి హత్య కేసులో తల్లి, సోదరుల అరెస్టు
ఆమనగల్లు (మహబూబ్నగర్ జిల్లా) : కడ్తాల మండలం మైసిగండి గ్రామ పరిధిలోని వెలుగురాళ్ల తండాలో పెళ్ళి కాకుండానే గర్భం దాల్చిన గిరిజన యువతిని హత్య చేసిన తల్లి, సోదరులను సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమనగల్లు పోలీసు స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమనగల్లు సీఐ రవీంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. వెలుగురాళ్ల తండాకు చెందిన గిరిజన యువతి ఇస్లావత్ మంజుల పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో అవమానంగా భావించిన కుటుంబ సభ్యులు ఈ నెల 12న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మంజులను తీసుకుని తల్లి సోని, సోదరుడు జగన్, బాబులాల్లు పొలం వద్దకు వెళ్ళారు. అక్కడే గర్బం దాల్చడానికి కారణమెవరని అడిగినప్పటికీ చెప్పకపోవడంతో ఆగ్రహంతో మంజులను సోనీ, బాబులాల్ పట్టుకోగా జగన్ కట్టెతో తలపై తీవ్రంగా కొట్టాడు. దీనితో అపస్మారక స్థితిలో ఉన్న మంజుల నోట్లో పురుగుల మందు పోశారు. అనంతరం జగన్ బావమరిది గడ్డమీదితండాకు చెందిన కిరణ్ సాయంతో ముగ్గురు మంజులను ఇంటికి తీసుకువచ్చి పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడిందని తాండావాసులను నమ్మించారు. మరుసటిరోజు ఉదయం తండా సమీపంలోని పొలం వద్ద మృతిచెందిన మంజులను గోతి తీసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మంజుల హత్య విషయం బయటకు పొక్కడంతో వీఆర్ఓ భారతి ఫిర్యాదు మేరకు తండాకు చేరుకుని మంజుల మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించామని సీఐ వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి శనివారం తల్లి సోని, సోదరులు బాబులాల్, జగన్లను అరెస్టు చేశామని మరో నిందితుడు కిరణ్ పరారీలో ఉన్నాడని ఆయన వివరించారు. అలాగే మృతురాలు మంజుల గర్భం దాల్చడానికి కారణం ఎవరనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో కడ్తాల ఎస్ఐ రామలింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని..
-
పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని..
కడ్తాల్: కడ్తాల్ మండలం మైసిగండి గ్రామ పంచాయితీ పరిధిలోని వెలుగురాళ్ల తండాలో 19 సంవత్సరాల ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భవతయిందనే కోపంతో తల్లి, అన్నలు మానవత్వం మరచి.. తోబుట్టువు అని చూడకుండా సొంత చెల్లెలిని తీవ్రంగా కర్రతో కొట్టి చంపారు. మృతి చెందిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నోట్లో పురుగులమందు పోసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిపెట్టారు. విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కడంతో, రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం తండాను సందర్శించి కుటుంబ సభ్యులను విచారించారు. సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కడ్తాల మండలం మైసిగండి పంచాయితీ పరిధిలోని వెలుగురాళ్ల తండాకు చెందిన దేవుల సోని దంపతులకు ముగ్గురు కుమారులు రవి, జగన్, బబ్లూలు, కుమారై మంజుల ఉన్నారు. మంజుల గత కొంత కాలంగా నల్గొండ జిల్లా దేవరకొండలోని బందువుల ఇంట్లో ఉంటుంది. గత పదిహేను రోజుల క్రితమే మంజులను తల్లి సోని తండాకు తీసుకు వచ్చింది. వివాహం కాకుండానే మంజుల గర్భం దాల్చడంతో ఈ నెల 12న తల్లి, సోదరులు బబ్లూ, జగన్లు మంజులను ప్రశ్నించారు. ఆమె నుండి సరైన సమాధానం రాకపోవడంతో తల్లితో పాటు, బబ్లూ, జగన్లు మంజులను కర్రలతో తీవ్రంగా కొట్టారు. మృతి చెందిన తర్వాత తమ సొంత వ్యవసాయ పోలానికి తీసుకువెళ్లి, నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకుందని తండా వాసులను నమ్మించారు. మృతదేహన్ని తీసుకువెళ్లి గురువారం ఉదయం తమ వ్యవసాయ పొలంలో పూడ్చిపెట్టారు. విషయం బయటికి రావడంతో శుక్రవారం రెవెన్యూ అధికారి ఫిర్యాధుతో సైబరాబాద్ అసిస్టెంట్ కమీషనర్ అనురాధ, సీఐ రవీంద్రప్రసాద్, ఎస్ఐలు రామలింగా రెడ్డి, సురేశ్యాదవ్లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి సోని, సోదరులు బబ్లూ, జగన్లను అదుపులోకి తీసుకుని విచారించారు. పూడ్చి పెట్టిన చోటును గుర్తించి, తహసీల్దార్ రవికుమార్ సమక్షంలో మతదేహన్ని వెలికితీశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడితో అక్కడే పోస్టుమార్టం చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఎసీపీ అనురాధ, సీఐ రవీంద్రప్రసాద్లు తెలిపారు.