breaking news
vayanam
-
వరాలతల్లి.. కల్పవల్లి
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వివాహితలు తమ కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారని తెలుసు కదా... అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతం రెండు వారాల పాటు చేసుకునే విధంగా రావడం విశేషం. సాధారణంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని అందరికీ తెలిసిందే. అయితే ఈసారి శుక్రవారం పౌర్ణమి రోజే వచ్చింది. పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన తిథి కాబట్టి మూడవ శుక్రవారం అయినా ఆ రోజున ఈ వ్రతం ఆచరించడం మరింత శ్రేష్ఠమని పండితుల అభిప్రాయం. శ్రద్ధ, భక్తి, ఓపిక, వెసులుబాటు ఉండాలే కానీ నెలలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతం ఆచరించవచ్చునన్నది పెద్దల మాట. ఎప్పుడు చేసుకున్నా, ప్రాంతీయ భేదానుసారం కొద్దిపాటి మార్పు చేర్పులతో చేసుకునే ఈ వరలక్ష్మీ వ్రతవిధానమిది...ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు, గడపకు పసుపు, కుంకుమ, అందమైన ముగ్గులతో గృహాలంకరణ చేయాలి. ఒక పీఠంపై బియ్యం పోసి, దానిపై రాగి లేదా వెండి కలశాన్ని ఉంచాలి. కలశంలో నీరు, నాణేలు, పసుపు, కుంకుమ వేసి, పైన మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి లక్ష్మీదేవి గా భావించాలి. అమ్మవారి ముఖరూపాన్ని అలంకరించి పీఠంపై ప్రతిష్ఠించాలి.తోరాలు: తొమ్మిది నూలు దారపు పోగులతో, తొమ్మిది ముడులు వేసి, పసుపు రాసి తోరాలు (రక్షా సూత్రాలు) తయారు చేసి పూజలో ఉంచాలి.సంక్షిప్త పూజా విధానంగణపతి పూజ: సంప్రదాయం ప్రకారం ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుడి పూజతోనే ప్రారంభించాలి. అందువల్ల పసుపు వినాయకుడిని చేసి, అక్షతలు, పూలతో పూజించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. లక్ష్మీ ఆరాధన: ఆ తర్వాత కలశంలో ఉన్న వరలక్ష్మీ దేవికి షోడశోపచార పూజ చేయాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుతూ సుగంధభరితమైన పువ్వులు, కుంకుమతో అర్చన చే యాలి.తోర పూజ: అమ్మవారి మూలమంత్రాలను పఠిస్తూ పూజలో ఉంచిన తోరాలకు పూజ చేసి, ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవడం వ్రతంలో ముఖ్య క్రతువు. నైవేద్యం: లక్ష్మీదేవికి ఇష్టమైన నవధాన్యాలు, బూరెలు, గారెలు, పరమాన్నం, కొబ్బరికాయలు వంటి నవకాయ పిండివంటలను, ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. వ్రత కథ: పూర్వం పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రత మహత్యాన్ని వివరించాడు. మగధ దేశంలోని కుండినం అనే నగరంలో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె అత్తమామలను, భర్తను దైవంగా భావించి సేవించేది. ఆమె భక్తికి మెచ్చిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో ప్రత్యక్షమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానంటూ వ్రతవిధానాన్ని చెప్పింది. చారుమతి తన కలను కుటుంబ సభ్యులకు వివరించి, ఊరిలోని మిగతా స్త్రీలతో కలిసి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది. పూజ పూర్తి కాగానే, వ్రతం చేసిన స్త్రీలందరి ఇళ్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయాయి. అప్పటినుండి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ప్రతి ఏటా సంప్రదాయంగా చేసుకుంటున్నారు.వాయనం: పూజ తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి, వ్రత కథాక్షతలను శిరస్సున ధరించాలి. సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి, తాంబూలంలో పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, రవికె గుడ్డ, ప్రసాదాలను వాయనంగా ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి.మరికొన్ని విశేషాలు‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్టమైన’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీవ్రతం.శ్రావణ మాసమంటే ఎందుకని ఇష్టం? శ్రవణం లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం పేరు మీదుగా వచ్చిన మాసం కాబట్టి ఈ మాసమంటే అమ్మవారికి ఇష్టం. అలాగే పూర్ణిమ రోజున అమ్మవారు షోడశ కళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతికరం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీ నివాస స్థానాలుమహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, గోమయం, గోపృష్టం, ఆవు కొమ్ముల మధ్యన, పూజామందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార సంపన్నుడైన పండితుడు లేదా గురువు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలి. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందట. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, ధనం, ధాన్యం, సౌభాగ్యం వంటివి కూడా ధనమే. వరలక్ష్మీ వ్రతం పూజా విధానంవరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి. అది వరలక్ష్మీవ్రతం. వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వివరాలు...పండ్లు – పిండివంటలు అలంకరణ వస్తువులు ∙పసుపు, కుంకుమ, గంధం ∙అక్షతలు, అగరుబత్తీలు ∙కర్పూరం, నెయ్యి, నూనె ∙దూది వత్తులు, హారతి పళ్ళెం ∙తమలపాకులు (20), వక్కలు ∙నాణేలు ∙కలశం పాత్ర (వెండి/రాగి/ఇత్తడి) ∙ఐదు రకాల పండ్లు (అరటి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష, జామ వంటి పండ్లు ∙కొబ్బరికాయలు (కనీసం 3) ∙తోరాలు (9 పోగుల దారాలు) నానబెట్టిన శనగలు ప్రసాదాలు (పరమాన్నం, గారెలు, బూరెలు) ∙అమ్మవారి ముఖరూపం ∙మామిడి ఆకులు, అరటి మొక్కలు ∙పూలమాలలు, విడిపూలు ∙కొత్త రవికల గుడ్డలు (వాయనం కోసం) ∙పీఠం (చెక్క పీట), ఎర్రటి వస్త్రం ∙గాజులు, తాంబూలం వస్తువులు.కలశం ఎందుకు?వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. ఎందుకంటే కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం. అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తిస్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.– డి.వి.ఆర్. -
అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్..
రాయవరం: అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్.. అంటూ మహిళలు ఆటపాటలతో కోలాహలంగా జరుపుకునే పండగ అట్లతద్ది. ముఖ్యంగా వివాహమైన అనంతరం నవ వధువు అట్లతద్ది పండగను తప్పనిసరిగా చేసుకోవడం ఆనవాయితీ. మాంగళ్య బలం కోసం గౌరీదేవిని భక్తితో కొలిచే ఈ పర్వదినాన్ని ఆశ్వీ యుజ మాసం బహుళ తదియ నాడు నోయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గ్రామీణ ప్రాంతాల్లో అట్లతద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నెల (అక్టోబర్) 12న అట్లతద్ది పర్వదినం సందర్భంగా పూజకు ఏర్పాట్లు చేసుకునే పనిలో మహిళలు నిమగ్నమై ఉన్నారు. ఇస్తినమ్మ వాయనం.. మహిళలు నోచే నోముల్లో అతి ముఖ్యమైనది అట్లతద్ది పండుగ. వేకువజామునే లేచి స్నానపానాదుల అనంతరం ఐదు గంటల లోపుగా భోజనం చేసి వ్రతాన్ని ప్రారంభిస్తారు. మజ్జిగ అన్నం, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయల పులుసు, గడ్డపెరుగుతో భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. కొత్తగా పెళ్లైన యువతులు తప్పనిసరిగా అట్లతో వాయనాలు ఇస్తారు. సాయంత్రం సమయంలో కాలువ వద్దకు వెళ్లి కాలువలో మట్టిని, వరిదుబ్బులను, నవధాన్యాలతో తయారుచేసిన జాజాల బుట్టలను గౌరీదేవిగా భావించి పూజలు చేస్తారు. నీళ్లలో గౌరమ్మ.. పాలల్లో గౌరమ్మ అంటూ పాటపాడుతూ పూజ అనంతరం వాటిని కాలువలో కలుపుతారు. అట్లతద్దికి ఐదురోజుల ముందుగా చిన్నచిన్న బుట్టల్లో మట్టి వేసి అందులో మెంతులు, పెసలు, కందులు, పత్తి తదితర నవధాన్యాలను వేస్తారు. అట్లతద్ది రోజున మొలకలు వచ్చే విధంగా చూస్తారు. వీటినే జాజాలు అంటారు. ఉయ్యాల ఊగుతూ.. గోరింటాకు పెట్టుకుంటూ.. అట్లతద్ది రోజున మహిళలు తప్పనిసరిగా ఉయ్యాల ఊగుతారు. అదేవిధంగా అట్లతద్దికి ముందురోజున మహిళలు గోరింటాకు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కాలువల వద్దకు వెళ్లే సమయంలో పెళ్లిపీటలపై కట్టుకున్న పట్టుచీరను తప్పనిసరిగా ధరిస్తారు. ఉదయం నుంచి కటిక ఉపవాసం చేసే మహిళలు సాయంత్రం పూజ అనంతరం చంద్రదర్శనం కోసం వేచిచూస్తారు. చంద్రుడు కనిపించాక పూజ చేసుకున్న అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. రాయవరం, మండపేట, కపిలేశ్వరపురం, రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు మండలాల పరిధిలోని 120 గ్రామాల్లో అట్లతద్ది నోముకు మహిళలు సిద్ధమవుతున్నారు. నోముకు అవసరమైన పూజా సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో మహిళలు ఉన్నారు. ఏటా నోచుకుంటాం ఏటా తప్పనిసరిగా అట్లతద్ది నోము నోచుకుంటాను. ఈ ఏడాది నోముకి ఇప్పటికే జాజాలు సిద్ధం చేసుకున్నాం. పూజకు అవసరమైన ఏర్పాట్లలో ఉన్నాం. – పులగం శివకుమారి, గృహిణి, రాయవరం సౌభాగ్యం కోసం సౌభాగ్యం కోసం గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. అట్లతద్ది రోజు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అమ్మవారిని పూజించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ వేడుక మహిళలకు ప్రత్యేకం. – కొప్పిశెట్టి లక్ష్మి, గృహిణి, అద్దంపల్లి, కె.గంగవరం మండలం వాయనాలు ప్రధానం హిందూ సంప్రదాయంలో అట్టతద్దికి పెళ్లైన ఏడాది నవ వధువులు వాయనాలు తీర్చుకోవడం ఈ పర్వదినంలో ప్రధానమైన ప్రక్రియ. అట్లతద్దిని మన ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది. – విలపర్తి ఫణిధర్‌శర్మ, అర్చకులు, రాయవరం -
రెండు గంటల్లో పెరుగు రెడీ!
వాయనం పెరుగు లేకపోతే భోజనం పూర్తి కాదు మనకి. మాంచి కూరతో ఫుల్లుగా లాగించినా, చివర్లో రెండు ముద్దలు పెరుగన్నం తినకపోతే తృప్తి ఉండదు. ఆరోగ్యానికి కూడా పెరుగు ఎంతో మంచిది కావడంతో, దాన్ని తప్పక తింటారు అందరూ. అయితే పెరుగు అంత తేలికగా తయారవదు. పాలలో కాసింత పెరుగు వేసి తోడుపెడితే... కొన్ని గంటల తర్వాత పెరుగు రెడీ అవుతుంది. ఎంత అర్జంట్ అయినా చేసేదేమీ ఉండదు. దాంతో చుట్టాలు వచ్చినప్పుడు, ఫంక్షన్లప్పుడూ ఒక్కోసారి ఇబ్బంది కలుగుతుంది. ఆ సమస్యను తీర్చడానికే ఈ యంత్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఇన్స్టంట్ కర్డ్ మేకర్స్ లేక ఇన్స్టంట్ యోగర్ట్ మేకర్స్ అంటారు. ఐదు వందల నుంచి పది వేల వరకూ రకరకాల ఖరీదుల్లో లభిస్తున్నాయి. కరెంటుతో పని చేసే మెషీన్లో పాలు పోసి, రెండు చెంచాల పెరుగు వేసి మూతపెట్టి, స్విచ్ ఆన్ చేస్తే చాలు... పెరుగు తయారైపోతుంది. పాలు ఎంత పరిమాణంలో ఉన్నా తోడు కోవడానికి పట్టే సమయం రెండే రెండు గంటలు. కొన్ని మేకర్స్‌లో ఒకే గిన్నె కాకుండా చిన్న చిన్న డబ్బాల మాదిరిగా ఉంటాయి. తోడుకున్న తర్వాత వాటినలాగే ఫ్రిజ్‌లో పెట్టేసుకోవడానికి అనువుగా ఉండేందుకే ఇలా తయారు చేశారు. సాధారణంగా చలికాలంలో పాలు త్వరగా తోడుకోవు కదా! కానీ ఈ మెషీన్లు చలికాలంలో కూడా రెండు గంటల సమయంలోనే పాలను తోడు పెట్టేస్తాయి. -
ఇల్లు మారుతున్నారా?
వాయనం: అసౌకర్యాలు కలిగినప్పుడు ఇల్లు మారడం సహజమే. అయితే అది అంత సులభమైన విషయం మాత్రం కాదు. అందుకే చాలామంది ఎంత ఇబ్బందిగా ఉన్నా సర్దుకుపోతుంటారు తప్ప, ఇల్లు మారడానికి మాత్రం ఇష్టపడరు. అయితే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇల్లు షిఫ్టింగ్ అంత కష్టమనిపించదు. మీకు కనుక ఇల్లు మారే ఆలోచన ఉంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు... * ఇల్లు మారాలనుకున్నప్పుడు ముందుగా చేయాల్సింది... ఇప్పుడు ఉంటున్న ఇంటికి, కొత్తగా తీసుకున్న ఇంటికి మధ్య పోలికలు, వైరుధ్యాలు అంచనా వేసుకోవడం. అలా చేస్తే సామాన్లు సర్దుకోవడంలో ఇబ్బంది ఉండదు! * ఇప్పుడున్న ఇంట్లో ఉన్న ఒక వస్తువును, కొత్త ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ముందుగానే అంచనా వేసుకోండి. ప్రతి వస్తువు స్థానాన్నీ ముందే నిర్దేశించుకోండి! * ఒకవేళ వెళ్లబోతున్న ఇల్లు ఇప్పటి ఇంటి కన్నా చిన్నది అయితే, అనవసరమైన వస్తువులు ఏవైనా ఉంటే ఇక్కడే తీసి పారేయండి, లేదంటే అమ్మేసుకోండి. అనవసరంగా మోసుకెళ్లడమెందుకు! * ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్లు వస్తే ఓకే. లేదంటే వస్తువులన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం ప్యాక్ చేసుకోండి. సామాన్లను ఎప్పుడూ గదుల వారీగా ప్యాక్ చేసుకోవాలి తప్ప, అందులో ఒకటి ఇందులో ఒకటి ప్యాక్ చేసి అన్నిటినీ కలిపి ఒకచోట పారేయవద్దు! * ప్రతి ప్యాకెట్మీదా అందులో ఏమున్నాయో తప్పక రాసుకోండి. అలాగే ఏ గదిలోని వస్తువుల ప్యాకెట్లు ఆ గదిలోనే ఉంచుకోండి. లారీలో సర్దేటప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం ఎక్కిస్తే... దింపుకునేటప్పుడు కూడా ఆయా వస్తువుల్ని అవి పెట్టాల్సిన గదుల్లోకి చేరవేసుకోవడం తేలిక అవుతుంది! మొక్కలు కనుక ఉంటే... వాటన్నిటినీ కుండీలతో తీసుకెళ్లవద్దు. పొరపాటున కుండీలు పగిలితే, మట్టి అంతా రాలిపోయి, వేళ్లు బయటపడి, మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే మట్టితో సహా మొక్కను కుండీలోంచి జాగ్రత్తగా తీసి, వేళ్లను ఓ పాలిథీన్ కవర్లో గట్టిగా బిగించి కట్టండి. సామాన్లతో పాటు ఇష్టమొచ్చినట్టు లారీలో ఎక్కించకుండా, మొక్కలన్నిటినీ ఓ పక్కగా, వాటి మీద బరువు పడకుండా ఉండేలా సర్దండి. కొత్త ఇంటికి వెళ్లీ వెళ్లగానే ముందుగా మొక్కల్ని తీసి కుండీల్లో పెట్టి, నీళ్లు పోయడం మర్చిపోకండి! ఇంత ప్లాన్డ్గా ఉంటే ఇల్లు షిఫ్టింగ్ అనేది సమస్య ఎందుకవుతుంది! చక్కగా కొత్త ఇంటికెళ్లగానే ఏ గదిలో ప్యాకెట్లు ఆ గదిలో పెట్టేసుకుని, వాటి మీద రాసుకున్న వివరాలను బట్టి ఒక్కోటీ సర్దేసుకున్నారనుకోండి... రెండు మూడు రోజుల్లో అన్నీ సెట్ అయిపోతాయి. ఇక మీరు హ్యాపీగా ఉండవచ్చు!


