వరాలతల్లి.. కల్పవల్లి  | Shravana Varalakshmi Vratham 2026, sakshi special story | Sakshi
Sakshi News home page

వరాలతల్లి.. కల్పవల్లి 

Aug 21 2026 3:31 AM | Updated on Aug 21 2026 3:31 AM

Shravana Varalakshmi Vratham 2026, sakshi special story

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వివాహితలు తమ కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారని తెలుసు కదా... అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతం రెండు వారాల పాటు చేసుకునే విధంగా రావడం విశేషం. సాధారణంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని అందరికీ తెలిసిందే. అయితే ఈసారి శుక్రవారం పౌర్ణమి రోజే వచ్చింది. 

పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన తిథి కాబట్టి మూడవ శుక్రవారం అయినా ఆ రోజున ఈ వ్రతం ఆచరించడం మరింత శ్రేష్ఠమని పండితుల అభిప్రాయం. శ్రద్ధ, భక్తి, ఓపిక, వెసులుబాటు ఉండాలే కానీ నెలలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతం ఆచరించవచ్చునన్నది పెద్దల మాట. ఎప్పుడు చేసుకున్నా,  ప్రాంతీయ భేదానుసారం కొద్దిపాటి మార్పు చేర్పులతో చేసుకునే ఈ వరలక్ష్మీ వ్రతవిధానమిది...

ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు, గడపకు పసుపు, కుంకుమ, అందమైన ముగ్గులతో గృహాలంకరణ చేయాలి. ఒక పీఠంపై బియ్యం పోసి, దానిపై రాగి లేదా వెండి కలశాన్ని ఉంచాలి. కలశంలో నీరు, నాణేలు, పసుపు, కుంకుమ వేసి, పైన మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి లక్ష్మీదేవి గా భావించాలి. అమ్మవారి ముఖరూపాన్ని అలంకరించి పీఠంపై ప్రతిష్ఠించాలి.

తోరాలు: తొమ్మిది నూలు దారపు పోగులతో, తొమ్మిది ముడులు వేసి, పసుపు రాసి తోరాలు (రక్షా సూత్రాలు) తయారు చేసి పూజలో ఉంచాలి.
సంక్షిప్త పూజా విధానం

గణపతి పూజ: సంప్రదాయం ప్రకారం ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుడి పూజతోనే ప్రారంభించాలి. అందువల్ల పసుపు వినాయకుడిని చేసి, అక్షతలు, పూలతో పూజించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. 

లక్ష్మీ ఆరాధన: ఆ తర్వాత కలశంలో ఉన్న వరలక్ష్మీ దేవికి షోడశోపచార పూజ చేయాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుతూ సుగంధభరితమైన పువ్వులు, కుంకుమతో అర్చన చే యాలి.

తోర పూజ: అమ్మవారి మూలమంత్రాలను పఠిస్తూ పూజలో ఉంచిన తోరాలకు పూజ చేసి, ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవడం వ్రతంలో ముఖ్య క్రతువు. 

నైవేద్యం: లక్ష్మీదేవికి ఇష్టమైన నవధాన్యాలు, బూరెలు, గారెలు, పరమాన్నం, కొబ్బరికాయలు వంటి నవకాయ పిండివంటలను, ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. 

వ్రత కథ: పూర్వం పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రత మహత్యాన్ని వివరించాడు. మగధ దేశంలోని కుండినం అనే నగరంలో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె అత్తమామలను, భర్తను దైవంగా భావించి సేవించేది. ఆమె భక్తికి మెచ్చిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో ప్రత్యక్షమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానంటూ వ్రతవిధానాన్ని చెప్పింది.

 చారుమతి తన కలను కుటుంబ సభ్యులకు వివరించి, ఊరిలోని మిగతా స్త్రీలతో కలిసి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది. పూజ పూర్తి కాగానే, వ్రతం చేసిన స్త్రీలందరి ఇళ్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయాయి. అప్పటినుండి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ప్రతి ఏటా సంప్రదాయంగా చేసుకుంటున్నారు.

వాయనం: పూజ తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి, వ్రత కథాక్షతలను శిరస్సున ధరించాలి. సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి, తాంబూలంలో పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, రవికె గుడ్డ, ప్రసాదాలను వాయనంగా ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి.

మరికొన్ని విశేషాలు
‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్టమైన’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీవ్రతం.

శ్రావణ మాసమంటే ఎందుకని ఇష్టం? 
శ్రవణం లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం పేరు మీదుగా వచ్చిన మాసం కాబట్టి ఈ మాసమంటే అమ్మవారికి ఇష్టం. అలాగే పూర్ణిమ రోజున అమ్మవారు షోడశ కళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతికరం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. 

లక్ష్మీ నివాస స్థానాలు
మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...
పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, గోమయం, గోపృష్టం, ఆవు కొమ్ముల మధ్యన, పూజామందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార సంపన్నుడైన పండితుడు లేదా గురువు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. 

లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలి. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందట. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, ధనం, ధాన్యం, సౌభాగ్యం వంటివి కూడా ధనమే.  

వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి. అది వరలక్ష్మీవ్రతం.  వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వివరాలు...
పండ్లు – పిండివంటలు అలంకరణ వస్తువులు ∙పసుపు, కుంకుమ, గంధం ∙అక్షతలు, అగరుబత్తీలు ∙కర్పూరం, నెయ్యి, నూనె ∙దూది వత్తులు, హారతి పళ్ళెం ∙తమలపాకులు (20), వక్కలు ∙నాణేలు ∙కలశం పాత్ర (వెండి/రాగి/ఇత్తడి) ∙ఐదు రకాల పండ్లు (అరటి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష, జామ వంటి పండ్లు   ∙కొబ్బరికాయలు (కనీసం 3) ∙తోరాలు (9 పోగుల దారాలు) నానబెట్టిన శనగలు ప్రసాదాలు (పరమాన్నం, గారెలు, బూరెలు) ∙అమ్మవారి ముఖరూపం ∙మామిడి ఆకులు, అరటి మొక్కలు ∙పూలమాలలు, విడిపూలు ∙కొత్త రవికల గుడ్డలు (వాయనం కోసం) ∙పీఠం (చెక్క పీట), ఎర్రటి వస్త్రం ∙గాజులు, తాంబూలం వస్తువులు.

కలశం ఎందుకు?
వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. ఎందుకంటే కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం. అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తిస్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.

– డి.వి.ఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement