breaking news
vaiesarsipi
-
కోట్లకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేను కాను
జిల్లా ప్రకాశించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి దర్శి: తాను కోట్లకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేను కానని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి అన్నారు. రాజంపల్లి ఆంజనేయస్వామి తిరునాళ్లలో పొదిలి మండలం కుంచేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభపై ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దర్శి మండలం లక్ష్మీనారాయణపురం ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా జగన్మోహన్రెడ్డి సీఎం కావాల్సిందేనన్నారు. ప్రస్తుత పాలనలో బాబు వచ్చాడు జాబు పోయిందని, గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి వచ్చింద ని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నిధులు పక్కదారి మళ్లించడంతో కనీసం బోర్లు ఎండిన చోట మరమ్మతులు చేయించే పరిస్థితులు కూడా లేవన్నారు. ఎన్నికల హామీలు మరిచి ప్రత్యేక విమానాల్లో ఇతర దేశాలు తిరుగుతూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో శాసనసభ్యులను కోట్లు ఇచ్చి కొంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు వద్దకు రావడం.. వెళ్లడం తప్ప.. చేసింది ఏమీ లేదన్నారు. ప్రస్తుతం కరువు వచ్చి రైతులు కన్నీరు పెడుతున్నారని, పల్లెలు గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నాయని, యువత ఉద్యోగాలు, ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్నారని, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారందరూ చంద్రబాబుకు ఎందుకు ఓట్లేసి గెలిపించామని బాధపడుతున్నారని చెప్పారు. యువకుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రజల కోసం ఎంతో తపిస్తుంటారని, అటువంటి యువ నాయకుడికి అందరూ ఎల్లవేళలా అండగా ఉండాలని కోరారు. వైఎస్సార్ రామరాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాల్సిందేనని జంకె పునరుద్ఘాటించారు. -
ఎస్కేయూలో పచ్చ నియామకం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అధికార పార్టీ నేతల అభీష్టాలను నెరవేర్చేందుకు జిల్లాలో అధికారులు ‘రాజును మించిన రాజభక్తి’ చూపుతున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శ్రేణులను దెబ్బ తీస్తూ.. తెలుగు తమ్ముళ్లను అందలం ఎక్కించే ప్రక్రియ జిల్లాలో స్టోర్ డీలర్ల నుంచి యూనివర్సిటీ న్యాయవాదుల నియామకం వరకూ అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడవు.. చట్టాలు, విధి విధానాలు, నియమ నిబంధనలు.. వేటీనీ ఖాతరు చేయకుండా అధికార గణం తమ రాజభక్తిని చాటుకుంటోందనేందుకు ఇటీవల శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో జరిగిన ‘స్టాండింగ్ కౌన్సిల్’ నియామకం ప్రత్యక్ష నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ తరఫున వచ్చే న్యాయ వివాదాలను హైకోర్టులో వాదించేందుకు జే.ఉగ్రనరసింహను స్టాండింగ్ కౌన్సిల్‌గా గత ప్రభుత్వం నియమించింది. ఈయన కాల పరిమితి మూడేళ్లు. ఈ గడువు ముగియగానే తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఉగ్రనరసింహనే స్టాండింగ్ కౌన్సిల్‌గా కొనసాగాలని యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కన్ను ఈ పోస్టుపై పడింది. గత ప్రభుత్వ హయాంలో నియమితమైన ఉగ్రనరసింహను తొలగించి ఆ స్థానంలో గతంలో చంద్రబాబు హయాంలో (1998-2005) యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించిన పి.శ్రీరాములు నాయుడును తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నేతల అభీష్టాన్ని నెరవేర్చే పనిలో యూనివర్సిటీ అధికారులు తమ పరిధికి మించి వ్యవహరించారు. ఉగ్రనరసింహను తొలగిస్తూ, ఆ స్థానంలో శ్రీరాములు నాయుడిని నియమిస్తూ రిజిస్ట్రారే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఉగ్రనరసింహం యూనివర్సిటీ కేసులను సరిగా వాదించడం లేదని, ఇతని ఉదాసీనత కారణంగా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణాల రీత్యా ఇతని స్థానంలో శ్రీరాములు నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆ ప్రతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కు, అడ్వకేట్ జనరల్‌కు పంపారు. అడ్వకేట్ జనరల్ ఘాటు లేఖ.. యూనివర్సిటీ అధికారుల నిర్వాకంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తీవ్రంగా స్పందిస్తూ ఘాటుగా లేఖ రాశారు. జీవో ఆర్టీ నెం 168 ప్రకారం యూనివర్సిటీలతో సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలు చేపట్టే అధికారం ఉండదని, అడ్వకేట్ జనరల్ సిఫారసు మేరకు ప్రభుత్వం మాత్రమే వీరి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆ లేఖలో అడ్వకేట్ జనరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు స్పష్టం చేశారు. పరిధి మీరి స్టాండింగ్ కౌన్సిల్‌గా వేరే వారిని నియమించిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులకు లీగల్ నోటీసు .. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటిదాకా స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్న ఉగ్రనరసింహ యూనివర్సిటీ అధికారులకు లీగల్ నోటీసు పంపారు. యూనివర్సిటీ కేసులు వాదించడంలో అలసత్వం వహిస్తున్నట్లు తనపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. దిద్దుబాటు చర్యలు .. తమ ఇష్టానుసారం స్టాండింగ్ కౌన్సిల్‌ను నియమించుకోవాలనుకున్న యూనివర్సిటీ అధికారుల ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.దశరథరామయ్యను ‘సాక్షి’ సంప్రదించగా.. సమస్య పరిష్కారమయ్యే దశలో ఇప్పుడీ వార్త ప్రచురించడం ఎందుకంటూ సలహా ఇచ్చారు. ఉగ్రనరసింహం పదవీ కాలం 2013 నవంబర్‌లో ముగిసిందని, అప్పుడు పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు యూనివర్సిటీనే ఇచ్చిందన్నారు. తామిచ్చిన పదవీ పొడగింపు ఉత్తర్వులు చెల్లుబాటు అవుతున్నప్పుడు ఆయనను తొలగించే అధికారం తమకు ఎందుకుండదంటూ.. తన చర్యను సమర్థించుకున్నారు.