breaking news
Tiger enclosure
-
పులుల ఎన్‌క్లోజర్ పనులకు ఆదిలోనే హంసపాదు!
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో పెరుగుతున్న పులి పిల్లలను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో ఉంచి సంరక్షించాలన్న అధికారుల లక్ష్యం నెరవేరకుండా పోయింది. తల్లి నుంచి విడిపోయి వేటాడటం తెలియని పులి పిల్లలకు వేట నేర్పేందుకు నల్లమల అభయారణ్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ టైగర్ ఎన్‌క్లోజర్ పనులకు ఉన్నతాధికారుల బదిలీలతో పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడింది. దాదాపు రెండేళ్ల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో స్థానికుల కంటపడ్డాయి. ఈ క్రమంలో అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీశాఖ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రెండేళ్ల క్రితం అధికారులు ప్రకాశం జిల్లా నెక్కంటి రేంజ్లో పెద్దపెంట, ఆరపెంట, గంగారంపెంట, పెద్దదోర్నాల మండలంలోని తెట్టుగూడెంల పరిధిలో దాదాపు రూ.2 కోట్లతో టైగర్ ఎన్క్లోజర్తో పాటు నర్సరీ, హెర్బివోస్ల(జింకలు, దుప్పులు) ఎన్‌క్లోజర్ పనులు చేపట్టారు.సొంతంగా వేటాడగలిగేలా.. మొదటగా నర్సరీ ఎన్‌క్లోజర్‌లతో ఉంచిన పులి పిల్లలను టైగర్ ఎన్క్లోజర్లలోకి మార్చి, వ్యక్తిగతంగా ఆహారం కోసం అవి 50 వన్యప్రాణులను సొంతంగా వేటాడగలిగినప్పుడే వాటిని అభయారణ్యంలోకి వదులుతారు. ఇందుకోసం ఆయా ఎన్క్లోజర్లలో రూ.2.50 లక్షలతో సోలార్ బోరుతో పాటు, ఎన్‌క్లోజర్‌లోకి పైప్‌లైన్ సదుపాయం, జింకల అవసరాలు తీర్చేందుకు సాసర్పిట్లు, సహజ సిద్ధంగా ఉండే నీటి గుంతలను సైతం ఏర్పాటు చేశారు. సాధారణంగా కొద్ది రోజుల పాటు వాటిని సంరక్షించి అనంతరం పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. వేటలో వాటి శక్తియుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. అయితే ఇవేమీ జరగకుండానే టైగర్ ఎన్‌క్లోజర్ పనులు మందగించాయి. ఎన్‌క్లోజర్ పనులకు కొత్తగా టెండర్లను పిలుస్తున్నాం అధికారుల బదిలీలు, గతంలో భారీ వర్షాల కారణంగా పనులు కొంత మేర మందగించాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులు చురుగ్గా జరిగే అవకాశం ఉంది. కొత్తపల్లి పులి పిల్లలు పెద్దవి కావటంతో వాటిని తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉంది. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజి అధికారి, కొర్రప్రోలు మందగించిన నిర్మాణ పనులు నల్లమల అభయారణ్య పరిధిలోని కొందరు ఉన్నతాధికారుల బదిలీలతో పాటు మరి కొన్ని కారణాలతో టైగర్ ఎన్‌క్లోజర్ పనులతో పాటు నర్సరీ, హెర్బివోస్ల ఎన్‌క్లోజర్ పనులు నిలిచిపోయాయి. దీంతో తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజ సిద్ధంగా వాటి ఆహారాన్ని అవే వేటాడగలిగేలా చేయటంతో పాటు, పెద్దపులులలో అనాథలు, తీవ్ర గాయాల పాలైన వాటిని ఇక్కడ నర్సరీ ఎన్క్లోజర్లలో పెట్టి సంరక్షించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం ఆదిలోనే హంసపాదుగా మారింది. -
Video: టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మహిళ.. జస్ట్ మిస్
అమెరికాలో ఓ మహిళా హల్చల్ చేసింది. న్యూజెర్సీలోని కోహన్‌జిక్ జూ వద్ద బెంగాల్ టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి కంచె ఎక్కింది. ఏమాత్రం భయం లేకుండా పులిని తాకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను పులి దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే పులికి మహిళకు మద్య మరో ఫెన్సింగ్ ఉండటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.అయినప్పటికీ మహిళ తన పిచ్చి వేషాలు మానుకోకుండా పులిని ప్రలోభపెట్టడానికి యత్నించింది. జంతువుకు చేయి చూపింది, దాన్ని రెచ్చగొట్టేందుకు చూసింది. వెంటనే పులి ఆమె చేతిని ఒరికేందుకు, దాడి చేసేందుకు యత్నించింది. దీంతో భయపడిన మహిళ అక్కడనుంచి వెనక్కి పరుగుత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. జూలోని కంచెపైకి ఎక్కడం చట్ట విరుద్దమని తెలిపారు. సందర్శకుల భద్రతతోపాటు జంతువుల సంరక్షణ తమ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. జూలో జంతువులపై సందర్శకుల ప్రమాదకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సదరు యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.LOOK: Bridgeton Police want to identify this woman, who climbed over the tiger enclosure’s wooden fence at the Cohanzick Zoo “and began enticing the tiger, almost getting bit by putting her hand through the wire enclosure.” 1/4 pic.twitter.com/DPRFi5xFg1— Steve Keeley (@KeeleyFox29) August 21, 2024 ఇదిలా ఉండగా కోహన్‌జిక్ జూలో రెండు బెంగాల్ పులులు ఉన్నాయి. రిషి, మహేషా అనే సోదరులు. వీటిని 2016లో అక్కడికి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చారు. అప్పుడు కేవలం 20 పౌండ్ల బరువుతో ఉండగా.. ఇప్పుడు పులులు ఒక్కొక్కటి దాదాపు 500 పౌండ్ల బరువు కలిగి ఉన్నాయి.ఇక బెంగాల్ పులులను భారతీయ పులులు అని కూడా పిలుస్తారు. ఇవి అంతరించిపోతున్న జాతికి చెందినవి. అక్టోబర్ 2022 నాటికి దాదాపు 3,500 పులులు మాత్రమే అడవిలో ఉన్నాయి. సైబీరియన్ పులి తర్వాత బెంగాల్ పులి జాతి రెండవ అతిపెద్దదిగా పరిగణిస్తారు. -
కోతి బావలు చిక్కాయోచ్..
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వచ్చిన స్క్విరెల్ కోతులను సోమవారం ఉదయం జూ అధికారులు సురక్షితంగా పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వచ్చిన ఈ కోతులను జూ అధికారులు రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్ ఎన్‌క్లోజర్ వద్ద చెట్లపై గుర్తించారు.ఆదివారం రాత్రి చుట్టూ నె ట్ను ఏర్పాటు చేసి మరో చెట్టుపైకి వెళ్లకుండా కొమ్మలను నరికివేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఈ కోతులను పట్టుకునేందుకు యానిమల్ కీపర్లతో కలసి చర్యలు చేపట్టారు. పులుల ఎన్‌క్లోజర్ వద్దనున్న చెట్లపై నుంచి ఐనా ఎన్‌క్లోజర్ వైపు స్క్విరెల్ కోతులను తరిమివేశారు. ఐనా ఎన్‌క్లోజర్ వద్ద ఏర్పాటు చేసిన బోనులో కోతులను పట్టుకునేందుకు గుడ్లు పెట్టారు. గుడ్లను తినేందుకు కోతులు ఉదయం 8.40 గంటలకు బోనులోకి వచ్చాయి. వెంటనే సురక్షితంగా బంధించిన అధికారులు జూలోని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల్లో వీటిని సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.