breaking news
Tax reduction initiatives
-
ఇండియా దగ్గర పప్పులుడకలేదు.. ఇప్పుడు ఇండోనేషియా అంట?
ఎలక్ట్రిక్ కార్లలో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న టెస్లా కంపెనీ ఇండియా విషయంలో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఇతర దేశాలకు తరలిపోతామనేట్టుగా ఫీలర్లు వదులుతోంది. పరోక్షంగా ఇండియాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్. అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ కార్ల తయారీ కోసం తొలిసారిగా గిగాఫ్యాక్టరీ కాన్సెప్టుతో భారీ తయారీ కర్మాగారాలను ఎలాన్ మస్క్ నిర్మించాడు. అమెరికా వెలుపల జర్మనీ, చైనాలో రెండు గిగాఫ్యాక్టరీలను నెలకొల్పాడు. చైనాలో తయారైన ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో విక్రయించేలా ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఎలక్ట్రిక్ కార్ల నుంచి కాలుష్యం రాదు కాబట్టి తమ కార్లను ప్రత్యేకంగా పరిగణిస్తూ పన్ను రాయితీలు ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరాడు. షరతులు వర్తిస్తాయి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు భారత ప్రభుత్వం భారీ ఎత్తున పన్ను విధిస్తోంది. ముఖ్యంగా రూ.60 లక్షలకు పైగా విలువ ఉండే కార్లకు వంద శాతం పన్ను విధిస్తోంది. ఎలాన్ మస్క్ కోరిక మేరకు టెస్లాకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తే.. స్థానికంగా ఉన్న ఇతర ఆటోమొబైల్ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఎలాన్ మస్క్ డిమాండ్లు నెరవేర్చాలంటే కొన్ని షరతులు భారత ప్రభుత్వం విధించింది. ఇండియాలోనే కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పితే పన్ను రాయితీల విషయం ఆలోచిస్తామంటూ తేల్చి చెప్పంది. రాజీ కుదరలేదు పన్నుల రాయితీలు, పరిశ్రమ స్థాపన విషయంలో ఇరు వర్గాల మధ్యన దాదాపు ఏడాది కాలంగా పలు మార్లు అంతర్గత చర్చలు జరిగినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో టెస్లా ఇండియా హెడ్‌గా ఉన్న మనూజ్ ఖురానా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇండియాలో టెస్లా కథ ముగిసినట్టే అనే భావన నెలకొంది. ఇండోనేషియా వంకతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మార్కెట్ అయిన ఇండియాను వదులుకోవడానికి ఎలాన్ మస్క సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకే ఈసారి ఇండియాపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చే చర్యలకు పూనుకున్నాడు. అందులో భాగంగా టెస్లా పరిశ్రమను తమ దేశంలో నెలకొల్పాలని ఇండోనేషియా ప్రభుత్వం కోరుతున్నట్టుగా టెస్లా ప్రెసిడెంట్ జోకో విడోడో చేత ప్రకటన చేయించారు. తమతో పాటు ఫోర్డ్ ఇతర కంపెనీలను కూడా ఇండోనేషియా కోరినట్టు వార్తలు ప్రచారంలోకి తెచ్చారు. ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇండియాలో వ్యాపారం లాభసాటిగా లేదంటూ గతేడాది ఫోర్డ్ ప్రకటించింది. ఇండియా నుంచి వెనక్కి వెళ్తున్నట్టుగా చెబుతూ ఇక్కడ కార్ల అమ్మకాలను ఆపేసింది. ఆ సంస్థకు ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను అమ్మేందుకు సిద్ధపడింది. ఇండియాలో ఫోర్డ్ ప్రస్థానానికి టెస్లా వ్యవహరాలను ముడిపెడుతూ ఇండియాకు ప్రత్యామ్నాయంగా ఇండోనేషియా ఉందనేట్టుగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఎలాన్ మస్క్ ఉన్నారు. అయితే తాజా పరిణామాలపై భారత ప్రభుత్వం తరఫున ఎటువంటి స్పందన రాలేదు. చదవండి: వెల్కమ్ టూ ఎలాన్ మస్క్.. షరతులు వర్తిస్తాయి.. -
టెస్లాకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్
ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గిస్తే టెస్లా ఎస్ ప్లెయిడ్ కార్లను భారత్‌కు తీసుకువస్తామంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు. భారత ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్ ట్వీట్‌పై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వంలో ఉన్నతాధికారి చేసిన చేసిన ప్రకటన ఎలన్‌మస్క్‌ని ఇరుకున పడేలా చేసింది. దీనికి ఓకేనా తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా పరిగణించ వద్దని, కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కారుగా గుర్తించి దిగుమతి పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కంపెనీ గతంలో కోరింది. టెస్లా కోరినట్టుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని అయితే ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ను దేశంలో నెలకొల్పుతామని ప్రకటిస్తే అది సాధ్యం’ అంటూ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పారంటూ ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. అంతేకాదు ఈ రాయితీ ఒక్క టెస్లా కంపెనీకే వర్తించదని.. ఆ రంగం మొత్తానికి వర్తిస్తుందని ఆ అధికారి చెప్పినట్టు ఈటీ వివరించింది. టెస్లా బేరాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లకు సంబంధించి 40 వేల డాలర్లు లోపు ధర ఉంటే 60 శాతం పన్నుని ప్రభుత్వం దిగుమతి సుంకంగా విధిస్తోంది. అంతకు మించి కారు ధర ఉంటే వంద శాతం పన్నుని విధిస్తోంది. ప్రస్తుతం టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు ధర మన కరెన్సీలో కోటి రూపాయలలకు పైగానేగా ఉంది. దిగుమతి సుంకం కలిపితే ఈ కారు ధర రెండు కోట్లు దాటుతుంది. దీంతో పన్ను మినహాయింపు కోరుతోంది టెస్లా కంపెనీ. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ అమెరికాకు వెలుపల జర్మనీ, చైనాలో కార్ల తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ఆ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు సాగించాలనే వ్యూహంతో ఉంది. అందుకే పన్ను రాయితీలు అంటూ బేరాలకు దిగింది. ఇండియాలో కార్ల తయారీ పరిశ్రమ పెడతామంటే పన్ను మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇండియా ఇచ్చింది. దీంతో బాల్ ఎలన్ మస్క్ కోర్టులో పడినట్టయ్యింది. భారత ప్రభుత్వం వదిలిన ఫీలర్కి ఎలన్‌మస్క్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. -
జైట్లీ కార్పొరేట్ జాలం
ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఊతమిస్తూ.. మరోవైపు విదేశీ పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ట్యాక్స్ తగ్గింపు ప్రతిపాదనలతో కార్పొరేట్లను ఆకట్టుకున్నారు. భారీ పెట్టుబడి ప్రతిపాదనలతో ఇన్ఫ్రా రంగానికి జోష్నివ్వడంపై దృష్టిపెట్టారు. అటు.. ప్రజల దగ్గర నిరుపయోగంగా మూలుగుతున్న పసిడిని చెలామణీలోకి తెచ్చే చర్యలు చేపట్టారు. వెరసి అధిక వృద్ధి లక్ష్యంగా జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కి పరిశ్రమ వర్గాల మెప్పు పొందడంలో కొంత మేర సఫలమయ్యారు. నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గనున్న కార్పొరేట్ ట్యాక్స్ న్యూఢిల్లీ: కార్పొరేట్లకు ఊరటనిస్తూ దాదాపు పదేళ్ల విరామం తర్వాత కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను 5 శాతం మేర తగ్గించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న దీన్ని 2016 ఏప్రిల్‌తో మొదలుపెట్టి ఆపై నాలుగేళ్లలో దీన్ని 25 శాతానికి తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే కొన్ని పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను కూడా ఉపసంహరించనున్నట్లు శనివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పెట్టుబడులు పెరిగేందుకు, అధిక వృద్ధి సాధించడంతో పాటు ఉపాధి కల్పన పెంచేందుకు కూడా ఈ చర్య తోడ్పడగలదని ఆయన వివరించారు. చివరిసారిగా 2005లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం కార్పొరేట్ ట్యాక్స్‌ను 35% నుంచి 30 శాతానికి తగ్గించారు. 2014-15లో పలు మినహాయింపులు, ప్రోత్సాహకాల కారణంగా ఖజానాకు రావాల్సిన ఆదాయంలో రూ.62,399 కోట్లు తగ్గుతుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ.4,26,079 కోట్లుగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 4,70,628 కోట్లుగాను ఉండగలదని అంచనా. ఆసియాలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కార్పొ రేట్ పన్నులు చాలా అధికంగా ఉన్నాయని తాజాగా అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రస్తుతం కార్పొరేట్ పన్ను వసూళ్లు 23 శాతమేనని మంత్రి తెలిపారు. పలు మినహాయింపులు ఇస్తుండటమే ఇందుకు కారణమన్నారు. అధిక పన్నులు ఉన్నా వసూలు అయ్యేది అంతంత మాత్రంగానే ఉండటం వల్ల రెండు రకాలుగానూ ప్రయోజనం లేకుండా పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. పలు మినహాయింపుల వల్ల ఆదాయ నష్టంతో పాటు వివాదాలూ తలెత్తుతున్నాయని జైట్లీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ ట్యాక్స్‌ను నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు కార్పొరేట్ పన్ను చెల్లింపుదార్లకు ఇస్తున్న పలు మినహాయింపులు, ప్రోత్సాహకాలను కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ.. ముందస్తుగా తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చే ఆ పై ఆర్థిక సంవత్సరం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడులకు రెడ్‌కార్పెట్! న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించే చర్యల్లో భాగంగా బడ్జెట్లో ఆర్థికమంత్రి జెట్లీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. అందులో కొన్నింటిని చూస్తే... బ్యాంక్ప్ట్స్రీ కోడ్...: దేశంలో వ్యాపార అవకాశాల మెరుగు, పెట్టుబడిదారులు తన పెట్టుబడులను తేలిగ్గా ఉపసంహరించుకోడానికి వీలయ్యే విధంగా ఒక సమగ్ర బ్యాంక్ప్ట్స్రీ(దివాలా) కోడ్‌ను ఆవిష్కరించనున్నట్లు జైట్లీ తెలిపారు. దివాలాకు సంబంధించి న్యాయ ప్రక్రియ వేగంగా జరగడానికి ఈ చర్య దోహదపడుతుంది. ఈ విషయంలో ఖాయిలా పరిశ్రమ కంపెనీల చట్టం, బీఐఎఫ్ఆర్లు విఫలమయ్యాయని జైట్లీ పేర్కొన్నారు. పబ్లిక్ కాంట్రాక్ట్ చట్టం...: మౌలిక రంగంలో పబ్లిక్ కాంట్రాక్ట్‌లకు సంబంధించి తలెత్తే సమస్యల సత్వర పరిష్కార లక్ష్యంగా ‘పబ్లిక్ కాంట్రాక్ట్ (వివాదాల పరిష్కార) చట్టాన్ని జైట్లీ ప్రతిపాదించారు. ప్రొక్యూర్మెంట్ చట్టం...: పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంశాలకు సంబంధించి అధికారులు ఎలాంటి లొసుగులకూ పాల్పడకుండా చూసేందుకు ప్రొక్యూర్మెంట్ చట్ట ప్రతిపాదన బడ్జెట్లో మరో కీలకమైన అంశం. రిట్స్, ఇన్విట్స్కు పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(ఆర్ఈఐటీ-రిట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(ఐఎన్వీఐటీ- ఇన్విట్స్) కు కేంద్రం కొత్త పన్ను ప్రయోజనాలు ఇచ్చింది. ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. వీటికి సంబంధించి క్యాపిటల్ గెయిన్ పన్నుల వ్యవస్థను హేతుబద్దీకరిస్తున్నట్లు పేర్కొంది. 2014 సెప్టెంబర్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రిట్స్, ఇన్విట్స్ లిస్టింగ్‌కు నిబంధనలను నోటిఫై చేసింది. రియల్టీ, ఇన్ఫ్రా రంగాలకు పారదర్శక రీతిలో మరిన్ని నిధులు అందేలా చేయడం వీటి ప్రధాన లక్ష్యం. డెవలపర్లు తమ ప్రధాన కంపెనీ పరిధిలోని ఆస్తులను లిస్టెడ్ సంస్థకు (ప్రత్యేకంగా రిట్స్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన) బదలాయించినప్పడు ఈ ప్రక్రియకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. చిన్న పరిశ్రమల విషయంలో...: లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి వర్కింగ్ కేపిటల్ అవసరాలు కీలకమైనవని జైట్లీ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టీఆర్ఈడీఎస్) ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఆయా పరిశ్రమలకు ఫైనాన్స్, సత్వర రెవెన్యూ వసూళ్ల లక్ష్యంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ద్రవ్య లభ్యత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ‘గార్’ మరో రెండేళ్లు వాయిదా... విదేశీ ఇన్వెస్టర్లలో గుబులు రేపుతున్న జనరల్ యాంటీ అవెడైన్స్ రూల్ (గార్) అమలు మరో రెండేళ్లపాటు జైట్లీ వాయిదా వేశారు. గార్ నిబంధనలు, అమలు విషయంలో కొన్ని క్లిష్టమైన అంశాలు ఉన్నాయని, వీటిపై ప్రజల్లో మరింత చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. 2015 ఏప్రిల్ 1 నుంచీ గార్ అమలు కావాల్సి ఉంది. తాజా నిర్ణయం ప్రకారం, 2017 మార్చి 31 వరకూ పెట్టుబడుల విషయంలో గార్ వర్తించబోదు. 2012-13 వార్షిక బడ్జెట్లో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ దీనిని ప్రతిపాదించారు. మారిషస్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి కొన్ని ‘ట్యాక్స్ హెవెన్స్’ దేశాల నుంచి పెట్టుబడుల ద్వారా భారత్‌లో పన్ను భారాల నుంచి తప్పించుకునే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించడానికి ఉద్దేశించినదే గార్. అయితే దీనిలోని నిబంధనల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవి కొంత వివాదాస్పదమయ్యాయి. దీనితో దీని అమలు ఎప్పుటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఎఫ్‌డీఐ విధాన సరళీకరణ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ విధానంపై బడ్జెట్ దృష్టి పెట్టింది. విభిన్న రకాల విదేశీ పెట్టుబడుల విశ్లేషణలకు సంబంధించి వ్యత్యాసాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం ఇకపై పోర్ట్‌ఫోలియో-ఎఫ్‌డీఐ పెట్టుబడులను ఒకే కేటగిరీగా పరిగణించడం జరుగుతుంది. వీటన్నింటికీ ఎఫ్‌డీఐ నిబంధనలనే వర్తింపజేస్తారు. భారత్ కంపెనీలు సరళతర మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ విధానం దోహదపడుతుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 69,500 కోట్లు న్యూఢిల్లీ: అధిక ఆదాయ వనరులపై దృష్టి సారించిన బడ్జెట్, రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.69,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యాలను నిర్దేశించుకుంది. వీటిలో రూ. 41,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల అమ్మకాలకు సంబంధించిన పరి మాణం కాగా, మిగతా రూ.28,500 కోట్లు లాభ, నష్టదాయక కంపెనీల నుంచి వ్యూహాత్మక అమ్మకాల ద్వారా సమీకరణ లక్ష్యం. ప్రస్తుతం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సమకూరుతాయని భావిస్తున్న నిధులకు ఇది దాదాపు రెట్టింపు. నిజానికి గత బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.58,425 కోట్లుగా నిర్దేశించుకున్నప్పటికీ, తాజా అంచనాల ప్రకారం ఈ నిధుల పరిమాణం రూ.31,350 కోట్లేనని తాజా బడ్జెట్ పేర్కొంది. బడ్జెట్ కామెంట్స్ భారత్ అంచనాలకు తగ్గ బడ్జెట్ ఇది. ఇన్ఫ్రాకు రూ.70 వేల కోట్లు, అలాగే భారీ విద్యుత్ ప్రాజెక్టులతో పెట్టుబడుల వాతావరణానికి పునరుత్తేజం కలి గించే నిర్ణయాలు. 22 ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో భారత్‌లో తయారీ రంగానికి ప్రోత్సహం లభిస్తుంది. వ్యాపారానికి అనువైన రీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. ఆవిష్కరణల ప్రోత్సాహకానికి కేవలం రూ.150 కోట్లు కేటాయించడం నిరాశ కలిగిస్తోంది. మరిన్ని నిధులు అందిస్తే భారత ఆరోగ్య సేవల రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. - సతీష్ రెడ్డి,చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అయిదు రాష్ట్రాల్లో కొత్తగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) రానున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆరోగ్య సేవల సౌలభ్యం పెరగడమేగాక, వైద్య నిపుణులకు శిక్షణ లభిస్తుంది. వీసా ఆన్ అరైవల్ సేవలు 150 దేశాలకు విస్తరించడం ఆహ్వానించదగ్గది. దీని ఫలితంగా ప్రపంచస్థాయి వైద్య సేవలందిస్తున్న భారత్‌లో మెడికల్ టూరిజం మరింత వృద్ధిలోకి వస్తుంది. వైద్య విద్య, ఆసుపత్రుల ఏర్పాటులో ఆరోగ్య రంగ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా రానున్న రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. - సంగీత రెడ్డి, జేఎండీ, అపోలో హాస్పిటల్స్ స్టార్టప్‌లు, ఎస్ఎంఈల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టాలెంట్ యుటిలైజేషన్(సేతు) ప్రతిపాదన పెద్ద ముందడుగు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించే అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరో సానుకూల నిర్ణయం. సాంకేతిక సేవలపై రాయల్టీని 25 నుంచి 10 శాతానికి చేర్చడం వల్ల టెక్నాలజీ వ్యయం తగ్గేందుకు దోహదం చేస్తుంది. సేవా పన్ను 1.5% పెంచడం నిరుత్సాహపర్చింది. ప్రొడక్ట్ కంపెనీల విషయంలో సేవా పన్ను, అమ్మకం పన్నుపై స్పష్టత ఇవ్వలేదు. - బీవీఆర్ మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సైయంట్ నిజమైన అవసరాలు గుర్తించారు ఎప్పటిలాగే కార్పొరేట్లకు ఉపయోగపడేలా కాకుండా ఈ సారి బడ్జెట్లో సామాన్యులకు, ప్రత్యేకించి వృద్ధులకు నిజమైన అవసరాలను గుర్తించారు. వ్యవసాయం, ఇన్ఫ్రా, విద్యుత్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థను పెంచడానికి ఈ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ నీటిపారుదల కోసం రూ.5,300 కోట్లు, నాబర్డ్ కింద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, లాంగ్ టర్మ్ రూరల్ క్రెడిట్ ఫండ్, షార్ట్ టర్మ్ కో-ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ రీఫైనాన్స్ ఫండ్ వంటివి ఇందుకు ఉదాహరణలు. - వెల్లయాన్, మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్