భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?
Tallapaka Annamacharya Jayanthi భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు? ఇది తరతరాల ప్రశ్న.. ప్రతి యుగం లోని సరి అయిన జవాబు దొరికినా మళ్ళీ అదే ప్రశ్న!.. అలవైకుంఠపురంలోని మూల సౌధంబు లోంచి బయలు దేరాడు విష్ణువు శరణు కోరిన కరిరాజుని రక్షించడానికి.. తక్కువ కులస్థుడైనా గుహుడిని అక్కున చేర్చుకున్నాడు, రామచంద్రుడు.. శబరి ఎంగిలి పళ్ళు తిన్నది ఆ రాముడే.. ఉడత చేసిన సహాయానికి ఉడతని స్పృశించినది ఆ ఉత్తమోత్తముడే.. భారతంలో విదురుణ్ణి విజ్ఞానిగా పరిగణించారు, కులంతో నిమిత్తం లేకుండా. కర్ణుడి వ్యధ ఏకలవ్యుడి కధా కులరహిత సమాజం కోసమే. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు నేను నాల్గు వర్ణాలనే సృష్టించాను అని స్పష్టంగా చె΄్పాడు. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు ముక్తకంఠం తో ఘోషించాయి కులం లేదని.. ‘ఇదంతా బ్రహ్మమే’ అని...పురాణాల్లో ఉదాహరణలు తీసుకోలేదు కానీ వాటి సారాన్ని తన ‘తత్వ బోధన’ మధురంగా, మనోరంజకంగా మనకు సులువైన తెలుగు భాష లో అందించాడు అన్నమయ్య.... 600 సంవత్సరాల క్రితమే ఇప్పటి మన రాజ్యాంగంలో కుల మత ప్రసక్తి ఉండ కూడదన్న విషయానికి ఊపిరి ΄ోశాడేమో అన్నమయ్య...అన్నమయ్య కోశం నుండి జాలు వారిన ఆధ్యాత్మిక ఆణిముత్యాల సారం కులం కన్నా భక్తి మిన్న అని... సమదృష్టి సక్రమ మార్గం అని. సకల శాస్త్రాల సారాన్ని అందమైన భాషలో అనంతమైన భావాన్ని రాగవంతంగా మేళవించి వేదాంత ధోరణిలో సంఘానికి ‘సమ దృష్టి’ తో ఉండాలని సలహా ఇచ్చాడు.... ‘బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే’ అని ఎలుగెత్తి చాటుతూ, హీనం, అధికం లేవని, ఎక్కువ తక్కువలు లేనే లేవని, జంతువులు, మనుషులు అనే భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా ఉండాలని, అందరిలో ని శ్రీహరి ఉన్నాడని, శ్రీ హరే పరబ్రహ్మస్వరూపం అని చెప్పాడు.‘తందనాన ఆహి తందనాని పురె’ లో కూడా అదే భావాన్ని జోప్పించాడు.. అందరికి శ్రీ హరే అంతరాత్మ అని అంటాడు.. రాజు గారి నిద్రకి బంటు నిద్రకి తేడా లేదంటాడు.. భౌతికంగా చూడొద్దు, భేదభావాలు వద్దని చె΄్తాడు. చని΄ోయాక బ్రాహ్మణుడైన, చండాలుడైన చేరవలసింది ఒకచోటుకే అని చె΄్తాడు.. ప్రకృతికి తారతమ్యాలు లేవంటూ ఎండకు ఏనుగైనా, శునకమైనా సమానమే అని సెలవి స్తాడు..‘చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు’ అని ప్రశ్నిస్తూ సమ బుద్ధితో సంకీర్తనం చెయ్యండి. వేషభాషలతో విష్ణువుకు దగ్గర కాలేరని చెబుతాడు.వేదవట్టి యికనేమి వేదకేరు చదివేరు’ అని వెటకారం చేస్తూ వేదాలు చదివినా భగవంతుని తెలుసుకోజాలరని, భక్తి ముఖ్యమని, చదువు, కులం జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమని ముక్తాయింపు చేస్తాడు.‘ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడ’ని నిజమైన భక్తి, నిక్క మైన జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడని ఘోషిస్తాడు.‘వేదాలు వచ్చినా హరిభక్తి లేని సోమయాజి కన్నా విష్ణుపాదాలని వదలని కుల హీనుడే ఘనుడు’ అని ఘంటాపదంగా నొక్కి వక్కాణించాడు.‘ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు’ అంటూ తుది ఘడియల్లో హరినే స్మరిస్తే హరిని చేరుకుంటారని భక్తిమార్గం చూపిస్తున్నాడు.ఇలా ఎన్నో కీర్తనల్లో జీవరాశుల పట్ల సమదృష్టి ఉండాలని బోధించాడు... కొంగు బంగారమైన స్వామిని కొలవమన్నాడు.. అదివో అల్లదిగో, కొలువై ఉన్నాడు గోవిందరాజు, వేడుకుందామా అని శరణు వేడుకుంటున్నాడు, ఎందుకంటే ఇందరికి అభయమిచ్చు చేయి కాబట్టి...చివరగా... గాలికి కులమేది, నేలకి కులమేదని డా. సి నారాయణ రెడ్డి ప్రశ్నిస్తే, ఏ కులము నీదంటే, గోకులం నవ్విందని వాపోయారు వేటూరి సుందర రామ మూర్తి గారు. కులమతాలు వద్దంటూ వెంకటేశ్వరునిలో ఐక్యమైన అన్నమయ్య కుల మతాలతో చిచ్చువద్దని, అవి జాతి ఐక్యతని దెబ్బ తీస్తాయనీ పరోక్షంగా పలికాడు.. ఈ కీర్తనలను స్ఫూర్తిగా తీసుకుని కుల మత చిచ్చులో పడకుండా మన జాతిని మనం రక్షించు కుందాం..– డా. కందాళ సత్యనారాయణ మూర్తి