breaking news
sycophancy
-
భజనకు పరాకాష్ట ఆ ట్వంటీ-20 మ్యాచ్!
ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా క్రీడాస్ఫూర్తి ఉండాలని కోరుకుంటారు. మైదానంలో దిగిన ప్రతి వ్యక్తి తన శక్తిమేరకు రాణించాలనుకుంటాడు. తన జట్టు గెలుపు కోసం శాయశక్తుల ప్రయత్నిస్తాడు. కానీ ఆదివారం లక్నోలోని లా మార్టినీర్ మైదానంలో జరిగిన టీ-20 క్రికెట్ మ్యాచ్ ను చూసినవారికి.. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప భజన బృందం ఉండదేమోనన్న ఆలోచన తట్టింది. మ్యాచ్ ను చూస్తున్నామో? లేక కామెడీ షోను చూస్తున్నామో? తెలియని పరిస్థితిలో ప్రేక్షకులు ఉండిపోయారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్వయంగా బ్యాటుపట్టి మైదానంలోకి దిగన ఈ మ్యాచ్ లో.. ఆయన జట్టును నానా తంటాలుపడి అధికారులు గెలిపించారు. మైదానంలోనూ తమ రాజకీయ బాసుల సేవలో నిండా తరించి.. వారిని గెలిపించడమే పరమావధిగా ఐఏఎస్ బాబులు ఆడటంతో సీఎం అఖిలేశ్ ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నారు. అంతేకాకుండా వరుసగా నాలుగో సంవత్సరం బెస్ట్ క్రికెటర్ అవార్డు సొంతం చేసుకున్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ఐఏఎస్ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం లామార్టినీర్ మైదానంలో సీఎం ఎలెవన్ జట్టు, ఐఏఎస్ ఎలెవన్ జట్టు టీ-20 మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచి సీఎం ఎలెవన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అఖిలేశ్ యాదవ్ 11 ఫోర్లు, ఓ సిక్స్ తో 65 పరుగులు చేశాడు. దీంతో సీఎం జట్టు 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. 128 పరుగుల లక్ష్యాన్ని అధికారుల జట్టుకు నిర్దేశించింది. సహజంగా క్రికెట్ మ్యాచ్ లో బౌలర్ ఎవరిదైనా వికెట్ తీస్తే సంతోషపడతాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అఖిలేశ్ వికెట్ తీసిన అధికారి గాబరాపడ్డాడు. ముఖమంతా చిన్నబుచ్చుకున్నాడు. ఇక ఛేజింగ్ లో అధికారుల జట్టు దాదాపుగా లక్ష్యం వరకు వచ్చేసింది. చివరకు రెండు ఓవర్లలో మూడు పరుగులు చేస్తే అధికారుల జట్టు గెలుపు. కానీ అధికారులు ఎంత కష్టపడ్డారంటే.. 12 బంతులు ఎదుర్కొని.. అతి తెలివిగా రెండు పరుగులు మాత్రమే చేశారు. తమ బాసుల జట్టును గెలిపించేందుకు అధికారులు ఇలా తమ శక్తిమేరకు ప్రయత్నించడం.. చూసిన ప్రేక్షకులకు మాత్రం విచిత్రంగా తోచింది. మరీ విడ్డూరమేమిటంటే కొన్ని జాతీయ చానెళ్లు ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగిందని, అఖిలేశ్ జట్టు అద్భుత పోరాటపటిమ చూపిందని ఆకాశానికెత్తేశారు. -
నాకు పాదాభివందనం చేయొద్దు: మోడీ
-
నాకు పాదాభివందనం చేయొద్దు: మోడీ
న్యూఢిల్లీ: వ్యక్తిపూజ సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోడీ నిరసించారు. తనకు పాదనమస్కారం చేయొద్దని ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మోడీ శుక్రవారం ప్రసంగించారు. తనకు పాదాభివందనం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. వ్యక్తిపూజకు తాను వ్యతిరేకమని తేల్చిచెప్పారు. కష్టపడి పనిచేయాలని ఎంపీలకు ఆయన సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సామర్థ్యాలు పెంచుకుని మంచి పార్లమెంటేరియన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంపీలకు మోడీ సూచించారు.