breaking news
Sundara Rao
-
గంజాయి విక్రేతల అరెస్ట్
జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/ కోనేరుసెంటర్ (కృష్ణాజిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి 1,760 కిలోల గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం పాడేరు ఏఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. జూన్1, 2023లో ఎండీఎస్, చెన్నై జోన్ యూనిట్ 13 ఎన్సీబీ కేసులో తమిళనాడుకు చెందిన సురేష్ 160 కిలోల గంజాయితో రాగమటన్పల్లి వేపనహీళి పోలీస్‌లకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని పాడేరు ప్రాంత సుందరరావు వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పాడు. చెన్నై నుంచి వచ్చిన బృందం పాడేరు వచ్చి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీ సూచనల మేరకు స్థానిక పోలీసులు పెదబయలు మండలం, ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన సుందరరావు ఇంట్లో తనిఖీ చేయగా.. 1,760 కిలోల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. సుందరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ పట్టివేత.. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు జిల్లాలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న మరో ముగ్గురు వ్యాపారులనూ అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ పి.జాషువా తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువ మండలం చత్వా గ్రామానికి చెందిన కొర్రా రాందాస్ అలియాస్ భట్టుభాయ్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ గంజాయి సరఫరా చేయడం మొదలెట్టాడు. దీనిలో భాగంగా గుడివాడ, అవనిగడ్డ, ఘంటసాల తదితర ప్రాంతాలకు రాందాస్ గంజాయిని సరఫరా చేస్తుంటాడు. మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న బడుగు నాగరాజును పలుమార్లు పోలీసులు పట్టుకున్నారు. అతని నేర చరిత్రను పరిశీలించిన ఎస్పీ.. నాగరాజుతో పాటు గుడివాడకు చెందిన మందాల కిరణ్‌రాజు, పమిడిముక్కలకు చెందిన చీకుర్తి నాని అలియాస్ బీస్ట్‌పై పీడి యాక్టును అమలుపరిచి జైలుకు పంపారు. పై ముగ్గురు పట్టుబడిన కేసులో రాందాస్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న ఎస్పీ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా మచిలీపట్నంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా రాందాస్ కంటబడ్డాడు. వెంటనే పోలీసులు రాందాస్‌ను అదుపులోకి తీసుకుని బ్యాగు సోదా చేయగా పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. రాందాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తక్షణం అతని వద్ద గంజాయి కొనుగోలు చేసిన గుడివాడలో ఒకరిని, ఘంటసాలలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి ఆరు కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
వంగర: లక్ష్మీపేట దళిత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కులనిర్మూలన పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ అన్నారు. లక్ష్మీపేట మారణహోమం జరిగి శుక్రవారానికి మూడేళ్లయిన సందర్భంగా లక్ష్మీపేట ఆత్మగౌరవ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దళిత మృతవీరుల సంస్మరణ సభను గ్రామంలో నిర్వహించారు. కొట్లాట ఘటనలో మృతిచెందిన నివర్తి సంగమేషు, నివర్తి వెంట్రావ్, బూరాడ సుందరరావు, చిత్తిరి అప్పడు, బొద్దూరు పాపయ్యల సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు భవనం ఆవరణలో దళిత మృతవీరుల సంస్మరణ సభలో ప్రభాకర్ మాట్లాడారు. బాధితుల పక్షాన అన్ని దళిత సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. బాధితుల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. లక్ష్మీపేట ఘటన జరిగి మూడేళ్లు అవుతున్నా ఇంకా కేసు ప్రాథమిక దశలోనే ఉందన్నారు. కారంచేడు ఘటనకు సంబంధించి కేసు తీర్పు వచ్చేసరికి 30 సంవత్సరాలు పట్టిందని, చుండూరు ఘటనకు సంబంధించి16 ఏళ్లు పట్టిందని, ఆ తరహాలో లక్ష్మీపేట కేసు కాలయాపన చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కోర్టుకు పూర్తికాలపు న్యాయమూర్తిని నియమించాలని, త్వరతిగతిన లక్ష్మీపేట కోర్టు తీర్పు వెల్లడించి దోషులను శిక్షించాలన్నారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్ మాట్లాడుతూ హైదరాబాద్ ఇందిరాపార్కు, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోరాటాల ఫలితమే లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు ఏర్పాటన్నారు. దళిత బాధితుల సమస్యలను జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.కోటి మాట్లాడుతూ మడ్డువలస రిజర్వాయర్‌లో మిగులు భూములు దళితులకు ఇవ్వాలని, కేసు విచారణను వేగవంతం చేయాలని, ఎస్సీ,ఎస్టీ చట్టంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ మృతులకు నష్టపరిహారం కింద రూ. పది లక్షలు, క్షతగాత్రులకు రూ.ఐదు లక్షలు ఇవ్వాల్సి ఉండగా అలా జరగలేదని ఆవేదన చెందారు. సామాజిక న్యాయపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి.మురళి మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 69ను అమలు చేసి ఉద్యోగాలు కల్పించాలన్నారు. అంతకు ముందు ప్రజా మండలి, ప్రజా నాట్యమండలి దళ సభ్యులు విప్లవగీతాలు ఆలపించారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మీపేట దళిత ఆత్మగౌరవ కమిటీ కన్వీనర్ చిత్తిరి గంగులు, కేఎన్పీఎస్ జిల్లా కార్యదర్శి మిస్క కృష్ణయ్య, బోడసింగి రాము, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు బి.శంకరరావు, పౌరహక్కుల సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు వి.చిట్టిబాబు, ఓపీడీఆర్ నేత సి.భాస్కరరావు, దళిత ఐక్యవేదిక నేత కల్లేపల్లి రాంగోపాల్, కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బి.ప్రభాకర్, దళిత విముక్తి సంఘం నేత ఎస్.వి.రమణ, డీటీఎఫ్ నేత ధర్మారావు, ఎస్.ఎన్.పి.ఎస్ నేత బి.బుద్ధుడు, ఆర్.రాంబాబు పాల్గొన్నారు.