వాటా విక్రయానికి యస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ)సహా పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్‌లో కొంతమేర వాటా విక్రయించనున్నాయి. తద్వారా జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) మొత్తం 20 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకి రూ. 21.50 ధరలో ఇందుకు రూ. 1,483 కోట్లు వెచ్చించనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద లావాదేవీగా ఈ వాటా విక్రయం నమోదుకానున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఎస్ఎంబీసీకి యస్ బ్యాంక్‌లో 13.19 శాతం వాటా ఎస్బీఐ విక్రయించనుంది. డీల్ విలువ రూ. 8,889 కోట్లు. ఈ బాటలో ఇతర బ్యాంకులు యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉమ్మడిగా 6.81 శాతం వాటా అమ్మనున్నాయి. వీటి విలువ రూ. 4,594 కోట్లు. ఫలితంగా యస్ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారుగా ఎస్ఎంబీసీ అవతరించనుంది. 2020 మార్చిలో యస్ బ్యాంక్ పునర్నిర్మాణ పథకంలో భాగంగా 2020 మార్చిలో ఎస్బీఐసహా 7 ప్రయివేట్ రంగ బ్యాంకులు ఇన్వెస్ట్ చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఈసీసీబీ) యస్ బ్యాంక్‌లో 13.19 శాతం వాటాకు సమానమైన 413.44 కోట్ల షేర్లను విక్రయించేందుకు అనుమతించినట్లు ఎస్బీఐ పేర్కొంది. యస్ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎస్బీఐ 24 శాతం వాటా కలిగి ఉంది. 13 శాతంపైగా వాటా అమ్మకం ద్వారా రూ. 8,889 కోట్లు అందుకోనుంది. ఇతర బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ 2.75 శాతం, ఐసీఐసీఐ 2.39 శాతం, కొటక్ మహీంద్రా 1.21 శాతం, యాక్సిస్ 1.01 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ 0.92 శాతం, ఫెడరల్ 0.76 శాతం, బంధన్ 0.7 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. తదుపరి దశ వృద్ధికి తాజా లావాదేవీ దోహదపడనున్నట్లు యస్ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. కాగా.. ఇందుకు ఆర్బీఐ, సీసీఐ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. టాప్–2లో జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎస్ఎంబీసీ 2 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. తద్వారా జపాన్‌లో రెండో పెద్ద బ్యాంకింగ్ కార్పొరేషన్‌గా నిలుస్తోంది. దేశీయంగా ప్రధాన విదేశీ బ్యాంకులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా సొంత అనుబంధ సంస్థ, డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ.. ఎస్ఎంఎఫ్జీ ఇండియా క్రెడిట్ కంపెనీని నిర్వహిస్తోంది. వాటా చేతులు మారుతున్న వార్తలతో యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 10 శాతం జంప్‌చేసి రూ. 20 వద్ద ముగిసింది.