breaking news
stuts
-
పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి: ఎస్టీయూటీఎస్
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించి, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు బి.సదానందంగౌడ్ అధ్యక్షతన ఎస్టీయూటీఎస్ రజతోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలు చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్ ఇవ్వాలని, వేతనేతర, మెడికల్ బిల్లులు మంజూరు చేయాలని, తొలిమెట్టు కార్యక్రమాన్ని సరళతరం చేయాలని, టీచర్లను బోధనకే పరిమితం చేయాలని, 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని, స్పౌజ్ కేసులను పరిష్కరించాలని కోరింది. ఎమ్మెల్సీగా బరిలోకిదిగిన భుజంగరావుకు ఉపాధ్యాయులు బాసటగా నిలవాలని పిలుపునిచ్చింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
మన్సూరాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) వజ్రోత్సవాలను సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతగల పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్య త ఉపాధ్యాయులపై ఉందని, విలువలతో కూడిన విద్య అందించడంలో కలసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల్లో కోతలతో కొంత మేర ఇబ్బందులు తలెత్తుతున్నాయని... అందుకే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాల చెల్లింపులో కాస్త జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. చదువులపై భారీగా ఖర్చు... రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని కొందరు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యారంగానికి కేటాయించిన నిధులతోపాటు తమ ప్రభుత్వం ఏర్పడ్డాక కేటాయిస్తున్న నిధుల వివరాలను గణాంకాలతో ఆయన వివరించారు. విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు బడ్జెట్లో 10 శాతానికి పైగానే ఉంటున్నాయని తెలిపారు. కేజీ టు పీజీ విద్యను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదట అటవీ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదేనన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటిసారిగా 43 శాతం, తరువాత 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దేశంలో అత్యధికంగా జీతాలు పొందుతున్న ఉద్యోగులంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులని, అందులో ఉపాధ్యాయులే అత్యధికంగా ఉన్నారన్నారు. కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తొలి నుంచీ ప్రభుత్వానికి అండగా ఉపాధ్యాయులు: మంత్రి సబిత ఉపాధ్యాయులు మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉన్నారని, ఎస్టీయూటీఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు ఎన్ని సమస్యలున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యలపై పోరాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల, ప్రమోషన్లు, బదిలీల విషయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు నూతన విద్యావ్యవస్థ ఏర్పాటుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అనంతరం వజ్రోత్సవ సావనీర్‌ను, డైరీని, వజ్రోత్సవ సీడీని, తెలంగాణ జాతిరత్నాలు పుస్తకాన్ని, నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్య క్షుడు సదానందగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావు, నరేంద్రారెడ్డి, బ్రహ్మచారి, నాగేశ్వర్రావు, ఏపీ సంఘం అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, తిమ్మన్న, కమలారెడ్డి, కరుణాకర్, శ్రీధర్, సుధాకర్, మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎస్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భుజంగరావు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ సంఘం తరపున బి.భుజంగరావును ఎంపిక చేసినట్టు రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) అధ్యక్షుడు జి.సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.పర్వత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సంఘం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. -
జోనల్ విధానం రద్దు సరైన చర్య కాదు
సూర్యాపేటటౌన్ : సరైన అవగాహన లేకుండా అత్యంత ప్రాధాన్యత గల జోనల్ విధానాన్ని రద్దు చేయడం సరైన చర్య కాదని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం(ఎస్టీయూటీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్టీయూ భవన్లో జరిగిన సంఘం జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డ తెలంగాణలో పది జిల్లాలు ఒకే రకంగా అభివృద్ధి చెందలేవని, దీంతో జోనల్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల అన్ని జిల్లాలు సమానం కావడంతో వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకకు నెట్టబడే ప్రమాదం ఉందన్నారు. ఉపాధ్యాయులకు సర్వీస్‌రూల్స్ అమలుకై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.యతిపతిరావు, కె.వీరరాఘవులు, కె.చంద్రమౌళి, మధు, బొలిశెట్టి వెంకటేశ్వర్లు, సత్తయ్యగౌడ్, జలంద్రాచారి, గోపాలరావు, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.