కులం పేరుతో దూషించినందుకు జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష , రూ. 5వేల జరిమానా విధిస్తూ మంగళవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జీ తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... బషిరాబాద్ మండలం నావల్గ గ్రామంలో నివాసముండే గోపాల్ బావోజీ స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. అతనికి అదే గ్రామంలో 2.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఆ భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన శ్రీశైలంతో వివాదం ఉంది. అయితే 2010 జూన్ 27న గోపాల్ బాబోజీ దేవాలయంలో ఉండగా శ్రీశైలం భూమి విషయంలో మాట్లాడడానికి వచ్చి అతనితో గొడవపడి కులం పేరుతో దూషించాడు. బాధితుడు గోపాల్ బావోజీ ఫిర్యాదు మేరకు బషిరాబాద్ పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జీ పై విధంగా తీర్పు చెప్పారు.