breaking news
speaker Ramendra Chandra Debnath
-
స్పీకర్ దండంతో ఎమ్మెల్యే పరుగో పరుగు
అగర్తల: త్రిపుర అసెంబ్లీలో స్పీకర్ పరువు పోయినంతపనైంది. ఆయన అధికార దండాన్ని తీవ్ర ఆగ్రహంతో ఓ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎత్తుకెళ్లిపోయాడు. ఆయన డిమాండ్‌కు స్పీకర్ అనుమతించలేదని మండిపడుతూ ఏకంగా సభ పూర్తి హక్కులు స్పీకర్ వే అని చెప్పేందుకు ఆయన టేబుల్ పై ఉంచే అధికారిక దండాన్ని ఎత్తుకెళ్లి సభలో ఇతర ఎమ్మెల్యేలను కూడా పరుగులు పెట్టించాడు. చివరికి మార్షల్స్ అడ్డుకొని దానిని తీసుకొని తిరిగి యథాస్థానంలో ఉంచారు. ఇలాంటి ఘటన జరగడం ఇది త్రిపుర అసెంబ్లీలోనే ఐదోసారి. త్రిపుర అసెంబ్లీలో ప్రస్తుతం అటవీశాఖ, గ్రామీణాభివృద్ధిమంత్రి నరేశ్ జమాతియ లైంగిక దాడికి పాల్పడ్డాడనే అంశంపై చర్చ జరగాలనే డిమాండ్ మార్మోగుతోంది. విపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీఎంసీ నరేశ్ జమాతియాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. అందుకు స్పీకర్ నిరాకరించాడు. దీంతో చిర్రెత్తిపోయిన తృణమూల్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మాన్ వేగంగా స్పీకర్ వద్దకు దూసుకెళ్లి ఆయన అధికారిక దండాన్ని తీసుకొని పరుగెత్తడం ప్రారంభించారు. ఆయనను పట్టుకునే ప్రయత్నం ఎవరు చేసినా దొరకలేదు. తలుపులు తీసుకొని ఆయన బయటకు వెళ్లిపోయారు. అయితే, అనంతరం మార్షల్స్ వెళ్లి దానిని తీసుకున్నారు. రాయ్ బర్మాన్ చాలా సీనియర్ నేత. ఆయన గతంలో విపక్ష నేతగా కూడా పనిచేశారు. ఈ ఘటనపై స్పీకర్ రమేంద్ర చంద్ర దేబ్నాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన చాలా సిగ్గుగా భావిస్తున్నాను. రాయ్ చాలా సీనియర్ నేత. ఇలాంటి చర్యలతో ఆయన జూనియర్లకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు’ అని మండిపడ్డారు. తన విజ్ఞప్తిని స్పీకర్ పట్టించుకోవాలనే ఇలా చేసినట్లు రాయ్ వివరణ ఇచ్చారు. -
స్పీకర్ దండంతో ఎమ్మెల్యే పరుగో పరుగు