breaking news
sivaramakrishnan Committee report
-
రాజధానిని కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధికి నష్టం.. ఒకేచోట వద్దు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధానిని ఒకేచోట కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బ తింటాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించింది. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదని, ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదని స్పష్టం చేసింది. సీఎంవో, సచివాలయానికి 15–20 ఎకరాలు, అసెంబ్లీకి 80–100 ఎకరాలు అవసరం ఉంటుందని అభిప్రాయపడింది. రాజధాని కోసం సారవంతమైన వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదని సూచించింది.ఈమేరకు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రాంతాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అమరావతి పేరుతో పంట భూముల్లో రాజధాని నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకించింది. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని, అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు సరికాదని తెలిపింది. విభజన చట్టంలో హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినందున హడావుడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా, హడావుడిగా ఏర్పాటు చేయడం అనుచితం, వృథాగా పరిణవిుంచవచ్చని తేల్చి చెప్పింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సారవంతమైన పంట భూముల్లో ఏకైకమహానగరాన్ని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మాణం చేయడాన్ని శివరామకృష్ణన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది.విభజిత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో పాటు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నందున రాజధాని నిర్మాణాన్ని వీలైనంత తక్కువ వ్యయంతో చేపట్టాలని, ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాజధానిని వికేంద్రీకరించాలని కమిటీ సూచించింది. అధికార వ్యవస్థలను ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే శివరామకృష్ణన్ కమిటీ తన నివేదిక సమర్పించకుండానే అప్పటి చంద్రబాబు సర్కారు ప్రభుత్వం రాజధాని ఎంపిక కోసం పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సొంతంగా మరో కమిటీని నియమించుకోవడం గమనార్హం. ఇదే విషయాన్ని శివరామకృష్ణన్ తన నివేదికలో ప్రస్తావించింది. దీంతో శివరామకృష్ణన్ కమిటీ పరిధి నాటి ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకే పరిమితం అయింది. శివరామకృష్ణన్ కమిటీ ముఖ్య సూచనలు ఇవీ..⇒ రాజధానిని ఒకేచోట కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. విజయవాడ, గుంటూరు.. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి, నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వాధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. అసెంబ్లీ, సెక్రటేరియెట్ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే.. మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థలను విస్తరించాలి. ⇒ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంలో ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు.⇒ ఆంధ్రప్రదేశ్‌కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదు.⇒ ఆంధ్రప్రదేశ్‌లో విస్తారమైన ప్రభుత్వ భూములు లభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో వివిధ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రతిపాదిత రైలు, రహదారి అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు, విస్తరించవచ్చు. ఈ కారణంగా ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదు.⇒ హైదరాబాద్ తరహా సూపర్ రాజధాని వద్దు. శాసనసభ, న్యాయస్థానాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన కార్యనిర్వాహక వర్గం హైదరాబాద్‌లో చాలా ఏళ్లుగా కేంద్రీకృత మైంది. ఈ కేంద్రీకరణే విభజన ప్రక్రియలో ప్రధాన వివాదాంశంగా ఉంది.⇒ భూసేకరణ ఆలస్యమయ్యే కొద్ది రాజధాని నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ⇒ విశాఖలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయాలి.⇒ అమరావతి, నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.⇒ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థతో ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల మధ్య ఆధునిక సమాచార మార్పిడి ద్వారా భౌగోళిక దూరాన్ని అధిగవిుంచడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు దూరాలు అడ్డంకి కాదు.⇒ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదు.⇒ విశాఖపట్టణంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు.⇒ విశాఖపట్టణం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి.⇒ విశాఖపట్టణంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వచ్చు.⇒ ప్రభుత్వ భూములున్న చోటే ఏర్పాటు చేయడం మంచిది.⇒ 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మంచిది.⇒ సీఎంవో, సచివాలయానికి 15–20 ఎకరాలు, అసెంబ్లీకి 80–100 ఎకరాలు అవసరం⇒ హైకోర్టుకు 100 – 140 ఎకరాలు అవసరం కాగా రాజ్‌భవన్‌కు 15 ఎకరాలు అవసరం.⇒ వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదు.⇒ అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అన్ని కార్యాలయాలు ఒకే చోట వద్దు.⇒ అసెంబ్లీని ఐదు సంవత్సరాల వ్యవధిలో నిర్మించాలి. ⇒ హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున హడావిడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిది కాదు.⇒ గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరం ఏర్పాటుకు ఈ కమిటీ ఏమాత్రం సుముఖంగా లేదు.⇒ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తే తగినంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండే ప్రదేశాల కోసం జాగ్రత్తగా అన్వేషించాలి.⇒ ఇప్పటికే ఉన్న నగరాల విస్తరణ చేపట్టే ముందు మౌలిక సదుపాయాల అవసరాలు, పర్యావరణ ప్రభావంపై సరైన అంచనా వేయడం ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా, హడావుడిగా ఏర్పాటు చేయడం అనుచితంగా, వృథాగా పరిణవిుంచవచ్చు.⇒ ముఖ్యమంత్రి, మంత్రులు, సచివాలయానికి సంబంధించి పరిమిత సంఖ్యలో కార్యాలయాల ఏర్పాటు కోసం నగర శివార్లలో వీజీటీఎంకు అవతల అనువైన ప్రదేశాల ఎంపికను ప్రభుత్వం పరిశీలించవచ్చని కమిటీ సూచించింది. -
ఢిల్లీ: సుప్రీంలో నేడు అమరావతి కేసు విచారణ
సాక్షి, ఢిల్లీ: అమరావతి కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం, సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతోంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంలో విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ఏపీ రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శివరామకృష్ణ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. -
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ముఖ్యాంశాలివే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ 187 పేజీల నివేదికను సమర్పించింది. గడువులోపలే ఈ కమిటీ నివేదిక సమర్పించింది. దీనిని కేంద్ర హొం శాఖ ఆమోదించింది. ఈ నివేదికను కేంద్రం ఏపి ప్రభుత్వానికి పంపుతుంది. ఈ నివేదికలో కమిటీ ఏ నగరాన్నీ రాజధాని కోసం సూచించలేదు. పలు ప్రాంతాలను సూచించింది. విజయవాడ-గుంటూరు మధ్య మాత్రం వద్దని సలహా ఇచ్చింది. రాజధానికి కావలసిన ప్రదేశం, అందుకోసం తగిన భూముల సేకరణ, ఎటువంటి భూములు సేకరించాలి, అభివృద్ధి వికేంద్రీకరణ, హైకోర్టు, హైకోర్టు బెంచ్...తదితర అంశాలకు సంబంధించి సూచనలు చేసింది. అయిదేళ్ల ప్రత్యేక హోదా కోరడం సమంజసమేనని తెలిపింది. కమిటీ సూచించిన ముఖ్యమైన అంశాలు: * హైదరాబాద్ మాదిరి సూపర్ రాజధాని వద్దు * విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం మంచిదికాదు. * విజిటిఎం పరిధిలో ఇప్పటికే భూముల ధరలు పెరిగిపోయాయి. * రాజధాని నిర్మాణానికి మొత్తం పది వేల ఎకరాలు కావాలి * రాజధాని నిర్మాణానికి 4.5 లక్షల కోట్ల రూపాయలు అవసరం. * భూసేకరణ అలస్యమైయ్యే కొద్ది రాజధాని నిర్మాణానికి ఎక్కవ సమయం పదుతుంది. * రాజధాని నిర్మించే ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించాలి * నీటి వనరులు, రవాణా,రక్షణ, చారిత్రక అంశాలు.....ఆధారంగా రాజధాని ప్రదేశం ఎంపిక చేయాలి. * విశాపట్నంలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయవచ్చు. * అమరావతి, నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసకోవచ్చు. * ముఖ్యమంత్రి కార్యాయలం ఉన్నచోటే హైకోర్టు ఉండవలసిన అవసరంలేదు. * విశాఖపట్నంలో హైకోర్టు. * రాయలసీమలో హైకోర్టు బెంచ్. * విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి. * విశాఖపట్నం పరిశ్రమలకు, అనంతపురం విద్యకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. * ప్రభుత్వభూములు ఉన్నచోట ఏర్పాటు చేయడం మంచిది. * 13జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మంచిది. * రాజధాని కోసం 15ఎకరాలు, అసెంబ్లీకి వంద ఎకరాలు అవసరం. * వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం మంచిది కాదు. * అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. * అన్ని కార్యాలయాలు ఒకే చోట వద్దు * అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం * ఈ రెండిటి నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తుంది * హడావుడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిదికాదు. ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తరువాత మంత్రి మండలి సమావేశమై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరో రెండు రోజులలో ఏపి రాజధాని ఎక్కడ అనేది తేలిపోయే అవకాశం ఉంది


