Sikkim State
-
ఈశాన్యం ప్రగతికి యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్
గాంగ్టక్: ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి అష్టలక్ష్ములు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వ విధానం కేవలం ‘యాక్ట్ ఈస్ట్’మాత్రమే కాదని.. ‘యాక్ట్ ఫాస్ట్’కూడా అని స్పష్టంచేశారు. ఈశాన్య రాష్ట్రాలను శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రధాని మోదీ మంగళవారం ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో పర్యటించారు.రాజధాని గాంగ్టక్లో నిర్వహించిన సిక్కిం రాష్ట్రావతరణ 50వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పట్టణాభివృద్ది, విద్యుత్, పర్యావరణం, పర్యాటకం, వ్యవసాయ రంగాలకు సంబంధించి రూ.4,018 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్వర్ణజయంతి మైత్రి మంజరి పార్కులో ఆర్కిడ్ పుష్పాల తోటను సందర్శించారు. ఈశాన్యానికి స్వర్గం సిక్కిం సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే ప్రధాన ఆధారమని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో అనుసంధానాన్ని మెరుగుపరచడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దీనివల్ల పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా నుంచి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడం, పర్యాటకుల రాకపోకలను పెంచడానికి గాంగ్టక్లో రింగ్ రోడ్ నిర్మించడం సహా సిక్కింలో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర ఆవతరణ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ 35 నిమిషాలపాటు ప్రసంగించారు. రాష్ట్రానికి రోప్‌వే, స్కైవే ప్రాజెక్టులు రానున్నాయని, నాథులాలో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నట్లు తెలిపారు. సిక్కింలో ప్రకృతి, సంస్కృతి సజీవంగా కనిపిస్తాయని అన్నారు.ఇక్కడి రహదారుల పరిశుభ్రత, గాలి స్వచ్ఛత చూస్తే సిక్కిం ప్రజలు ప్రకృతి పరిరక్షణకు నిజమైన ప్రతినిధులు అని తెలుస్తోందంటూ ప్రశంసించారు. సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాల ద్వారా సిక్కిం సహా ఈశాన్య ప్రాంతం భవిష్యత్ వృద్ధికి, సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా మారనుందని వెల్లడించారు. సిక్కిం రాష్ట్రం శాంతి, ఆధ్యాత్మికత, శ్రేయస్సులకు నిలయమని కొనియాడారు. హిమాలయ రాష్ట్రాన్ని సందర్శించాలంటూ పర్యాటకులకు పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన అందాలు వీక్షించాలని, ఆర్కిడ్ తోటల్లో విహరించాలని సూచించారు. ఇక్కడ పర్యావరణ అనుకూల పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 1,000 హోమ్‌స్టేలను నిర్మిస్తున్నారని, సాహస పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాల పరంగా కూడా ఊతం లభిస్తోందని వివరించారు. ఈ రాష్ట్రం ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఈశాన్యానికి స్వర్గం సిక్కిం అని ఉద్ఘాటించారు. ఫుట్‌బాల్ ఆడిన మోదీ ప్రధాని మోదీ గాంగ్టక్లో విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాకర్ సెషన్ చాలా ఉత్తేజపర్చేలా ఉందని అభివరి్ణంచారు. గాంగ్టక్లో ఈ అందమైన ఉదయం వేళ యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని స్పష్టంచేశారు. తనతోపాటు ఫుట్‌బాల్ ఆడిన విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి మోదీ ఫోటో దిగారు. సిక్కింలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ముఖ్యంగా ఫుట్‌బాల్, ఆర్చరీ రంగాల్లో క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని తెలిపారు. -
ఆకలి.. చలి : అరుదైన జంతుజాతి బలి
ఒక పక్క కండరాలను నలిపేసే గడ్డకట్టించే చలి.. మరోవైపు పేగులు మెలిపెట్టే ఆకలి అరుదైన మూగ జీవుల పాలిట అశని పాతంలా తగిలింది. దీంతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం పర్వత ప్రాంతాల్లో అరుదైన జంతు జాలి బలైపోయింది. కనీసం 300 అరుదైన హిమాలయన్ జడల బర్రెలు ప్రాణాలొదిలాయి. తాజాగా మంచు కరుగుతుండటంతో వీటి కళేబరాలు బయపడుతున్నాయి. ప్రభుత్వ అధికారి రాజ్ యాదవ్ అందించిన సమాచారం గత ఏడాది డిసెంబర్నుంచి సుదీర్ఘ కాలంగా కురుస్తు మంచు ఈ విషాదానికి దారితీసింది. ఉత్తర సిక్కింలోని ముగుతాంగ్, యమ్తంగ్ పర్వతాలను సందర్శించే స్థానిక నిర్వాహకులు, పశువైద్యులు బృందం వీటి కళేబరాలను శుక్రవారం కనుగొన్నారని ఉత్తర సిక్కిం జిల్లా మేజిస్ట్రేట్ రాజ్ యాదవ్ చెప్పారు. ముగాతాంగ్ , యమ్తంగ్ లోయ ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వాకరా ఆహారం జార విడవడానికి అధికారులు పలుసార్లు ప్రయత్నించినా, వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా విఫలమయ్యారని యాదవ్ చెప్పారు. వీపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వాటికి ఆహారాన్ని సరఫరా చేయాల్సింది స్థానికులను కోరినట్టు తెలిపారు. 500 జడల బర్రెలు చనిపోయినట్టుగా స్థానికుల ద్వారా తెలుస్తోందని, ఈ సంఖ్యని ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని యాదవ్ తెలిపారు. మరికొన్నింటికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే పశు సంరక్షణ శాఖ వైద్య బృందం ముకుతాంగ్‌కు ఇప్పటికే చేరుకున్నట్టు తెలిపారు. మరోవైపు చనిపోయిన పశువులను పాతిపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సిక్కిం బ్రాండ్ అంబాసిడర్‌గా ఏఆర్ రెహ్మాన్
గ్యాంగ్‌టక్: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్‌ను తమ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సిక్కిం ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాష్ట్రం చూడటానికే కాదు సాంస్కృతికంగా కూడా అందంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెంపొందించేందుకు రెడ్ పాండా వింటర్ కార్నివాల్-2018ను నిర్వహించిన సందర్భంగా ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ రెహ్మాన్‌ను సత్కరించారు. -
నటి ప్రియాంక చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సిక్కిం రాష్ట్రం అల్లర్లకు నెలవుగా మారిందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక చోప్రా నిర్మాతగా మారి పహునా అనే చిత్రాన్ని నిర్మించారు. సిక్కిం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో ఇద్దరు చిన్నారి శరణార్థుల మధ్య చోటు చేసుకునే పరిణామాలతో ఉద్వేగపూరితంగా తెరకెక్కించారు. పహునాను టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా.. ప్రశంసలు దక్కాయి. దీంతో మీడియా సమావేశంలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... ‘సిక్కం ఈశాన్య భారతంలో ఓ చిన్న రాష్ట్రం. అక్కడ ఫిల్మ్ఇండస్ట్రీ లేదు.. కనీసం సినిమాలు తీసేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. అందుకు కారణం నిత్యం అక్కడ తిరుగుబాటులు, అల్లర్లు చెలరేగి ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అయినా అతి కష్టం మీద ఇబ్బందులను ఎదుర్కుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలిచిత్రం పహునానే’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లగక్కుతున్నారు. సిక్కిం చాలా ప్రశాంతతో కూడుకున్న రాష్ట్రమని కొందరు కామెంట్ చేస్తే.. అసలు సిక్కిం ఎక్కడ ఉంటుందో ప్రియాంకకు తెలుసా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు సిక్కిం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రియాంకకు సూచిస్తున్నారు. కాగా, సిక్కిం నుంచి ఈ మధ్య చాలా మంచి మంచి సినిమాలే వస్తున్నాయి. అందులో ప్రశాంత్ రసయిలి లాంటి టాలెంటెడ్ దర్శకుడు తీసిన కథ, ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ యేడాది సిక్కిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ధోక్బు కూడా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది.


