గాంగ్‌టక్ స్టేడియంలో యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్న ప్రధాని మోదీ
ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి అష్టలక్ష్ములు
ఎనిమిది రాష్ట్రాల్లో అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సిక్కిం పర్యటనలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
రూ. 4,018 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
గాంగ్‌టక్: ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి అష్టలక్ష్ములు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వ విధానం కేవలం ‘యాక్ట్ ఈస్ట్’మాత్రమే కాదని.. ‘యాక్ట్ ఫాస్ట్’కూడా అని స్పష్టంచేశారు. ఈశాన్య రాష్ట్రాలను శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రధాని మోదీ మంగళవారం ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో పర్యటించారు.
రాజధాని గాంగ్‌టక్‌లో నిర్వహించిన సిక్కిం రాష్ట్రావతరణ 50వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పట్టణాభివృద్ది, విద్యుత్, పర్యావరణం, పర్యాటకం, వ్యవసాయ రంగాలకు సంబంధించి రూ.4,018 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్వర్ణజయంతి మైత్రి మంజరి పార్కులో ఆర్కిడ్ పుష్పాల తోటను సందర్శించారు.
ఈశాన్యానికి స్వర్గం సిక్కిం
సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే ప్రధాన ఆధారమని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో అనుసంధానాన్ని మెరుగుపరచడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దీనివల్ల పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా నుంచి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడం, పర్యాటకుల రాకపోకలను పెంచడానికి గాంగ్‌టక్‌లో రింగ్ రోడ్ నిర్మించడం సహా సిక్కింలో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర ఆవతరణ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ 35 నిమిషాలపాటు ప్రసంగించారు. రాష్ట్రానికి రోప్‌వే, స్కైవే ప్రాజెక్టులు రానున్నాయని, నాథులాలో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నట్లు తెలిపారు. సిక్కింలో ప్రకృతి, సంస్కృతి సజీవంగా కనిపిస్తాయని అన్నారు.
ఇక్కడి రహదారుల పరిశుభ్రత, గాలి స్వచ్ఛత చూస్తే సిక్కిం ప్రజలు ప్రకృతి పరిరక్షణకు నిజమైన ప్రతినిధులు అని తెలుస్తోందంటూ ప్రశంసించారు. సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాల ద్వారా సిక్కిం సహా ఈశాన్య ప్రాంతం భవిష్యత్ వృద్ధికి, సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా మారనుందని వెల్లడించారు. సిక్కిం రాష్ట్రం శాంతి, ఆధ్యాత్మికత, శ్రేయస్సులకు నిలయమని కొనియాడారు.
హిమాలయ రాష్ట్రాన్ని సందర్శించాలంటూ పర్యాటకులకు పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన అందాలు వీక్షించాలని, ఆర్కిడ్ తోటల్లో విహరించాలని సూచించారు. ఇక్కడ పర్యావరణ అనుకూల పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 1,000 హోమ్‌స్టేలను నిర్మిస్తున్నారని, సాహస పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాల పరంగా కూడా ఊతం లభిస్తోందని వివరించారు. ఈ రాష్ట్రం ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఈశాన్యానికి స్వర్గం సిక్కిం అని ఉద్ఘాటించారు.
ఫుట్‌బాల్ ఆడిన మోదీ
ప్రధాని మోదీ గాంగ్‌టక్‌లో విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాకర్ సెషన్ చాలా ఉత్తేజపర్చేలా ఉందని అభివరి్ణంచారు. గాంగ్‌టక్‌లో ఈ అందమైన ఉదయం వేళ యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని స్పష్టంచేశారు. తనతోపాటు ఫుట్‌బాల్ ఆడిన విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి మోదీ ఫోటో దిగారు. సిక్కింలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ముఖ్యంగా ఫుట్‌బాల్, ఆర్చరీ రంగాల్లో క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని తెలిపారు.


