breaking news
SHE team hyderabad
-
గణేష్ ఉత్సవాల్లో గలీజు పనులు
వినాయక నిమజ్జన ఉత్సవాల్లో పోకిరీలు రెచ్చిపోయారు. సందట్లో సడేమియా తరహాలో అనైతిక చర్యలకు పాల్పడ్డారు. మహిళలు, బాలికల పట్ల అనుచితంగా ప్రవరిస్తూ పైశాచిక ఆనందం పొందారు. పనిలో పనిగా దొంగలు కూడా తమ చోర కళను ప్రదర్శించారు. భాగ్యనగర పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి జులాయిలతో పాటు చోరుల ఆట కట్టించారు.సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని మండపాల వద్ద నేరాలు చేయడానికి అనేకమంది రంగంలోకి దిగారు. స్నాచింగ్స్తోపాటు జేబు దొంగతనాలు చేసే ఉద్దేశంతో ఖైరతాబాద్ బడా గణేషుడి వద్ద, ఇతర ప్రాంతాల్లో తచ్చాడుతుండగా పలువురిని సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ టీమ్స్ పట్టుకున్నాయని అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు మంగళవారం పేర్కొన్నారు.ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు 25 ప్రత్యేక బృందాలు 1,917 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాయి. వీరిలో 31 మందిని లోతుగా విచారించగా, పది మందికి నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. దీంతో వీరిని ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడుతున్న 2935 మందిని షీ–టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 858 మందికి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టారు. మరో 69 మందిని న్యాయస్థానంలో హాజరుపరచగా శిక్ష పడింది. 24 మందికి రూ.1050 జరిమానా, 40 మందికి సామాజిక సేవతోపాటు జరిమానా, ఐదుగురికి జరిమానాతోపాటు జైలు శిక్ష పడింది.ఇదీ చదవండి: వినూత్నంగా హైదరాబాద్ పెన్ షో.. ఎక్కడో తెలుసా? -
మా ఇంట్లో అమ్మాయిల జోలికి వస్తే ఊరుకోం
ఎన్ని చట్టాలు తెచ్చినా, చర్యలు చేపడుతున్నా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఆధునిక సమాజంలోనూ అతివలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. నవ నాగరిక లోకంలోనూ నారీమణులకు నగుబాటు తప్పడం లేదు. సామాజిక కట్టుబాట్లను తెంచుకుని విద్యాఉద్యోగ రంగాల్లో రాణిస్తున్న 'ఆమె'ను కీచక సంతతి కాల్చుకు తింటూనే ఉంది. నాటి నుంచి నేటి వరకు సమాజం ఎంతగా పురోగమించినా మగాళ్ల మైండ్ సెట్ మారకపోవడం విస్తుగొల్పుతోంది. 'నేను మగాణ్ని, ఏమైనా చేస్తా' అనే ధోరణి ఇంకా కొనసాగుతుండడం శోచనీయం. ఇదే విషయం మరోసారి రుజువైంది. వనితలను వేధింపులకు గురిచేసే పోకిరీలకు ముకుతాడు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 'షీ' బృందాలు ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పరిధిలో ఆడవాళ్లను అల్లరి పెడుతూ 250 మందిపైగా జులాయిలు ఈ బృందానికి చిక్కారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం ప్రకటించకపోగా వేధింపులు తప్పనిపించలేదంటూ ఈ 'ఇడియట్స్' లో 80 శాతం మంది దబాయించడం మగాడి మైండ్ సెట్ మారలేదనడానికి ప్రబల తార్కాణం. అబ్బాయిలతో అమ్మాయిలు చనువుగా మెలగడం వల్లే వేధింపులు పెరుగుతున్నాయని సూత్రీకరించిన ఈవ్ టీచర్లు... తమ ఇంట్లో అమ్మాయిల జోలికి ఎవరైనా వస్తే తోలు ఒలుస్తామని హుంకరించడం హాస్యాస్పదంగా కనబడుతోంది. కొంచెం అటుఇటుగా దేశమంతా ఇదే పరిస్థితి ఉందని చెప్పడానికి సంకోచించాల్సిన పనిలేదు. సాంకేతికంగా శిఖరస్థాయి చేరామని చంకలు గుద్దుకుంటున్న సమాజంలో స్త్రీలపై వేధింపులు లెక్కకు మిక్కిలిగా పెరుగుతుండడం చూస్తుంటే పితృస్వామ్య పెత్తందారీ పోకడలు పూర్తిగా పోలేదని అర్థమవుతోంది. తమ ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు మగాళ్లు అబలలపై వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం కూడా పరిస్థితి చేయిదాటడానికి కారణమన్న వాస్తవం విస్మరించరానిది. సమాజం పురోగమిస్తున్న కొద్దీ అనాగరిక పోకడలు పతనం కావాలి. అదేం విచిత్రమో ఆడవాళ్లపై అకృత్యాలు నానాటికీ అధికమవుతున్నాయి. కారణాలు ఏమైనా కానీ కాంతలపై కిరాతకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక పటాటోపంతో మిడిసిపడుతున్న నేటి సమాజం.. స్త్రీల పట్ల పురుషుడి ఆలోచనా ధోరణిలో మాత్రం గతకాలంలోనే ఆగిపోయిందన్న భావన కలుగుతోంది. నిజంగా సమాజం మారివుంటే ఫుణ్య ధరిత్రిలో పడతులపై అకృత్యాలు ఎందుకు పెరుగుతాయి. తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే మగాడి ఆలోచనా విధానం మారనంత కాలం అతివలకు కష్టాలు తప్పవు. -పి. నాగశ్రీనివాసరావు (సాక్షి వెబ్ ప్రత్యేకం)


