breaking news
share offers
-
అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా ప్రభావం రిటైల్ రంగ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఇప్పటి వరకు భవన యజమాని, దుకాణదారు మధ్య అద్దె చెల్లించేలా ఒప్పందాలు ఉండేవి. రానున్న రోజుల్లో అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలోకి వచ్చి మాల్స్, దుకాణాలు తెరుచుకున్నాక వ్యాపారం తిరిగి గాడిన పడేందుకు కొన్ని నెలల సమయం పట్టనుంది. వ్యాపారాలు అంతంతే నమోదు అవుతాయి కాబట్టి అద్దెలు చెల్లించే స్థాయి విక్రయదారులకు ఉండదని నిపుణులు అంటున్నారు. వ్యాపారాలు లేనందున భవన యజమానులకు మరో మార్గం లేదని, ఆదాయంలో వాటా తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. దుకాణదారులు కోలుకోవడానికి ఈ విధానం చక్కని పరిష్కారం అని వారు అభిప్రాయపడ్డారు. ఆ నిబంధన ప్రకారం.. ఫోర్స్ మెజోర్ నిబంధన ప్రకారం అద్దెలో వెసులుబాటును దుకాణదారులు కోరవచ్చు. మూతపడ్డ కాలానికి అద్దె చెల్లించలేమని చెప్పేందుకూ ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మాల్స్‌లో దాదాపు 60 శాతం మేర స్థలాన్ని ప్రధాన బ్రాండ్ల యాంకర్ స్టోర్లతో నిండిపోయి ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఫోర్స్ మెజోర్ నిబంధనను వినియోగించుకుంటాయి. రిటైలర్ల ఆదాయంలో అద్దె ఖర్చు 12–16 శాతముంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. మాల్ యజమానులు 45 శాతం అద్దె కోల్పోయే చాన్స్ ఉందని చెబుతోంది. ఒకవేళ రెండు నెలలకుపైగా దుకాణాలు మూసివేస్తే దాని ప్రభావంతో 62 శాతం అద్దె కోల్పోయే అవకాశం ఉందని వివరించింది. కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో దుకాణదారుల ఆర్థిక స్థితిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలిపింది. గతంలో రోజుకు ఎంతకాదన్నా దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో రూ.500 కోట్ల వ్యాపారం నమోదయ్యేదని అంచనా. మొదలైన వినతులు.. అద్దెలు తగ్గించాల్సిందిగా రిటైలర్ల నుంచి వినతులు వస్తున్నాయని రియల్ ఎస్టేట్ సంస్థలు, మాల్ యజమానులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రిటైలర్లు ఎదుర్కోబోయే సమస్యలు, సవాళ్లను రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తెలియజేశాయి. అద్దె నుంచి మినహాయించాల్సిందిగా బిగ్‌బజార్, ఈజీడే క్లబ్ ఇప్పటికే భవన యజమానులకు విన్నవించింది. ఇదే బాటలో వీ–మార్ట్ సైతం చేరింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో అద్దె చెల్లించలేమని స్థల యజమానులకు సమాచారం ఇచ్చామని వీ–మార్ట్ సీఎండీ లలిత్ అగర్వాల్ వెల్లడించారు. -
స్టార్టప్ ధమాకా..!
⇒ కొత్త కంపెనీల కోసం తిరిగి వస్తున్న ఎన్నారైలు ⇒ భారీ వేతనాలు, వాటా ఆఫర్లతో మరికొందరు ⇒ వేతనాల పెంపులో మన స్టార్టప్‌లే మేటి ⇒ కొత్త కంపెనీల ఏర్పాటులో ముందున్న హైదరాబాదీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుడెప్పుడో డాట్‌కామ్ బూమ్. అంతా ఆ మత్తులో ఉండగానే బుడగ బద్దలయింది. ఎన్నెన్నో కంపెనీలు... కొన్ని లక్షల కోట్లు నష్టపోయాయి. లక్షల మంది రోడ్డునపడ్డారు. కాకపోతే ఈ చెడులోనూ ఓ మంచి జరిగింది. అదేంటంటే... ఆ డాట్ కామ్ల వల్ల వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం చాలామందికి అందుబాటులోకి వచ్చింది. తరవాత ఆ ఇంటర్నెట్ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచ గతినే మార్చేసిన ఐటీ బూమ్‌కు బాటలు వేసింది. ఇదేమీ బద్దలయ్యే బూమ్ కాదని రోజురోజుకూ అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానమే స్పష్టంగా చెబుతోంది. ఇపుడు ఆ ఐటీ నుంచి పుట్టుకొచ్చిందే స్టార్టప్ బూమ్. చేతిలో ఏమీ లేకున్నా బుర్రకు పదును పెట్టి కంపెనీలు ఆరంభించేస్తున్నారు. అదే స్టార్టప్ బూమ్. దీంతో జరుగుతున్న మరో మేలేమిటంటే... ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయ యువత తిరిగి వస్తున్నారు. అదే అతిపెద్ద న్యూస్. సొంత కంపెనీ పెట్టడం... వేరొకరు పెట్టిన కొత్త కంపెనీలో భారీ వేతనంతో చేరటం... కారణాలేమైనా ప్రవాసం వెళ్లిన భారతీయ ఇంజనీర్లిప్పుడు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఇండియాకు తిరిగి వచ్చి తమ నైపుణ్యాన్ని, సేవలను దేశానికందించే ప్రవాసులకు తగిన గుర్తింపు ఇస్తామని, వారి ఆదాయానికి ఎలాంటి దిగులూ ఉండదని సాక్షాత్తూ భారత ప్రధానే ప్రకటించటంతో ఈ సీన్ రివర్స్ మరింత ఉత్సాహాన్ని నింపుతోందనేది నిపుణుల మాట. ‘‘ప్రస్తుతం దేశంలో 30,000 నుంచి 35,000 వరకు స్టార్టప్స్ సంస్థలున్నాయి. ఇందులో 2,000 నుంచి 3,000 కంపెనీలు మాత్రమే భారీ పెట్టుబడులతో స్థిరపడ్డాయి. మరో 1,000 కంపెనీలు నిధుల సమీకరణలో ఉన్నాయి. స్టార్టప్స్‌లో అధికభాగం ఈ కామర్స్ రంగానివే. 25-30% ఈ విభాగానివే కాగా సేవా రంగంలో 22%, టెక్నాలజీ విభాగంలో 20%, విద్యా రంగంలో 18%, వైద్య రంగంలో 10-15% వరకు కార్యకలాపాలు సాగిస్తున్నాయి’’ అని లెమన్ ఐడియాస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఐడియా ఫార్మర్ దీపక్ మొనారియా చెప్పారు. స్టార్టప్స్ కంపెనీల స్థాపన, నిర్వహణ, నిధుల సమీకరణ వంటి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు తొలిసారిగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది లెమన్ సంస్థ. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో మాట్లాడారు. నాగ్‌పూర్‌లో 9 నెలల పాటు సాగే ఈ శిక్షణ రుసుము రూ.2.95 లక్షలు. ఇంక్రిమొంట్లు, విదేశీ టూర్లు... స్టార్టప్ కంపెనీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే ఉద్యోగులకు ఆకాశమే హద్దు. ఉద్యోగులను ఎంత బాగా చూసుకుంటే వారు అంత ఉత్సాహంగా పనిచేస్తారని స్టార్టప్ సంస్థలు నమ్ముతున్నాయి. దీంతో తమ ఉద్యోగులకు వేతనాల పెంపు మాత్రమే కాదు... ఇంక్రిమెంట్లు, ఫారిన్ ట్రిప్పులను కూడా అందిస్తున్నాయి. స్టార్టప్స్ కంపెనీల్లో ప్రత్యేకించి టెక్నికల్, ప్రొఫిషనల్ ఉద్యోగులకే జీతాల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. ప్రొఫెషనల్/టెక్నికల్స్ ఉద్యోగులకు 12.1% వేతనాలు పెరిగితే.. సీనియర్స్/టాప్ మేనేజ్మెంట్కు 9.6%, మిడిల్ మేనేజ్మెంట్కు 10.5%, క్లరికల్ సిబ్బందికి 10.6%, ఇతరులకు 9.1% మేర వేతనాలు పెరిగాయి. ఈ ఏడాది కొన్ని స్టార్టప్‌లు ఉద్యోగులకిచ్చిన ఆఫర్లు ఇవీ... ⇒ బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ‘ఊకర్’... తమ ఉద్యోగులకు 120% ఇంక్రిమెంట్లను, ఉత్తమ పనితీరును కనబర్చిన మొదటి 7 గురు ఉద్యోగులకు మాల్దీవుల ట్రిప్‌ను ఆఫర్ చేసింది. ⇒ మొబైల్ కామర్స్‌లో వేగంగా ఎదుగుతున్న ‘పేటీఎం’... ఉత్తమ పనితీరు కనబర్చిన ఉద్యోగులకు గతేడాది 20-25 శాతం బోనస్‌లను ఇస్తే... ఈ ఏడాది ఆ శాతాన్ని 50కి పెంచింది. ⇒ షాప్‌క్లూస్ సంస్థ ఉత్తమ పనితీరుకనబర్చిన వారికి 40%వరకూ వేతనాలు పెంచడమే కాకుండా ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ) కింద వాటాలు, బోనస్‌లను కూడా అందిస్తోంది. ⇒ ‘మైరిఫర్స్’ సంస్థ జీతాల్లో ఆర్థ సంవత్సరానికి 15-25 శాతం పెరుగుదలను ప్రకటించింది. ⇒ వింగిఫై, టాలెంట్ప్యాడ్లు 40-50% వేతనాలను పెంచాయి. హైదరాబాదీలు ఎక్కువే.. స్వదేశానికి తిరిగొస్తున్న ప్రవాసుల జాబితాలో హైదరాబాదీలు తక్కువేమీ కాదు. హలోకర్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజు భూపతి... సీఎస్సీలో డెరైక్టర్ హోదాలో పనిచేశారు. యూఎస్, యూకేల్లో కూడా విధులు నిర్వర్తించారు. ఉద్యోగం వదిలే సమయానికి ఆయన వార్షిక వేతనం రూ.1.5 కోట్లు. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి హలోకర్రీని ఏర్పాటు చేశారు. ఇక అమెరికాలో పేటెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన క్రిస్పి లారెన్స్.. స్వదేశానికి తిరిగొచ్చి హైదరాబాద్‌లో డుకెర్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. లేచల్ బ్రాండ్‌తో జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే బూట్లను ఉత్పత్తి చేస్తున్నారు. అమెరికన్ టెలికం కంపెనీలో నార్త్ అమెరికా మేనేజర్‌గా పనిచేసిన కిరణ్ కలకుంట్ల ఉద్యోగానికి టాటా చెప్పేసి... ఇక్కడికొచ్చి ‘ఈకిన్ కేర్’ సంస్థను ఆరంభించారు. అమెరికాలోని నాలెడ్జ్ యూనివర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న హరివర్మదీ ఇదే దారి. ఇక్కడికొచ్చేసి క్రియాలెర్నింగ్ సంస్థను స్థాపించి విద్యా రంగంలో పెనుమార్పులకు కృషి చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది స్టార్టప్స్‌లో వేతనాల పెరుగుదల విషయంలో మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఇండియా దాటేసే అవకాశముందని అయాన్ హెవిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశీయ స్టార్టప్స్ కంపెనీల్లో 13.6% మేర వేతనాలు పెరిగే అవకాశముందని దీన్లో తేలింది.