48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్’ వివాదం ఏంటి?
ఒక సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డ్ అనుమతి ఉండాలి. సరైన సమయానికి సెన్సార్ పూర్తికాక రిలీజ్ వాయిదా వేసుకున్న సినిమాలెన్నో ఉన్నాయి. అయితే ఓటీటీలో అలాంటి అడ్డంకులేమి ఉండవు. డైరెక్టర్‌గా రిలీజ్ చేసుకోవచ్చు. అభ్యంతరాలు రావడం.. నిషేదానికి గురికావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ చిత్రం ‘సట్లజ్’కి వచ్చింది.బాలీవుడ్ నటుడు దిల్జీత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా జులై 3న డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ జీ5(ZEE5)లో రిలీజ్ అయింది. ఆ తర్వాత జూలై 5న దాని స్ట్రీమింగ్‌ను నిలిపివేసింది. జూలై 6, సోమవారం నాడు, ఈ చిత్రాన్ని తిరిగి ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆ ప్లాట్‌ఫామ్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కానీ అది జగలేదు.భారతదేశంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కోసం ఎందుకు అందుబాటులో లేదనే కారణాన్ని వెల్లడించకుండా, జీ5 ఇలా పేర్కొంది. ‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి ప్రకటన వచ్చేవరకు ‘సట్లజ్’ భారతదేశంలో అందుబాటులో ఉండదు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని మా ప్రేక్షకుల ముందుకు తిరిగి తీసుకురావడానికి, సరైన ప్రక్రియ ద్వారా సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఒక ప్రకటన జారీ చేసింది.నిషేదం ఎందుకు?పంజాబ్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ 'జస్వంత్ సింగ్ ఖల్రా' జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ఈ సట్లజ్. ఇందిరా గాంధీ హత్య, సిక్కు వ్యతిరేక ఆందోళనల తర్వాత 1980-90ల్లో పంజాబ్‌లో వేలాది మంది అదృశ్యమయ్యారని... వారిని పోలీసులు వివిధ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అనుమానం వస్తే చాలు పిట్టల్లా కాల్చిచంపేశారు. ఈ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక కార్యక్తర జస్వంత్ సింగ్ ఖల్రా.1995 వరకు ఆయన చాలా యాక్టివ్‌గా పోరాటాలు చేశాడు. ఎన్నో నిజాలను బయటకు తీసి అప్పటి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాడు. అయితే 1995 సెప్టెంబర్‌లో ఆయనను కిడ్నాప్ చేసి హత్య చేశారు. మృతదేహం దొరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. శవం లేకపోవడంతో కేసు ముందుకు కదల్లేదు. అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు సిబిఐ సంస్థ రంగంలోకి దిగాక అసలు దోషులు పట్టుకొకొని.. 2007లో వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. ఈ విషయాలనే సట్లజ్ సినిమాలో చూపించాడు దర్శకుడు హనీ ట్రెహాన్. ఈ చిత్రం దేశ భద్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021 (IT Rules 2021) మరియు ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద ఉన్న అధికారాలను ఉపయోగించి జీ5 సంస్థను ఈ సినిమాను తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయితే జీ5 సంస్థ మాత్రం ఈ విషయాలేవి చెప్పకుండా.. ‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా’ అని ప్రస్తావిస్తూ చట్టపరమైన ప్రక్రియను అనుసరించి సినిమాను తిరిగి ఇండియాలో స్ట్రీమింగ్ చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని వెల్లడించింది.సెన్సార్ బోర్ట్ అభ్యంతరం..ఈ సినిమా నిజానికి 2022లోనే పూర్తయింది. మొదట దీనికి 'ఘల్లుఘరా' (మారణకాండ) అని, ఆ తర్వాత 'పంజాబ్ 95' అని పేర్లు పెట్టారు. థియేటర్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు (CBFC) వద్దకు వెళ్లినప్పుడు.. బోర్డు ఇందులో 127 సీన్లను కట్ చేయాలని సూచించింది. అయితే ఆ కట్స్‌కు ఒప్పుకోని చిత్రబృందం, ఓటీటీలకు సెన్సార్ బోర్డు పరిధి ఉండదు కాబట్టి, ఎలాంటి కట్స్ లేకుండా నేరుగా 'సట్లజ్' అనే కొత్త పేరుతో జీ5 లో విడుదల చేసింది. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ సినిమా కంటెంట్‌ను పూర్తిగా పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. భారతదేశంలో దీని స్ట్రీమింగ్ నిలిచిపోయినప్పటికీ, మిగిలిన దేశాల్లో అందుబాటులో ఉంది.