breaking news
sarveypalli
-
మంత్రి సోమిరెడ్డికి ఊహించని షాక్!
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీతో పాటు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి అవినీతి...అక్రమాలు సహించలేకే పలువురు టీడీపీని వీడుతున్నారని అన్నారు. కాగా ఇప్పటికే సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. మరోవైపు జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో రామతీర్థం మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాసులు, కరుణాకర్, మురళితో పాటు పలువురు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. -
'నన్నెందుకు ఓడిస్తున్నారు....'
''ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో సేవ చేశాను! అలాంటిది నన్నేందుకు ఓడిస్తున్నారో అర్ధం కావటం లేదు'' అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం చిన్న చెరుకూరులో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పదేళ్లపాటు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయితే ఓటర్లు తనను రెండుసార్లు ఓడించారని, ఎందుకు అలా జరుగుతుందో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఓటర్లు ఆలోచించి తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. వాస్తవానికి రెండు సార్లు సర్వేపల్లి నుంచి ఓడిపోవడంతో ఈసారి తనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని సోమిరెడ్డి చాలా గట్టి ప్రయత్నమే చేశారు. అయితే అది కాస్తా పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. అసలు తాను ఈసారి పోటీకి దిగేది లేదని, ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతానని అలిగారు. కానీ చంద్రబాబు ఆయనను బుజ్జగించి, బరిలోకి దింపారు. కానీ ప్రచారపర్వంలో అడుగడుగునా పరిస్థితి అవగతం అవుతుండటంతో ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.