breaking news
Samaikya resloutiion
-
బీఏసీపై ఎవరేమన్నారు?
బాబు, కిరణ్‌లది బాధ్యతారాహిత్యం ‘‘అతి ముఖ్యమైన బిల్లుపై జరిగిన బీఏసీకి కూడా సభా నాయకుడు కిరణ్, విపక్ష నేత చంద్రబాబు రాకపోవడం అత్యంత బాధ్యతారాహిత్యం. రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లనే బాబు... బీఏసీకి కూడా టీడీపీ నుంచి రెండు ప్రాంతాల నేతలను పంపించి, రెండు వాదనలు వినిపించారు. ఇక సభలో సమైక్య తీర్మానం చేద్దామని మేమెప్పుడో డిమాండు చేస్తే పట్టించుకోకపోగా, సగం చర్చ పూర్తయ్యేదాకా సహకరించిన కిరణ్ ఇప్పుడు నోటీసిచ్చి కూడా బీఏసీకి డుమ్మా కొట్టారు. సమైక్య తీర్మానం చేసేలా సమన్వయం చేయాల్సిన ఆయన బీఏసీకే రాకుండా ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో... అసలు రాష్ట్రాన్ని సమైక్యంగా కాపాడటానికి తాను చేస్తున్న ప్రయత్నాలు, ఆలోచనలు ఏమిటో ఎవరికీ చెప్పరు. బయట బాబు మాటల్లో కన్పిస్తున్న ఆవేశం బీఏసీకి వచ్చే విషయంలో ఏమవుతోంది? ఇప్పటికైనా సభలో సమైక్య తీర్మానం చేయాల్సిందే. బీఏసీలో మా నేత విజయమ్మ కూడా గట్టిగా అదే కోరారు. తనకందిన మొత్తం 12 నోటీసులనూ అడ్మిట్ చేసినట్టు స్పీకర్ చెప్పారు. ఆయన ఎవరి నోటీసును స్వీకరించి సమైక్య తీర్మానం ప్రతిపాదించినా మేం మద్దతిస్తాం. పార్టీలకతీతంగా తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఉన్న ఐక్యత సీమాంధ్ర సభ్యుల్లో లేకపోవడం బాధాకరం’’ - శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కృష్ణబాబు (వైఎస్సార్సీపీ) సీఎం తీరు రాజ్యాంగవిరుద్ధం ‘‘సభ జరుగుతున్న సమయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పకుండా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నోటీసును ఇవ్వడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాకాంక్షలకు అనుగుణంగా మంత్రులు కూడా తమ స్థాయిని, హోదాను పక్కనపెట్టి మరీ సభను అడ్డుకోవడానికి వెల్‌లోకి పోతున్నరు. సీఎం దిగొస్తడేమోనని రెండు రోజులు చూసినం. కానీ ఆయన అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు, బీఏసీకీ రాలేదు. అసలు ఒక అంశంపై సభ చర్చ జరుగుతుండగా అదే అంశంపై ఇలా నోటీసివ్వడానికి వీల్లేదు. ఇచ్చినా తిరస్కరించే విస్తృతాధికారం స్పీకర్‌కే ఉంది. ఇప్పటికైనా సీఎం ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలి. అప్పటిదాకా సభను అడ్డుకుంటం. ఈ నెల 30న బిల్లును వెనక్కు పంపించాలి’’ - గండ్ర, కోమటిరెడ్డి, ఆరేపల్లి మోహన్ (తెలంగాణ కాంగ్రెస్) సమయం పొడిగించాలి ‘‘బిల్లుపై ఇంకా 150 మంది మాట్లాడాలి గనుక గడువును పొడిగించాలి. సభ్యులిచ్చిన 9,024 సవరణ ప్రతిపాదనలపై చర్చ, ఓటింగ్ జరగాలి. బిల్లును తిరస్కరించే అధికారం సభకుంది. బీహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో అలా తీర్మానం చేశారు. సభ ఓటింగ్ ద్వారానే తన అభిప్రాయం చెప్పాలి’’ - గాలి, అశోక్ గజపతిరాజు, ధూళిపాళ్లనరేంద్ర(సీమాంధ్ర టీడీపీ) ఇంకా గడువొద్దు ‘‘రాష్ట్ర విభజనపై సంపూర్ణాధికారాలూ పార్లమెంటువే. రాష్ట్రపతిపై గౌరవంతో గడువులోగా బిల్లును తిప్పి పంపాలి’’ - రావుల, ఎర్రబెల్లి (తెలంగాణ టీడీపీ) నోటీసు వెనక్కు తీసుకోవాల్సిందే ‘‘పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగినట్టుగా, అనర్హుడైన కిరణ్‌ను సీల్డ్ కవరులో సీఎంను చేస్తే పరిధి దాటుతున్నారు. తన పరిధిలో లేని తెలంగాణ బిల్లును తిరస్కరించాలని ఒకసారి, చర్చకు గడువును పొడించాలని మరోసారి లేఖలు రాశారు. సభను, ప్రజస్వామ్యాన్ని, బీఏసీని, సభా సంప్రదాయాలను అవమానిస్తున్నారు. ఆయన నోటీసును ఉపసంహరించుకుంటే రెండు రోజుల పాటు సంపూర్ణంగా చర్చించొచ్చు. అందుకు సిద్ధంగా లేకుంటే బిల్లును వెంటనే తిప్పి పంపాలని కోరాం’’ - ఈటెల, హరీశ్, కేటీఆర్ (టీఆర్ఎస్) కిరణ్ ప్రైవేటు సభ్యుడే ‘‘సహచర మంత్రులు, ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిన సీఎం కిరణ్ ఇప్పుడు సాధారణ సభ్యుడే. దాన్ని స్పీకర్ తిరస్కరించొచ్చు. మంత్రివర్గం, ఎమ్మెల్యేల మధ్య కూడా స్పష్టమైన విభజన వచ్చింది. ఇంకా కలిసుండటం సాధ్యం కాదు’’ - యెండల, నాగం, యెన్నం (బీజేపీ) పొడిగింపు వద్దు ‘‘కిరణ్ రెచ్చగొట్టే చర్యల వల్ల తెలంగాణవాదుల్లో భయాందోళనలు పెరిగి ఆత్మబలిదానాలు జరుగుతున్నాయి. ఇంకా గడువు పెంచకుండా బిల్లును వెంటనే పంపించాలి’’ - గుండా మల్లేశ్ (సీపీఐ) ముగించాలి ‘‘సభలో చర్చ జరుగకున్నా బీఏసీలోనే మినీ సభలా చర్చ జరిగింది. మెజారిటీ సభ్యులు గడువు పెంపును వ్యతిరేకించారు. సభలో ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా చేసి ప్రజా ధనాన్ని ఇంకా దుర్వినియోగం చేయొద్దు. తెలంగాణ అంశాన్ని ఇంతటితో ముగించాలి. గడువు పెంచకుండా బిల్లును వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలి’’ - జూలకంటి రంగారెడ్డి (సీపీఎం) హరీశ్, గాలి వాగ్వాదం బీఏసీ తర్వాత విలేకరులతో మాట్లాడే సందర్భంగా గాలి, హరీశ్ మధ్య వాగ్వాదం జరిగింది. బీఏసీలో లేని అంశాలను చెప్పి అబద్ధాలతో టీడీపీ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హరీశ్ దుయ్యబట్టగా, మీరే అబద్ధాలకోరులంటూ గాలి ఎదురుదాడికి దిగారు. -
నోటీసుపై సీఎం వివరణ ఇవ్వాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: సరైన గడువు లేదని తెలిసీ ప్రజల ను గందరగోళంలో పడేయాలనే ఉద్దేశంతోనే సీఎం కిరణ్ సమైక్య తీర్మానం నోటీసును ఇచ్చారని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కు నిబంధనలు తెలిసినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌లో సమైక్య డ్రామాలు ఆడుతున్నారని మండిపడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ‘సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మా పార్టీ డిమాండ్ చేసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ మేం ఇదే పట్టుబట్టాం. అయితే బిల్లు వచ్చినపుడు తీర్మానం చేద్దామని సీఎం దాటవేశారు. బిల్లు రావొచ్చని తెలిసినపుడు, సభ ప్రారంభ సమయంలోనూ చెప్పాం. మా శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ లేఖ సైతం రాశారు. ఆనాడు స్పందించలేదు. పైగా మమ్మల్ని పోలీసులతో అసెంబ్లీ నుంచి గెంటేశారు. సమైక్యాంధ్ర కోసం మేం చేసే పోరాటానికి ఎక్కడమైలేజీ వస్తుందోననే ఉద్దేశంతో సీఎం కిరణ్ ఇదంతా చేశారు. టీడీపీ వారు వారికి వంతపాడుతూ చ ర్చల్లో మేం పాల్గొనకపోవడం ద్రోహం అని విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించి ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు. 10 రోజుల గడువు ఉన్నపుడే నోటీసు ఇవ్వాలని సీఎంకు తెలిసినప్పటికీ అంత గడువు లేనప్పుడు నోటీసు ఇచ్చారు. సభాపతిగా పనిచేసిన కిరణ్‌కు నిబంధనలు తెలియవా? సీఎం ఈ అంశంలో వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. మిగతా నోటీసులను పరిగణనలోకి తీసుకునేందుకు నిబంధనలు అనుకూలించకపోయినట్లైతే.. తమ పార్టీ ఇచ్చిన నోటీసు పెండింగ్‌లో ఉన్నందున దాని ప్రకారం తీర్మానం చేయాలని కోరారు. తనకంటే అనుభవజ్ఞుడు లేరని చెప్పుకునే చంద్రబాబు మనసులో రాష్ట్ర విభజన కావాలనే ఉందని కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. విభజన తమ వల్లే జరిగిందని చెప్పుకొని తెలంగాణలో లోకేశ్‌తో ప్రచారం చేయించడం, సమైక్యంగా ఉంచేందుకు పాటుపడ్డామని చెప్పి సీమాంధ్రలో ప్రచారం చేసుకోవాలనే యోచనలో బాబు ఉన్నారని ఆరోపించారు. అయితే ప్రజల్లోకి వెళితే టీడీపీ వారిని తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.