breaking news
Rupee exchange rate
-
రూపాయిని మరింత పడనివ్వాలి
ముంబై: విదేశీ ఆర్థిక అనిశ్చితి, ఒత్తిళ్లను తట్టుకునేందుకు వీలుగా డాలరుతో రూపాయి మారకం విలువను మరింత క్షీణించేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలు మరింత పెరిగితే, వడ్డీ రేట్ల పెంపునకు బదులు ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) నియంత్రణ చర్యలను ఎంచుకోవడం మంచిదని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడ్ ధరలు దూసుకెళ్లడం, రూపాయి భారీగా పతనం కావడం, దేశీయంగా పెట్రో రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణానికి రెక్కలొస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూన్ 5న ఆర్బీఐ కీలక పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ద్రవ్యోల్బణం మరీ ఆందోళనకంగా ఉందని భావిస్తే ఆర్బీఐ పరపతి విధానాన్ని కఠినతరం చేయొచ్చు. అయితే, కరెన్సీ రేటు పడిపోకుండా అడ్డుకోవడానికి మాత్రం మానిటరీ పాలసీని చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించాలి. బలహీన రూపాయి అనేది తటస్థ షాక్ అబ్జార్బర్‌లా పని చేస్తుంది. కాబట్టి, అది మరింత పడిపోకుండా అడ్డుకోవడం కంటే, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు వీలు కల్పించాలి’ అని ఆయన పేర్కొన్నారు. నిర్ణయాత్మక చర్యలు అవసరం... ‘రూపాయి మరింత పడిపోతుందని ఇన్వెస్టర్లు, దిగుమతిదారులు, ప్రజలు భావించడం మొదలైతే అది మరింత బలహీనపడుతుంది. కరెన్సీ ఇంకా పడిపోయే విధంగా వారి చర్యలుంటాయి. ఎగుమతిదారులు తమ డాలర్లను సొమ్ము చేసుకోవడం ఆలస్యం చేస్తారు. దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడతారు. ప్రజలు బంగారం కొనేందుకు మరింత మొగ్గుచూపుతారు. అలాగే ఇన్వెస్టర్లు హెడ్జింగ్‌ను తీవ్రతరం చేస్తారు. అందుకే జోక్యం చేసుకోవడం కంటే వారి ఆందోళనలను తగ్గించేలా వివరించడం చాలా ముఖ్యం’ అని దువ్యూరి చెప్పారు. పాలసీ రూపకర్తలు ఆత్మరక్షణలో పడినట్లు లేదా భయాందోళనలకు గురైనట్లు కాకుండా నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేచిచూడటం మంచిది... జీడీపీకి మద్దతివ్వడం కోసం వడ్డీ రేట్లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణం ఎగబాకి.. మారకం రేటు ఒత్తిళ్లు తీవ్రమవుతాయి. ఒకవేళ వడ్డీ రేట్లను భారీగా పెంచితే ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిని, జీడీపీ వృద్దిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ స్థిరీకరణ విషయంలో సమతూకం పాటించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంక్లిష్టమైన అంశం. కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలను అంచనా వేసేందుకు, తక్షణం పాలసీ రేట్లను పెంచకుండా ఆర్బీఐ కొంతకాలం వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తే మంచిదని దువ్వూరి తెలిపారు. -
పశ్చిమాసియా పరిస్థితులే దిక్సూచి
ప్రధానంగా పశ్చిమాసియా పరిస్థితులు ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. వీటికితోడు ముడి చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాలు చూద్దాం.. గత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు నాలుగో త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్ దాదాపు ముగింపునకు రావడంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఇకపై పశ్చిమాసియా పరిస్థితులు నిర్దేశించనున్నాయి. యూఎస్, ఇరాన్ మధ్య రోజుకోతీరుగా మారుతున్న యుద్ధ వాతావరణం లేదా చర్చలపై అవకాశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొంటున్నారు. వారాంతన యూఎస్ అత్యున్నత అధికారి మార్కో రూబియో రెండు దేశాల మధ్య చర్చులు పురోగతి సాధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. మరోపక్క ఇటీవలే ముగిసిన యూ ఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చైనా పర్యటన ప్రకటనలవరకే ఫలవంతమైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇవికాకుండా కొన్నేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక పరిస్థితులు గ్లోబల్ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 4 రోజులే ట్రేడింగ్ బక్రీద్ సందర్భంగా గురువారం దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు మండుతున్నాయి. దీంతో ఎయిర్లైన్స్సహా పలు రంగాల ముడివ్యయాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ఆర్బీఐతోపాటు.. ఫెడరల్ రిజర్వ్(యూఎస్) తదితర పలుదేశాల కేంద్ర బ్యాంకుల పరపతి విధానాలు కఠినతరమయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది రుణాలకు డిమాండును తగ్గించడంతోపాటు.. కార్పొరేట్ల రుణ వ్యయాలు పెరిగేందుకు కారణంకానున్నట్లు అంచనా వేశారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు యథాప్రకారం ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఎఫెక్ట్ భారత్ దిగుమతుల బిల్లును ప్రధానంగా చమురు, పసిడి ధరలు పెంచే సంగతి తెలిసిందే. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు దారి చూపుతోంది. దీనికితోడు ఇటీవల కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలన్నీ కొద్ది రోజులుగా దేశీ కరెన్సీని దెబ్బతీస్తు న్నాయి. దీంతో డాలరుతో మారకంలో రూపా యి ఏకంగా 96 స్థాయికి పడిపోయింది. ఆర్బీఐ చర్యల కారణంగా వారాంతాన కొంతమేర బలపడినప్పటికీ 94–95 స్థాయిలో కదులుతోంది. కాగా.. వా రాంతాన ఆర్బీఐ కొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించడం సానుకూల అంశమని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ఫోకస్ యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల తీరు వంటి అంశాలపై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. ఆర్బీఐ భారీ డివిడెండ్ ప్రభుత్వ వ్యయాలకు దన్నునివ్వవచ్చని, లిక్విడిటీని పెంచే వీలున్నదని మిశ్రా అభిప్రాయపడ్డారు. చమురు ధరలు బలహీనపడటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై అంచనాలు, మరింత నిర్మాణాత్మక మార్కెట్లు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు.గతవారం అక్కడక్కడే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు(0.23 శాతం) బలపడి 75,415 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు(0.32 శాతం) పుంజుకుని 23,719 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్స్ ఫ్లాట్‌గా ముగిసింది. సాంకేతికంగా చూస్తే.. సుమారు రెండు వారాలుగా దేశీ స్టాక్‌మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ గత వారం సైతం పరిమితుల మధ్యే కదిలాయి. వెరసి సమీప భవిష్యత్‌లో మార్కెట్ల కదలికలపై స్పష్టమైన సంకేతాలు అందడంలేదని సాంకేతిక నిపుణులు చెబుతునన్నారు. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు అటు ఎగువముఖంగా లేదా ఇటు దిగువ ముఖంగా బ్రేక్ సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 23,860–23,250 పాయింట్ల మధ్యే కదులుతోంది. 24,000 పాయింట్ల సమీపంలో రెసిస్టెన్స్ ఎదురవుతోంది. దీనిని అధిగమిస్తే 24,300వరకూ బలపడవచ్చు. 23,250 దిగువకు బలహీనపడితే.. 22,750– 22,350 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. సెన్సెక్స్ 76,000–74,000 పాయింట్ల మధ్య కదులుతోంది. ఈ శ్రేణిని ఛేదించవలసి ఉంది. ఎగువన 77,000 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్, దిగువన 73,000 వద్ద సపోర్ట్ కనిపించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జారిపోతున్న రూపాయి..
ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాల ప్రభావాలతో రూపాయి మారకం విలువ గణనీయంగా పతనమవుతోంది. డాలరుతో పోలిస్తే మరో 39 పైసలు క్షీణించి 96.20కి పడిపోయింది. సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 95.81తో పోలిస్తే మరింత తక్కువగా 96.19 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 96.39కి కూడా క్షీణించి చివరికి 96.20 వద్ద క్లోజయ్యింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటం, డాలరు బలోపేతం కావడం తదితర అంశాలతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. రాబోయే రోజుల్లోను ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, అయితే, బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షలతో పాటు ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకోవడంలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కనిష్ట స్థాయిల్లో రూపాయికి మద్దతుగా నిలవొచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. స్పాట్ మార్కెట్లో రూపాయి 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు. -
రూపీ @ 95
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. సోమవారం డాలరుతో పోలిస్తే ఒక దశలో ఏకంగా 95 మార్కును దాటేసి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 95.22ని తాకింది. ఇంట్రాడేలో 165 పైసల శ్రేణిలో తిరుగాడింది. చివరికి 15 పైసల లాభంతో 94.70 వద్ద క్లోజయ్యింది. శుక్రవారం నాడు 89 పైసలు పతనమై 94.85 వద్ద క్లోజయిన రూపాయి, రిజర్వ్ బ్యాంక్ సానుకూల చర్యల దన్నుతో, సోమవారం నాడు ట్రేడింగ్‌లో కాస్త పుంజుకుని 128 పైసల లాభంతో 93.62 వద్ద ప్రారంభమైంది. కానీ ఆ స్థాయి లాభాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. డాలరు ఇండెక్స్, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో రూపాయిపై ఒత్తిడి ఉంటోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 92–97 శ్రేణిలో రూపాయి తిరుగాడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, డాలరుతో రూపాయి మారకం విలువ బాగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పదా్నలుగేళ్లలో భారీ క్షీణత: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 9.88 శాతం క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. అప్పట్లో.. 2012 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 4.2 శాతానికి పెరిగిపోయిన తరుణంలో దేశీ కరెన్సీ 12.4 శాతం పతనమైంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, డాలరు బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు లాంటి అంశాలు ఇప్పటి క్షీణతకు కారణంగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 28న పశి్చమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి చూస్తే రూపాయి విలువ 4.1 శాతం పడిపోయింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు దాదాపు 55.073 బిలియన్ డాలర్లను విక్రయించింది. డాలరుతో పోలిస్తే ఇతర ఆసియా కరెన్సీలు కూడా గణనీయంగా క్షీణించాయి. జపాన్ యెన్ 6 శాతం, ఫిలిప్పీన్ పెసో 5.74 శాతం, దక్షిణ కొరియా వాన్ 2.88 శాతం తగ్గాయి. -
రూపాయి మరింత క్రాష్ ..
ముంబై: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు ప్రతి రోజు సరికొత్త రికార్డు కనిష్టాలకు పడిపోవడం కొనసాగుతోంది. సోమవారం మరో 49 పైసలు క్షీణించి 87 స్థాయిని కూడా దాటేసింది. 87.11 వద్ద క్లోజయ్యింది. కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్‌ల మోత మోగించడమనేది వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించడం .. మన రూపాయిపైనా ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా డాలరు పటిష్టంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగానే ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసర్చ్ ఆనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అమెరికా టారిఫ్‌లపై ఆందోళన వల్ల కూడా రూపాయి మీద ఒత్తిడి పెరగవచ్చని వివరించారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకుంటే రూపాయి పతనానికి కాస్త బ్రేక్ పడొచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న 85.61 వద్ద ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి 1.8 శాతం క్షీణించింది.మార్కెట్ ఆధారితమైనదే..: రూపాయి మారకం విలువ మార్కెట్ ఆధారితంగానే ఉంటుందే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగ్గించడమనేది జరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. డాలర్ ఇండెక్స్, పెట్టుబడుల ప్రవాహాలు, వడ్డీ రేట్లు, క్రూడాయిల్ కదలికలు, కరెంటు అకౌంటు లోటు తదితర జాతీయ, అంతర్జాతీయ అంశాలెన్నో రూపాయిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఎగుమతులపరంగా పోటీపడేందుకు వీలవుతుందని, ఇది ఎకానమీకి సానుకూలమని చెప్పారు. -
పుత్తడి @ 67,000
దీర్ఘకాలికంగా పసిడి పది గ్రాముల ధర రూ. 65,000–67,000 దాకా పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. దీనికి ఊతమిచ్చే అంశాలను ఈ విధంగా వివరించింది. ‘గడిచిన దశాబ్దకాలంలో దేశీయంగా పసిడి 159 శాతం రాబడులు ఇచ్చింది. ఇదే సమయంలో కీలకమైన స్టాక్స్ సూచీ నిఫ్టీ 50 ఇచ్చిన రాబడులు 93 శాతమే. ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ క్షీణత నుంచి రక్షణనివ్వడంలో పసిడి స్టార్ పెర్ఫార్మర్గా నిల్చింది. మధ్యమధ్యలో కాస్తంత తగ్గడం మినహా వార్షికంగా చూస్తే పుత్తడి ఇప్పటిదాకా మంచి రాబడులే ఇచ్చింది. డిమాండ్, పండుగల ఊతంతో నాలుగో త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. అధిక ధరలు, కరోనావైరస్పరమైన అంశాల కారణంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రభావం చూపడంతో మొత్తం మీద చూస్తే పసిడి వినియోగం తగ్గినప్పటికీ.. పెరుగుతున్న రేటు కారణంగా ఇన్వెస్టర్లు క్రమంగా పుత్తడి వైపు మళ్లడం వల్ల నాణేలు, కడ్డీలకు మాత్రం డిమాండ్ పెరిగింది. అనిశ్చితి పరిస్థితుల కారణంగా పుత్తడి ధర అంతర్జాతీయంగా ఔన్సు (33.1 గ్రాములు)కి 2,085 డాలర్లు, దేశీయంగా పది గ్రాములకు రూ. 56,400 గరిష్ట స్థాయిలను తాకి ప్రస్తుతం ఒక శ్రేణిలో తిరుగాడుతోంది. సెంట్రల్ బ్యాంకుల విధానాలు, తక్కువ వడ్డీ రేట్లు.. రాబడులు, మార్కెట్లోకి నిధుల వెల్లువ, కరోనా వైరస్ ప్రభావం తదితర అంశాలు దీర్ఘకాలంలో పసిడి రేట్లకు ఊతమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రూ. 49,500–48,500 దాకా తగ్గినప్పుడల్లా కొంతకొంతగా కొనుగోలు చేయొచ్చు. స్వల్పకాలికంగా రూ. 52,000–53,000 దాకా పెరగవచ్చు. దీర్ఘకాలికంగా మాత్రం పది గ్రాములకు రూ. 65,000–67,000 స్థాయికి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 2,500 డాలర్ల అంచనాలను కొనసాగిస్తున్నాం. -
రూపాయి135 పైసలు అప్ - 63.20 వద్ద ముగింపు
ముంబై: ఆరు రోజుల వరుస పతనానికి బ్రేక్ వేస్తూ.. రూపాయి శుక్రవారం అనూహ్యంగా కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 135 పైసలు పెరిగి 63.20 వద్ద క్లోజయ్యింది. ఇంత స్థాయిలో పెరగడం ఈ ద శాబ్దంలో ఇది రెండోసారి. ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ గురువారం చేసిన వ్యాఖ్యలు రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి. దేశీ కరెన్సీ గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టం 65.56కి పడిపోయిన నేపథ్యంలో నిరాశావాదానికి లోనుకానక్కర్లేదంటూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయంటూ ఆర్బీఐ ప్రకటించడం మార్కెట్ వర్గాలకు కాస్త భరోసా కల్పించాయి. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.55తో పోలిస్తే పటిష్టంగా 64.30 వ ద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే, ఆ తర్వాత కనిష్ట స్థాయి 64.75కి కూడా తగ్గింది. కానీ చివర్లో 2.09 శాతం ఎగిసి 63.20 వద్ద ముగిసింది. 2009 మే 18 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో దేశీ కరెన్సీ 152 పైసలు (3.08 శాతం) ఎగిసింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో ప్రభుత్వరంగ బ్యాంకులు డాలర్లను విక్రయించి ఉంటాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఫిక్స్డ్ ఇన్కమ్ ట్రేడింగ్ విభాగం హెడ్ ఆగమ్ గుప్తా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను నియంత్రించడంపై ప్రభుత్వం, ఆర్బీఐ పట్టుదలగా ఉన్నాయనే భరోసాతో కార్పొరేట్లు కూడా డాలర్లను విక్రయించారని ఆయన పేర్కొన్నారు. స్పాట్ ట్రేడింగ్‌లో దేశీ కరెన్సీ 63.40-64.60 శ్రేణిలో తిరుగాడవచ్చని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. 60-61కి పెరగొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 80 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్ డాలర్లకు తగ్గగలదని బ్రిటన్‌కి చెందిన బార్క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. భారత్ క్యాడ్‌ని పూర్తిగా భర్తీ చేసుకోగలదని పేర్కొంది. దీంతో వచ్చే 12 నెలల్లో రూపాయి విలువ 61 స్థాయికి కోలుకోగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీ కరెన్సీ 60 స్థాయికి పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం సహా చమురుయేతర దిగుమతులు ద్వితీయార్థంలో దిగిరావడం ద్వారా క్యాడ్ గణనీయంగా తగ్గగలదని పేర్కొంది.


