రూపాయిని మరింత పడనివ్వాలి  | Former RBI Governor Duvvuri Subbarao Urges RBI to Let Rupee Weaken | Sakshi
Sakshi News home page

రూపాయిని మరింత పడనివ్వాలి 

May 29 2026 3:58 AM | Updated on May 29 2026 3:58 AM

Former RBI Governor Duvvuri Subbarao Urges RBI to Let Rupee Weaken

విదేశీ ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవాలంటే తప్పదు

ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్ల పెంపు చివరి అస్త్రమే

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు 

ముంబై: విదేశీ ఆర్థిక అనిశ్చితి, ఒత్తిళ్లను తట్టుకునేందుకు వీలుగా డాలరుతో రూపాయి మారకం విలువను మరింత క్షీణించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలు మరింత పెరిగితే, వడ్డీ రేట్ల పెంపునకు బదులు ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) నియంత్రణ చర్యలను ఎంచుకోవడం మంచిదని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడ్‌ ధరలు దూసుకెళ్లడం, రూపాయి భారీగా పతనం కావడం, దేశీయంగా పెట్రో రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణానికి రెక్కలొస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా, జూన్‌ 5న ఆర్‌బీఐ కీలక పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ద్రవ్యోల్బణం మరీ ఆందోళనకంగా ఉందని భావిస్తే ఆర్‌బీఐ పరపతి విధానాన్ని కఠినతరం చేయొచ్చు. అయితే, కరెన్సీ రేటు పడిపోకుండా అడ్డుకోవడానికి మాత్రం మానిటరీ పాలసీని చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించాలి. బలహీన రూపాయి అనేది తటస్థ షాక్‌ అబ్జార్బర్‌లా పని చేస్తుంది. కాబట్టి, అది మరింత పడిపోకుండా అడ్డుకోవడం కంటే, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు వీలు కల్పించాలి’ అని ఆయన పేర్కొన్నారు. 

నిర్ణయాత్మక చర్యలు అవసరం... 
‘రూపాయి మరింత పడిపోతుందని ఇన్వెస్టర్లు, దిగుమతిదారులు, ప్రజలు భావించడం మొదలైతే అది మరింత బలహీనపడుతుంది. కరెన్సీ ఇంకా పడిపోయే విధంగా వారి చర్యలుంటాయి. ఎగుమతిదారులు తమ డాలర్లను సొమ్ము చేసుకోవడం ఆలస్యం చేస్తారు. దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడతారు. ప్రజలు బంగారం కొనేందుకు మరింత మొగ్గుచూపుతారు. అలాగే ఇన్వెస్టర్లు హెడ్జింగ్‌ను తీవ్రతరం చేస్తారు. అందుకే జోక్యం చేసుకోవడం కంటే వారి ఆందోళనలను తగ్గించేలా వివరించడం చాలా ముఖ్యం’ అని దువ్యూరి చెప్పారు. పాలసీ రూపకర్తలు ఆత్మరక్షణలో పడినట్లు లేదా భయాందోళనలకు గురైనట్లు కాకుండా నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

వేచిచూడటం మంచిది... 
జీడీపీకి మద్దతివ్వడం కోసం వడ్డీ రేట్లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణం ఎగబాకి.. మారకం రేటు ఒత్తిళ్లు తీవ్రమవుతాయి. ఒకవేళ వడ్డీ రేట్లను భారీగా పెంచితే ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిని, జీడీపీ వృద్దిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ స్థిరీకరణ విషయంలో సమతూకం పాటించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంక్లిష్టమైన అంశం. కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలను అంచనా వేసేందుకు, తక్షణం పాలసీ రేట్లను పెంచకుండా ఆర్‌బీఐ కొంతకాలం వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తే మంచిదని దువ్వూరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement