రూపీ @ 95  | Indian Rupee Slips Past 95 Mark For First Time Amid Escalating US-Iran War, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

రూపీ @ 95 

Mar 31 2026 4:41 AM | Updated on Mar 31 2026 5:42 PM

Indian rupee slips past 95 mark for first time amid escalating US-Iran war

ఇంట్రాడేలో తీవ్ర హెచ్చుతగ్గులు 

165 పైసలు అప్, డౌన్‌ 

చివరికి 15 పైసల లాభంతో 94.70 వద్ద క్లోజింగ్‌

ముంబై: ఇరాన్‌–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో గ్లోబల్‌ మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. సోమవారం డాలరుతో పోలిస్తే ఒక దశలో ఏకంగా 95 మార్కును దాటేసి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 95.22ని తాకింది. ఇంట్రాడేలో 165 పైసల శ్రేణిలో తిరుగాడింది. 

చివరికి 15 పైసల లాభంతో 94.70 వద్ద క్లోజయ్యింది. శుక్రవారం నాడు 89 పైసలు పతనమై 94.85 వద్ద క్లోజయిన రూపాయి, రిజర్వ్‌ బ్యాంక్‌ సానుకూల చర్యల దన్నుతో, సోమవారం నాడు ట్రేడింగ్‌లో కాస్త పుంజుకుని 128 పైసల లాభంతో 93.62 వద్ద ప్రారంభమైంది. 

కానీ ఆ స్థాయి లాభాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. డాలరు ఇండెక్స్, క్రూడాయిల్‌ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో రూపాయిపై ఒత్తిడి ఉంటోందని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. 92–97 శ్రేణిలో రూపాయి తిరుగాడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, డాలరుతో రూపాయి మారకం విలువ బాగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 
  
పదా్నలుగేళ్లలో భారీ క్షీణత: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 9.88 శాతం క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. అప్పట్లో.. 2012 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 4.2 శాతానికి పెరిగిపోయిన తరుణంలో దేశీ కరెన్సీ 12.4 శాతం పతనమైంది. 

విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్‌ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, డాలరు బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ఒడిదుడుకులు లాంటి అంశాలు ఇప్పటి క్షీణతకు కారణంగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 28న పశి్చమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి చూస్తే రూపాయి విలువ 4.1 శాతం పడిపోయింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు దాదాపు 55.073 బిలియన్‌ డాలర్లను విక్రయించింది. డాలరుతో పోలిస్తే ఇతర ఆసియా కరెన్సీలు కూడా గణనీయంగా క్షీణించాయి. జపాన్‌ యెన్‌ 6 శాతం, ఫిలిప్పీన్‌ పెసో 5.74 శాతం, దక్షిణ కొరియా వాన్‌ 2.88 శాతం తగ్గాయి.  

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement