breaking news
Rs.13 crores
-
కప్ బోర్డు, సూట్ కేసుల నిండా నోట్ల కట్టలే
న్యూఢిల్లీ: నగరంలోని ఓ న్యాయసంస్ధ కార్యాలయం నుంచి ఐటీ అధికారులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ కైలాష్-1లో ఉన్న టీ అండ్ టీ న్యాయసంస్ధ కార్యాలయంపై శనివారం రాత్రి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.13.56కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు మొత్తం కార్యాలయంలోని కప్ బోర్డులు, సూట్ కేసుల్లో దాచి ఉంచినట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన నగదులో రూ.2.5 కోట్లు కొత్త నోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మిగతా రూ.7కోట్లకు పైగా పాత రూ.1000నోట్లు, రూ.3కోట్లు రూ.100 నోట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐటీ శాఖ అధికారులకు చేరవేయడంతో వారు అక్కడకు చేరుకున్నట్లు చెప్పారు. పోలీసులు దాడి నిర్వహించిన సమయంలో కార్యాలయం గదులన్నీ తాళాలు వేసి ఉంచారని, కేవలం కేర్ టేకర్ మాత్రమే అక్కడ ఉన్నట్లు తెలిపారు. కాగా, టీ అండ్ టీ కంపెనీకి ప్రమోటర్ గా పనిచేస్తున్న రోహిత్ టాండన్ అనే వ్యక్తి ఇంటిపై రెండు నెలల క్రితం ఐటీ శాఖ దాడులు చేసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించి దాడులు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు. -
ఐఎస్ టెర్రరిస్టుల వద్ద రూ.13 వేల కోట్లు
న్యూఢిల్లీ: మానవ సమూహం మధ్య బాంబులై పేలి మారణ హోమానికి పాల్పడుతూ ప్రపంచంలో భీతావహం సృష్టిస్తున్న ఐఎస్ టెర్రరిస్టు మూకలు నేడు అపార ధనరాశులు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం వారి వద్ద 13వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నట్టు ఓ తాజా అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఇటు డబ్బులోనూ అటు మారణహోమం సృష్టించడంలోను ప్రపంచంలోనే నెంబర్ వన్ టెర్రరిస్టు సంస్థగా ఐఎస్ ముద్రపడింది. సిరియా, ఇరాక్లలో పది చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ టెర్రరిస్టులు రోజూ 30 వేల నుంచి 40 వేల బ్యారెళ్ల వరకు అక్రమ మార్గంలో క్రూడాయిల్ విక్రయిస్తూ రోజుకు పది కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. టర్కీ, ఇరాన్, జోర్డాన్ దేశాలు చీకటి మార్గంలో టెర్రరిస్టుల నుంచి ఆ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నాయి. కిడ్నాప్‌ల ద్వారా ర్యాండమ్ కింద ఏడాదికి 300 కోట్ల రూపాయలను సమకూర్చుకుంటున్నాయి. ఇరాక్‌లో దాదాపు 40 శాతం గోధమ పంటను తమ ఆధీనంలోకి తెచ్చుకొని కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. సిరియాలో తమ ఆధీనంలో నివసిస్తున్న కోటి మంది ప్రజల నుంచి 20 శాతం ఆదాయం పన్నును వసూలు చేస్తున్నాయి. వాహనాల రాకపోకలపై రోడ్డు పన్నును విధిస్తున్నాయి. అంతేకాకుండా ఇస్లాం మతం పుచ్చుకోని క్రైస్తవుల నుంచి ప్రాణ రక్షణ పన్నును గుంజుతున్నాయి. ప్రాణ భీతితో దేశంవీడి వలస వెళుతున్న వారి నుంచి ఒక్కొక్కరి వద్ద ఆరున్నర వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. దౌర్జన్యం, బెదిరింపుల ద్వారా వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున నిధులను రాబడుతున్నాయి. ఇలా వచ్చిన సొమ్మును అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడానికి టెర్రరిస్టుల నియామకానికి వినియోగిస్తున్నాయి. మానవ బాంబులుగా మారేందుకు సిద్ధపడిన యువకులకు ముందుగానే కోట్ల రూపాయలను అందజేస్తున్నాయి. ముందుగా సిరియా, ఇరాక్ ప్రభుత్వ సైనికులను, వారికి మద్దతిస్తున్న యూరప్, మధ్యప్రాచ్య దేశాల సైనికులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిన ఐఎస్ టెర్రరిస్టులు ఇప్పుడు పంథా మార్చారు. జన సమూహాన్ని ఎంచుకొని మారణ హోమాన్ని సృష్టించడం లక్ష్యంగా చేసుకొన్నారు. ఆ వ్యూహంలో భాగంగానే పారిస్‌లో ఏకకాలంలో ముంబై తరహా దాడులు జరిపి దాదాపు 140 మందిని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు.