breaking news
Recommendation letters
-
బేరం కుదిరితేనే బదిలీ
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు లేకుండా ఉద్యోగులు ఎవరూ బదిలీల కోసం తమ వద్దకు రావద్దని ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు! ఎలాంటి రిక్వెస్టు అయినా ఎమ్మెల్యే లేఖ ద్వారానే చేస్తామని ఏలూరు జిల్లాలో కరాఖండిగా చెబుతుండటంతో ఉద్యోగులంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో ఓ మండల స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తనను బదిలీ చేయాలని పలు ఆధారాలు చూపించి అభ్యర్థించినా అధికారులు పక్కన పడేశారు. బదిలీకి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే మరో ఉద్యోగికి లేఖ ఇవ్వడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తన అవసరాలు, ఇబ్బందులు, అర్హతలు వివరించి ఒక మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థించగా సంబంధిత ఎమ్మెల్యే సిఫారసుతో రావాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఉద్యోగి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయించగా ఆ పోస్టును అప్పటికే ఇతరులకు బేరం పెట్టినట్లు తెలియడంతో హతాశుడయ్యాడు! పట్టు పరిశ్రమ శాఖలో ముడుపులు తీసుకుని బదిలీలు చేయడంపై కొందరు ఉద్యోగులు చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పోస్టుల కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు చేతులు మారుతున్నట్లు వెల్లడించారు. ఏడీ పోస్టు కోసం కదిరిలో రూ.5 లక్షలు, చిత్తూరు జిల్లాలో రూ.8 లక్షలు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.10 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. ఆదాయ మార్గంగా.. పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాల్సిన ఉద్యోగుల బదిలీలను టీడీపీ కూటమి సర్కారు అక్రమాల పర్వంగా మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకపోగా కనీసం బదిలీల విషయంలోనూ కరుణించడం లేదు. నిబంధనలు, మార్గదర్శకాలతో పని లేకుండా రాజకీయ జోక్యంతో బదిలీలు చేపడుతోంది. అన్ని స్థాయిల పోస్టుల్లో ఏ ఉద్యోగి ఉండాలనే విషయాన్ని ఆయా నియోజకవర్గాలకు చెందిన కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే నిర్ణయిస్తున్నారు. వారి మాట కాదనేందుకు ఉన్నతాధికారులు సాహసించడం లేదు. మే 15వతేదీ నుంచి జూన్ 2వతేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేశారు. ఈ సమయంలో బదిలీలకు అవకాశం కల్పించి మార్గదర్శకాలు విడుదల చేసినా అవి ఎక్కడా అమలు కావడంలేదు. ఎమ్మెల్యేల సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరుగుతుండడంతో ఉద్యోగులకు దిక్కు తోచడం లేదు. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వితంతు మహిళా ఉద్యోగులు, ఇతర సమస్యలు ఉన్నవారు తగిన ఆధారాలతో బదిలీల కోసం అభ్యర్థించే వీలున్నా టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు వారికి ఆదాయం సమకూర్చే కార్యక్రమంగా మారిపోయింది! సిఫారసు లేఖల కోసం అగచాట్లు.. రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో ఉద్యోగులు సిఫారసు లేఖల కోసం టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల్లో తమ పనులు చేసే వారిని, తమ మాట వినే వారిని నియమించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు చెబితేనే ఆయా చోట్ల పోస్టింగ్‌లు ఇస్తామని కలెక్టర్లు, జేసీలు, ఇతర అధికారులు చెబుతున్నారు. బదిలీలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు, నిబంధనలున్నా వాటిని పక్కనపెట్టి ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తెచ్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. సిఫారసులు లేకుండా వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత వారితో మాట్లాడి ధ్రువీకరించుకున్నాకే పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు. వేలం పాటల తరహాలో.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సామాజిక వర్గం, డబ్బులు తదితర అంశాలు బేరీజు వేసుకున్నాకే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. చాలాచోట్ల డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్, తహశీల్దార్ కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తహశీల్దార్, ఎంపీడీఓ పోస్టుల కోసం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఎంపీడీవోలు, ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సులు లాంటి పోస్టుల కోసం కూడా వసూళ్లకు దిగుతున్నారు. అడిగినంత డబ్బులిచ్చిన వారికే సిఫారసు లేఖలు అందుతున్నాయి. కొందరికి సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని ఇతరులు ముందుకు రావడంతో మొదట ఇచ్చిన లేఖను పట్టించుకోవద్దని ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మండల స్థాయి కూటమి నేతలు ఈ సిఫారసు లేఖలతో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్లి సిఫారసు లేఖలు ఇప్పిస్తున్నారు. తిరుపతి అర్బన్ తహశీల్దార్ పోస్టు రూ.కోట్లు! అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉన్న తిరుపతి జిల్లాకు చెందిన ఒక తహశీల్దార్‌కి అర్బన్‌లో పోస్టింగ్ ఇచ్చేందుకు రూ.కోట్లలోనే బేరం కుదిరినట్లు తెలిసింది. గతంలో ఆయన రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పని చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలడంతో సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన్ను కీలకమైన తిరుపతి అర్బన్ తహశీల్దార్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. కూటమి పార్టీ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇదేం వివక్ష?.. తిరుమలకే వచ్చి తాడో పేడో తేల్చుకుంటాం
తిరుపతి, సాక్షి: సిఫార్సు లేఖల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఆయన.. లెటర్ల అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో టీటీడీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఉమ్మడి స్టేట్‌లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులందరి సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించేవాళ్లు. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ వివక్ష బాధాకరం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలక మండలి కూడా అందుకు అంగీకరించింది. అయితే.. స్వయంగా సీఎం ఆదేశించినా.. అధికారులు మాత్రం అమలు చేయడం లేదు.. ఎందుకు?. తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, గదుల సౌకర్యం కల్పించాలి. ఈ వివక్షపై టీటీడీ పునరాలోచించాలి. ఈ విషయమై పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించాలి. వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు జారీ చేస్తాం. అనుమతించకపోతే ఎమ్మెల్యేలంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం. పార్టీలకతీతంగా నేను ఇది చెబుతున్నా’’ అని హెచ్చరించారాయన. -
తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై టీటీడీ నిఘా
-
శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖ ; వ్యక్తి అరెస్ట్
సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖలను పంపిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన వెంకట రత్నారెడ్డి అనే వ్యక్తి, ముంబాయిలో ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్ అంటూ తిరుమల జేఈవో కార్యాలయానికి సిఫారసు లేఖలు పంపించాడు. పరిశీలించిన కార్యాలయ సిబ్బంది నకిలీ లేఖగా గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గతంలోనూ ఇదే తరహాలో దర్శనం చేసుకున్నట్టు రత్నారెడ్డి వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సిఫారసు లేఖలను జేఈవో కార్యాలయ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. -
రథ సప్తమికి సిఫారసు లేఖలు రద్దు
సాక్షి, తిరుమల: ఈనెల 24న రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆరోజున ఆర్జిత సేవలు, వృద్దులు, చంటిపిల్లల దర్శనాలు రద్దు చేశామని, 25,26,27 తేదీలలో సిఫారసు లేఖలు రద్దు చేశామని, ప్రొటోకాల్ వారికి మాత్రమే విఐపి దర్శనాలు ఉంటాయని వివరించారు. రథసప్తమినాడు శ్రీవారు ఏడు వాహనాలపై తిరు వీధుల్లో ఊరేగుతారని, ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి చివరగా చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారని ఆయన తెలిపారు. గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రతి గ్యాలరీకి ఓ టిటిడి ఉద్యోగి, నాలుగు మాడ వీధుల్లో ఎనిమిదిమంది ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి నుండి టీటీడీ సేవలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని జేఈఓ స్పష్టం చేశారు. -
కాపు రుణాలు తమ్ముళ్లకే...
* లబ్ధిదారులకు మొండిచేయి * టీడీపీ నేతల సిఫారసు లేఖలు * జాబితాలో ఉన్న వారికే రుణాలు * అడ్డదారిలో దరఖాస్తుల పరిశీలన సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారపార్టీ నేతల పైరవీలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వృద్ధులు, వికలాంగుల పింఛన్లు.. రేషన్‌కార్డులు.. వరద పరిహారం.. ఇలా గ్రామాల్లో పనులు కావాలంటే టీడీపీ నేతలు చెప్పిన వారికే ఇస్తున్నారు. అర్హతలు పక్కనపెట్టి వారి సిఫారసు లేఖలకే ప్రాధాన్యం ఇస్తుండటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. తాజాగా కాపుల పేరున మంజూరైన బ్యాంకు రుణాలు సైతం టీడీపీ నేతలు, అనుచరులు, కార్యకర్తలు పంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తునిలో జరిగిన కాపు ఉద్యమంతో టీడీపీ ప్రభుత్వం ఆ సామాజికవర్గం నుంచి వ్యతిరేక రాకుండా ఉండేందుకు సబ్సిడీ రుణాలు ప్రకటించింది. జిల్లా మొత్తానికి 2,462 మంది కాపు, తెలగ, ఒంటరి, బలిజ సామాజికవర్గీయులకు సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.లక్ష సబ్సిడీతో రూ.7కోట్లు వారికి ఇవ్వటానికి సర్కారు నిర్ణయించింది. అయితే జిల్లావ్యాప్తంగా 12,508 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలా వచ్చిన దరఖాస్తులను మంగళవారం పరిశీలించారు. అయితే ఆ రుణాలు కూడా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అడ్డదారిలో టీడీపీ నేతలే దండుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీ నేతలు సిఫారసు లేఖలు : కాపుల పేరుతో మంజూరైన రుణాలు మొత్తాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డదారిలో మంజూరు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులోభాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు వారి వారి అనుచరుల పేర్లతో కూడిన సిఫారసు లేఖలను అధికారులకు పంపినట్లు తెలిసింది. అదేవిధంగా మంగళవారం దరఖాస్తు పరిశీలనలోనూ టీడీపీ నేతల అనుచరులవే ముందుగా చూసి పంపేశారు. ఉదయం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నవారిని పక్కనపెట్టేశారు. దీంతో అనేకమంది లబ్ధిదారులు సాయంత్రం వరకు క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే దరఖాస్తుల పరిశీలనకు 21 బ్యాంకులు, 65 బ్రాంచ్‌లకు సంబంధించిన అధికారులు హాజరుకావాల్సి ఉంది. అయితే దరఖాస్తుల పరిశీలనలో కేవలం 25 మంది అధికారులు మాత్రమే కనిపించారు. మిగిలిన వారు హాజరుకాకపోవటంతో దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అనర్హులకే పెద్దపీట: కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది అనర్హులే ఉన్నారు. ధనవంతులు అనేకమంది దరఖాస్తు పరిశీలనకు రావటం కనిపించింది. వారంతా టీడీపీ నేతలు, వారి బంధువులు, కార్యకర్తలు ఉన్నారు. అలావచ్చిన వారికే బ్యాంకర్లు కూడా పెద్దపీట వేశారని విమర్శలు వినిపిస్తున్నా యి. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటే కాపు రుణాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా కనిపించలేదని నెల్లూరుకు చెందిన రమణరావు ఆందోళన వ్యక్తం చేశారు.