ఫిలింనగర్లో రేషన్ దుకాణం సీజ్
హైదరాబాద్: సరుకుల పంపిణీలో అవకతవకలు, నిల్వ వివరాలు సరిగా లేకపోవడంతో జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని నంబర్ 831 రేషన్‌షాప్‌ను అధికారులు సీజ్ చేశారు. స్థానికుల నుంచి పలు ఆరోపణలు రావటంతో రేషనింగ్ సర్కిల్-7 అధికారులు గౌతంనగర్ బస్తీలో ఉన్న ఈ దుకాణంపై బుధవారం దాడులు జరిపారు. రికార్డులను పరిశీలించారు.
స్టాక్ రిజిష్టర్ పూర్తిగా అవకతవకలతో ఉంది. బాలాజీ అనే డీలర్ పేరుతో ఉన్న ఈ షాపును మిషాక్ అనే వ్యక్తి బినామీగా నడిపిస్తున్నాడు. షాప్‌ను సీజ్ చేసిన అనంతరం ఏఎస్వో ప్రభాకర్ కార్డుదారులకు సమీపంలో ఉన్న మరో షాప్‌ను కేటాయించారు. మూడు రోజుల పాటు ఇదే షాపు నుంచి సరుకులు పంపిణీ అవుతాయని చెప్పారు. అనంతరం భగత్‌సింగ్ కాలనీలో ఉన్న షాప్‌నంబర్ 814 నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని కార్డుదారులకు సూచించారు.